దీపావళికి ఇంటికి రంగులు వేయిస్తున్నారా?

దీపావళి పండగకు ఇంటికి రంగులేసి కొత్తగా ముస్తాబు చేసే యోచనలో ఉన్నారా? పాత రోజుల్లో అయితే పండక్కి ఏటా రంగులు వేసేవారు. ఇప్పుడు వచ్చిన పెయింట్స్‌తో ఐదు నుంచి పదేళ్లకు ఒకసారి వేస్తున్నారు. ధరలకు వెనకాడకుండా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు.

Published : 15 Oct 2022 02:40 IST

తక్కువ వీవోసీవి ఎంపిక చేసుకోవడం మేలు

మార్కెట్లో గ్రీన్‌ప్రో ఉత్పత్తులు లభ్యం

ఐజీబీసీ నిపుణుల సూచనలు

ఈనాడు, హైదరాబాద్‌

దీపావళి పండగకు ఇంటికి రంగులేసి కొత్తగా ముస్తాబు చేసే యోచనలో ఉన్నారా? పాత రోజుల్లో అయితే పండక్కి ఏటా రంగులు వేసేవారు. ఇప్పుడు వచ్చిన పెయింట్స్‌తో ఐదు నుంచి పదేళ్లకు ఒకసారి వేస్తున్నారు. ధరలకు వెనకాడకుండా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఉపయోగించే రంగులు ఎలాంటివి అని ఒక్కసారైనా ఆలోచించారా? ఈసారి పర్యావరణానికి తక్కువ హాని చేసే.. వాసన రాని, కాలుష్యం వెదజల్లని సున్నా వొలటైల్‌ ఆర్గానిక్‌ కంపౌండ్స్‌(వీవోసీ) ఉండే హరిత రంగులను ఉపయోగించాలని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉండేవారికి ఆరోగ్యంతో పాటూ ఉత్పాదకత పెరుగుతోందని చెబుతున్నారు.

ఇంటి లోపల రంగులు వేయించేటప్పుడు ఏ గదిలో ఏ రంగు వేయాలో కచ్చితమైన ఆలోచనతో ఇంటి యజమానులు ఉంటున్నారు. పెయింట్‌ వేసే గుత్తేదారుకు తమ రంగుల ఎంపికను ముందే చెబుతున్నారు. నాణ్యమైన రంగులను అందించే బ్రాండ్‌లను వాడుతున్నారు. ఇకపై రంగుల డబ్బాలు, బ్రాండ్‌లను ఎంపిక చేసుకునేటప్పుడు ఆయా రంగుల్లో వీవోసీ శాతం ఎంత ఉందో అడిగి తెలుసుకోవాలి. ఆహ్లాదమే కాదు ఆరోగ్యంగా ఉండాలంటే దీని శాతం తక్కువ ఉండేలా చూసుకోవాలి.

రెండురకాల్లో...

ప్రస్తుతం ఉపయోగిస్తున్న రంగుల్లో వాటర్‌ పెయింట్స్, ఆయిల్స్‌ పెయింట్స్‌ అనే రెండు రకాలు ఉన్నాయి. నిర్వహణ సులువుతో పాటూ ఎక్కువ కాలం మన్నిక, మరకలు పడినా నీటితో తొలగించుకునే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఇళ్లలో ఎక్కువగా ఆయిల్‌ పెయింట్స్‌ను వాడుతున్నారు. ముఖ్యంగా వంటగదుల్లో వీటి వాడకం ఎక్కువ. గోడలపై మెరుస్తూ ఉండటాన్ని ఆయిల్‌ పెయింట్‌గా గుర్తించవచ్చు. సహజంగానే వీటిలో రసాయన మిశ్రమాలు అధికంగా ఉంటాయి. ఎక్కువ వివోసీ విడుదల చేస్తుంటాయి. గది ఉష్ణోగ్రతలు పెరిగిన సమయంలో వీటి నుంచి వెలువడే వాసనలు, కాలుష్య ఉద్గారాలు పెరుగుతుంటాయి.

ఎలాంటి ప్రతికూలతలు

అధిక వీవోసీ ఉండే రంగులు ఇంటికి వేసినప్పుడు ఘాటు వాసనలు కొన్నిరోజుల పాటు చికాకు పెడుతుంటాయి. గదిలో గాలి నాణ్యత పడిపోతుంది. వాసన పీల్చినప్పుడు కళ్లలోంచి నీరు కారడం, దగ్గు, తుమ్ములు, వాంతులు, అలర్జీ వంటివి ఇబ్బంది పెడుతుంటాయి. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఇంట్లో త్వరగా ఆహారం పాడవడానికి దారితీస్తుంది. తరచూ అనారోగ్యం, దీర్ఘకాలంలో ఇంట్లోవారి ఉత్పాదకత పడిపోతుందని వీటిపై అధ్యయనం చేస్తున్న ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) నిపుణులు చెబుతున్నారు.

ఎలా చూడాలి

రంగులను ఎంపిక చేసేటప్పుడు డబ్బాపై ధరతో పాటూ వీవోసీ శాతం ఎంత ఉందో చూడాలి. వాటర్‌ పెయింట్స్‌లో ఇది గరిష్ఠంగా లీటర్‌కు 50 గ్రాములు మించరాదు. ఆయిల్‌ పెయింట్స్‌లో గరిష్ఠంగా 150 గ్రాములు మించరాదు. హరిత ఉత్పత్తుల్లో సున్నా వీవోసీతో తయారు చేస్తున్న సంస్థలు ఉన్నాయి. మరికొన్ని సంస్థలు తయారు చేసే కొన్ని రంగుల్లో 20 నుంచి 30 శాతం మధ్యలో ఉంటోంది. వీటిని ఎంపిక చేసుకోవచ్చు. ప్రముఖ బ్రాండ్లలోనూ ఇవి దొరుకుతున్నాయి. వాసనరాని రంగులని కూడా విక్రయిస్తున్నారు. కొనేటప్పుడు, గుత్తేదారుకు కాంట్రాక్ట్‌ ఇచ్చినప్పుడు వీటి గురించి చర్చించాలి.

ఇప్పటికే వేసి ఉంటే..

పండగ కోసం ఇప్పటికే రంగులు వేయడం పూర్తైనట్లతే.. వీవోసీ ప్రభావం తగ్గించుకునేందుకు గది తలుపులు, కిటికీలు ఎక్కువ గంటలు తెరిచి ఉంచాలి. కొత్త ఇంటికైతే రంగులు వేసిన కొన్ని రోజుల తర్వాత ఇంట్లోకి దిగాలి. హడావుడిగా ఆఖర్లో రంగులు కాకుండా కొద్దిరోజుల ముందే పూర్తయ్యేలా జాగ్రత్తపడాలి.


ఇవే కావాలని అడగండి

- కె.సంపత్‌ కుమార్, సీనియర్‌ కౌన్సిలర్, సీఐఐ-ఐజీబీసీ

గోడలకు వేసే రంగులు ఇంటికి అందం తేవడంతో పాటు గాలి నాణ్యతను ప్రభావితం చేస్తాయి. రంగుల్లో వాడే రసాయనాలు వొలటైల్‌ ఆర్గానిక్‌ కంపౌండ్స్‌(వీవోసీ) ఇందుకు కారణం. రంగులు త్వరగా ఆరడానికి వీవోసీని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి చాలా ప్రమాదకరం. సూర్యకాంతికి ఆవిరై, వాతావరణంలోని నైట్రోజన్‌ ఆక్సైడ్‌తో రసాయన చర్య వల్ల ఇంట్లో ఉండేవారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. వాతావరణంలోకి వెలువడే ఉద్గారాలతో పంటలు, అడవులు, పర్యావరణ వ్యవస్థపైన ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి తక్కువ వీవోసీ ఉన్న రంగులు ఇళ్ల లోపల గోడలకు వేసుకోవాలి. దుకాణాల్లో విక్రయించే రంగుల డబ్బాలపై ఎంత శాతం వీవోసీ అనేది కంపెనీలు ముద్రిస్తున్నాయి. 20 నుంచి 30 శాతం వీవోసీ ఉన్న వాటిని వేయించుకోవచ్చు. సున్నా వీవోసీ ఉన్న రంగులూ మార్కెట్లో ఉన్నాయి. గతంలో వీటి ధరలు అధికంగా ఉండేవి. ఇప్పుడు సాధారణ రంగుల ధరలకు కంపెనీలు విక్రయిస్తున్నాయి. వీటిని సులువుగా గుర్తించేందుకు థర్డ్‌ పార్టీ ధ్రువీకరించిన ఉత్పత్తులపై గ్రీన్‌ప్రో ముద్ర ఉంటుంది. రంగుల ఎంపికలో జాగ్రత్త పాటించాలి. తేలికపాటివి మేలు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని