పండగ వేళల్లో సొంతింటికి ఆఫర్లు

గృహ నిర్మాణ మార్కెట్లో పండగల వేళ కొనుగోలుదారులను ఆఫర్లు ఊరిస్తున్నాయి. స్థిరాస్తి సంస్థలు పలు ఆకర్షణీయ బహుమతులు ప్రకటిస్తున్నాయి. సొంతింటికిది అనువైన సమయమని చెబుతున్నాయి.

Updated : 08 Oct 2022 03:48 IST

ఈనాడు, హైదరాబాద్‌

గృహ నిర్మాణ మార్కెట్లో పండగల వేళ కొనుగోలుదారులను ఆఫర్లు ఊరిస్తున్నాయి. స్థిరాస్తి సంస్థలు పలు ఆకర్షణీయ బహుమతులు ప్రకటిస్తున్నాయి. సొంతింటికిది అనువైన సమయమని చెబుతున్నాయి. జీఎస్‌టీ సున్నా అని.. ఫ్లాట్‌ కొంటే  ఇంటీరియర్స్‌, కారు ఉచితమంటూ కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పండగ వేళలో ఎక్కువ ఫ్లాట్లను విక్రయించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు నిర్మాణదారులు చదరపు అడుగు ధరను సైతం తగ్గిస్తున్నారు.

నగరంలో చిన్న, పెద్దా, కొత్త సంస్థలు పలు కొత్త నిర్మాణాలు చేపట్టాయి. కొవిడ్‌ తర్వాత భారీ స్థాయిలో ఫ్లాట్లను, విల్లాలను కడుతున్నాయి. డిమాండ్‌కు మించి కొత్త ప్రాజెక్టులు మొదలెట్టడంతో మార్కెట్లో సరఫరా పెరిగిందని బిల్డర్లే అంగీకరిస్తున్నారు. అపార్ట్‌మెంట్ల నుంచి విల్లాల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ప్రారంభంలో బుకింగ్‌లు ఆశాజనకంగా ఉన్నాయి. తర్వాత మార్కెట్‌ కొంత స్తబ్ధుగా మారింది. కొన్ని విభాగాలు మినహాయించి మిగతా చోట్ల విక్రయాలు ఆశించినట్లుగా లేవు. మరోవైపు పోటీ నేపథ్యంలో కొనుగోలుదారులకు ఛాయిస్‌లు పెరిగాయి. వీరిని ఆకట్టుకునేందుకు కొందరు బిల్డర్లు రాయితీలు ప్రకటిస్తున్నారు.

భారం తగ్గించేలా..
పూర్తైన ఫ్లాట్లకు జీఎస్‌టీ వర్తించదు కాబట్టి కొనుగోలుదారులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. నిర్మాణంలో ఉన్నవాటికి 5 శాతం జీఎస్‌టీ చెల్లించాలి. ఈ భారం కొంత తగ్గించేందుకు కొందరు బిల్డర్లు ముందుకొస్తున్నారు. బ్యాంకు రుణంతో ఇల్లు కొనుగోలు చేసినవారికి నిర్మాణం పూర్తయ్యేవరకు ఈఎంఐ భారం లేకుండా నెలవారీ అద్దెను తామే చెల్లిస్తామంటోంది ఒక సంస్థ. చదరపు అడుగుకు నెలకు రూ.10 చెల్లిస్తామంటోంది. మరోసంస్థ. 12 నెలల ఈఎంఐ చెల్లించేందుకు కొంతమంది బిల్డర్లు ముందుకొస్తున్నారు. చాలా సంస్థలు ప్రాథమిక చదరపు అడుగు ధర రూ.250 నుంచి రూ.500 వరకు తగ్గిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఫ్లోర్‌ రైజింగ్‌ ఛార్జీలను మాఫీ చేస్తామంటుంటున్నాయి. పండగల వేళ ప్రతి బుకింగ్‌పై కారు ఉచితమని ఒక సంస్థ అంటే.. ఏసీలు ఉచితమని మరికొన్ని సంస్థలు ఊరిస్తున్నాయి. వచ్చేది దీపావళి కాబట్టి కొందరు బంగారు నాణెం ఇస్తామని ప్రకటనలు ఇస్తున్నారు.  ఇంటికే ధర చెల్లిస్తే చాలు.. తాము కల్పించే సౌకర్యాలకు అదనంగా ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదని ఒక సంస్థ అంటోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని