Published : 01 Oct 2022 03:51 IST

వ్యవసాయ క్షేత్రం.. అదే రాజసం

ఈనాడు, హైదరాబాద్‌

స్థిరాస్తి రంగంలో ఇటీవల బాగా ప్రాచుర్యంలో ఉన్న వాటిలో ఫాంల్యాండ్‌ ప్రాజెక్ట్‌లు ఒకటి. హైదరాబాద్‌లో ఎంతోకాలంగా వ్యవసాయ క్షేత్రాల పోకడ ఉన్నప్పటికీ, కొవిడ్‌ తర్వాత బాగా పెరిగింది. ఇందులోనూ ఇటీవల కాలంలో చాలా మార్పులొచ్చాయి. ప్రస్తుతం నాలుగో తరం ప్రాజెక్టులు వస్తున్నాయని డెవలపర్లు అంటున్నారు.

హైదరాబాద్‌ చుట్టుపక్కల పూర్వ జీవో 111 పరిధిలో, కన్జర్వేషన్‌ జోన్‌లో ఎక్కువగా వ్యవసాయ క్షేత్రాలున్నాయి. పూర్తిగా నిర్మాణాలకు అనుమతి లేకపోవడంతో వ్యవసాయంపై ఆసక్తి ఉన్నవారు, కాంక్రీట్‌ జంగిళ్లకు దూరంగా ప్రకృతి ఒడిలో ఆవాసం ఉండాలని కోరుకునేవారు ఇక్కడ ఫాంహౌస్‌లు నిర్మించుకుంటున్నారు.

మొదట్లో..
నగర శివారులో మొదటి దశలో ఎక్కువగా గండిపేట, మొయినాబాద్‌ చుట్టుపక్కల వ్యవసాయ క్షేత్రాలు వచ్చాయి. నగరానికి దగ్గరగా ఉండటంతో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఎక్కువగా ఇక్కడ పొలాలను కొనుగోలు చేసి చుట్టూ కంచె వేసి వ్యవసాయం చేసేవారు. 5-20 ఎకరాల మేర కొనుగోలు చేశారు. కొంతమేర విలాసవంతమైన ఇల్లు, ఈతకొలను వంటివి నిర్మించుకుని వారాంతాల్లో వెళ్లి సరదాగా గడిపివచ్చేవారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో వేడుకలు చేసుకొనేవారు. నిర్వహణ వ్యయం గురించి ఈ స్థాయి వారు పెద్దగా ఆలోచించరు. ఫలితంగా చాలావరకు క్షేత్రాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. జనావాసాలకు దగ్గరగా ఉన్న క్షేత్రాల్లో మాత్రం కొన్ని బహుళంతస్తుల భవనాలు, విల్లాలు నిర్మించారు.

వారి అనుకరణతో..
ప్రముఖుల స్ఫూర్తితో ఎగువ మధ్య తరగతి, ఐటీ వర్గాలు సైతం వ్యవసాయ భూమి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. వీరు నగరానికి చేరువలో కన్జర్వేషన్‌ జోన్‌లో పొలాలను కొని వ్యవసాయ క్షేత్రాలుగా మార్చుకున్నారు. కొన్న మొదట్లో హుషారుగా వ్యవసాయం, కూరగాయలు, పండ్ల తోటల పెంచారు. పొలం పనులు చూసేందుకు ఒక జంటను అక్కడే ఉంచేవారు. వీరు సరిగా లేకపోయినా, ఊళ్లకు వెళ్లినా క్షేత్రం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారేది. ఇక్కడికి రావడం ఇష్టమే అయినా అంత పెద్ద క్షేత్రంలో ఒంటరి అనే భావం కలిగేది. భద్రతా ప్రశ్నార్థకమే. అధికులు నిర్వహణ వ్యయాన్ని భారంగా భావించారు. పెద్దగా శ్రద్ధ కనబర్చడం మానేశారు. ఈలోగా మంచి ధరలు రావడంతో చాలా మంది విక్రయించేశారు. అవి ఇప్పుడు పలువురి చేతులు మారాయి.

ఉమ్మడి సాగు దిశగా..
వ్యవసాయ క్షేత్రాల నిర్వహణలో కొనుగోలుదారుల ఇబ్బందులను గ్రహించిన స్థిరాస్తి, తదితర సంస్థలు ఉమ్మడి వ్యవసాయాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. ముందుగా పొలాలను కొనుగోలు చేసి ఎకరాల వారీగా ఆసక్తి ఉన్నవారికి విక్రయించడం ప్రారంభించాయి. నగరానికి 50-100 కి.మీ. దూరంలో ఎక్కువగా ఈ తరహా ప్రాజెక్టులను చేపట్టాయి. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో అక్కడ గడిపేలా రిసార్టు గదులను నిర్మించాయి. ఆసక్తి ఉన్నవారు పొలం పనులు చేసుకోవచ్చు. సాగు పాఠాలు పిల్లలకు నేర్పించవచ్చు. తమ సొంత పొలంలో పండిన కూరగాయలు, ఆకుకూరలు, పాలు, పండ్లు ఇంటికి తెచ్చుకోవచ్చు. వెళ్లలేని వారు కోరితే హైదరాబాద్‌లోని ఇళ్లకు అక్కడ పండిన పంటను, ఉత్పత్తులను ఇళ్లకు పంపిస్తున్నారు. ఈ పోకడ ఇప్పటికీ కొనసాగుతోంది. కాకపోతే అక్కడే ఎక్కువ రోజులు ఉండలేని పరిస్థితి.


నాలుగో తరం

వ్యవసాయ క్షేత్రంలోనే ఎక్కువ రోజులు ఉండాలనుకునే వారికి నాలుగో తరం ప్రాజెక్టులు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ తరహా ఫాంల్యాండ్‌లు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. తక్కువలో తక్కువ పావు ఎకరం నుంచి మొదలవుతుంది. కొనుగోలు చేసిన భూమిలో ఒక మూలకు చిన్న కుటీరం వేసుకుంటారు. ప్రాంతీయ వలయ రహదారి లోపల ఈ తరహా ఫాంహౌస్‌లు ఎక్కువగా నిర్మించుకుంటున్నారు. అక్కడి నుంచి పనిచేస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టుల్లో 20 నుంచి 30 శాతం మంది అక్కడే స్థిర నివాసం ఉంటున్నారు. అవసరం ఉన్నప్పుడు నగరానికి వస్తున్నారు. ఇక్కడే క్లబ్‌హౌజ్‌, ఈతకొలను, ఇండోర్‌, అవుట్‌డోర్‌ గేమ్స్‌ ఉంటున్నాయి. ఇక ఎవరి ఫాంల్యాండ్‌లో వారు కొంత కిచెన్‌ గార్డెన్‌, కొంతభాగం గార్డెనింగ్‌కు, మిగతా భాగంలో ఔషధ, ఇతర పూలు, పండ్ల మొక్కలను పెంచుకుంటున్నారు. ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు