భవనాలు కట్టడం సులువైందిలా..!

నగరంలో అత్యంత ఎత్తైన వాణిజ్య భవనాలు చకచకా నిర్మాణమవుతున్నాయి. 50.. అంతకంటే ఎక్కువ అంతస్తుల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. సాధారణంగా వీటిని పూర్తిచేయాలంటే ఐదేళ్లైనా పడుతుందని అంచనా వేస్తారు.

Published : 29 Oct 2022 01:17 IST

ప్రీకాస్టింగ్‌ విధానంలో చకచకా ఆకాశహర్మ్యాలు  

దేశంలోనే అత్యంత ఎత్తైన వాణిజ్య టవర్‌ నిర్మాణం ఇక్కడే

ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో అత్యంత ఎత్తైన వాణిజ్య భవనాలు చకచకా నిర్మాణమవుతున్నాయి. 50.. అంతకంటే ఎక్కువ అంతస్తుల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. సాధారణంగా వీటిని పూర్తిచేయాలంటే ఐదేళ్లైనా పడుతుందని అంచనా వేస్తారు. ఆకాశానికి తాకుతాయా అన్నంత ఎత్తు వరకు కడుతున్న ఈ వాణిజ్య భవనాలను ఏడాదిన్నర నుంచి రెండేళ్లలోపే పూర్తిచేస్తుండటం విశేషం. అంత వేగంగా కట్టగలుగుతున్నామంటే ప్రీకాస్టింగ్‌ టెక్నాలజీ పుణ్యమే అంటున్నారు బిల్డర్లు.

నగరంలో ఐటీ రంగం విస్తరణతో వాణిజ్య భవనాలకు డిమాండ్‌ పెరిగింది. పలు అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో తమ ఐటీ కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో తమ క్యాంపస్‌లను ఇక్కడ ఏర్పాటు చేయగా.. మరిన్ని సంస్థలు వస్తున్నాయి. లీజింగ్‌ ఆశాజనకంగా ఉండటంతో రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు 25 నుంచి 30 అంతస్తుల్లో వాణిజ్య భవనాలను నిర్మించాయి. నానక్‌రాంగూడ, కోకాపేట, రాయదుర్గంలో నిర్మాణం పూర్తైన ఎత్తైన వాణిజ్య భవనాలు ఉన్నాయి. కొత్తగా నిర్మాణంలో ఉన్న వాణిజ్య భవనాల్లో పుప్పాలగూడలో 48 అంతస్తుల టవర్‌ వస్తుంది. దీన్ని మించి కోకాపేటలో 53 అంతస్తుల అత్యంత ఎత్తైన వాణిజ్య భవనం వస్తోంది. ఇక్కడ 30 నుంచి 38 అంతస్తుల్లో పలు భవనాలు వస్తున్నాయి. ఖాజాగూడలో 38 అంతస్తులు, నానక్‌రాంగూడలో 32 అంతస్తులతో పాటూ 25 అంతస్తుల పైన పలు నిర్మాణంలో ఉన్నాయి. అనుమతులు, ప్రతిపాదనల దశలో మరిన్ని ఆకాశహర్మ్యాల వాణిజ్య భవనాలు ఉన్నాయి.

వేగం పెరగడానికి...

ప్రీకాస్టింగ్‌ టెక్నాలజీ విధానంలో వాణిజ్య భవనాలను నిర్మిస్తుండటంతో అతి తక్కువ సమయంలో ఆకాశహర్మ్యాలను సైతం వేగంగా కట్టేయగలుగుతున్నారు. బడా బిల్డర్లు ఎక్కువగా ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. భవనం నిర్మించేందుకు కీలకమైన కాలమ్స్‌, బీమ్స్‌, కోర్‌ శ్లాబ్‌, సాలిడ్‌ శ్లాబ్‌, గోడలు, చివరికి మెట్లను కూడా ప్రీకాస్టింగ్‌లో ముందే సిద్ధం చేస్తున్నారు. వీటిని తీసుకెళ్లి బిగించేస్తున్నారు.  

* సాధారణంగా పునాది తీసి స్తంభాలు వేసి వాటి క్యూరింగ్‌ అయ్యాక కాలమ్స్‌, బీమ్స్‌ వేస్తుంటారు. ఇలా ఒక్కో దశకు చాలా సమయం పడుతుంది.

* సాధారణంగా భవనం మొత్తం బరువు మోసే కాలమ్స్‌ను సంప్రదాయ పద్ధతిలో నిర్మించిన దానికంటే ఐదు రెట్లు వేగంగా ప్రీకాస్టింగ్‌లో బిగించడం పూర్తవుతుందని నిర్మాణదారులు చెబుతున్నారు. ఎక్కువ బరువును సైతం తట్టుకోగలవు. డిజైన్‌, ఆకారం, వాడకంలో వెసులుబాటు ఉంటుంది.

సైట్‌లోనే ప్లాంట్‌

ప్రీకాస్టింగ్‌ నిర్మాణంలో ఉపయోగించే గోడలు, కాలమ్స్‌, బీమ్స్‌ వంటివన్నీ ఎక్కడో ప్లాంట్‌లో తయారై నిర్మాణ ప్రదేశానికి చేరుకుంటాయి. కిటికీలు, తలుపుల మాదిరే కాంక్రీట్‌ స్ట్రక్చర్‌ను సైతం కావాల్సిన డిజైన్‌ వివరాలు ఇస్తే ఆయా సంస్థలు రూపొందించి ఇస్తాయి. అయితే పెద్ద సంస్థలు తమ నిర్మాణ ప్రదేశంలోనే ఏకంగా ప్రీకాస్టింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసి వీటిని తయారు చేస్తున్నాయి. దీంతో రవాణా, సమయం మరింత కలిసి వస్తుందని భావిస్తున్నాయి.

వృథా తగ్గుతుంది

నిర్మాణంలో వ్యయం పెరగడానికి నిర్మాణ సామగ్రి వృథా కూడా ప్రధానమైన కారణం. ప్రీకాస్టింగ్‌ టెక్నాలజీతో వృథాకు అడ్డుకట్ట పడుతుంది. నాణ్యత సైతం పెరుగుతుంది.

తక్కువ మంది కార్మికులతో..

ఆకాశహర్మ్యాల నిర్మాణంలో వేలమంది కార్మికుల అవసరం ఉంటుంది. నైపుణ్యం కలిగిన తాపీ మేస్త్రీలు, కార్మికుల కొరత వేధిస్తోందని బిల్డర్లు అంటున్నారు. వీటి దృష్ట్యా ప్రీకాస్టింగ్‌లో తక్కువ మంది కార్మికులతో మరింత వేగంగా నిర్మాణాలను పూర్తి చేయడానికి వీలవుతుందని చెబుతున్నారు.


95 శాతం ఈ పద్ధతి లోనే...

- ఎం.కె.రవి సాయి, సీనియర్‌ ఉపాధ్యక్షుడు, మైహోం  

దేశంలో అత్యంత ఎత్తైన ప్రీకాస్ట్‌ టవర్‌ను కోకాపేటలో నిర్మిస్తున్నాం. 53 అంతస్తుల్లో వస్తుంది.  ఇది పూర్తైతే అతిపెద్ద ఐటీ భవనాల్లో ఒకటి అవుతుంది. నాణ్యతలో రాజీ లేకుండా వేగంగా నిర్మాణం పూర్తి చేసేందుకు సైట్‌లోనే ప్రీకాస్టింగ్‌ ప్లాంట్‌ను రూ.200కోట్లు వెచ్చించి ఏర్పాటు చేశాం. భవన నిర్మాణానికి ఉపయోగించే సామగ్రిలో 95 శాతం ప్రీకాస్టింగ్‌లో చేస్తున్నాం. తరలించడానికి, పైకి ఎత్తడానికి సాధ్యం కానీ అత్యంత బరువు ఉండే నిర్మాణాలను మాత్రమే సంప్రదాయ పద్ధతిలో భవన నిర్మాణ సమయంలో అక్కడికక్కడ(ఇన్‌సితూ)లో చేస్తున్నాం. ఈ విధానంలో గరిష్ఠంగా 20 శాతం మంది కార్మికులతోనే నిర్మాణాలు పూర్తిచేయవచ్చు. నాణ్యత  చాలా మెరుగ్గా ఉంటుంది. పని ప్రదేశంలోనే ప్లాంట్‌ ఉంటే రవాణా ఖర్చులు ఉండవు. రవాణా సమయంలో వెలువడే కాలుష్య ఉద్గారాలు ఉండవు. ప్రీకాస్టింగ్‌లో పూర్తి నియంత్రణలో పని జరుగుతుంది కాబట్టి వృథా ఉండదు. వాణిజ్య భవనాల్లో ఈ విధానం అనుకూలంగా ఉంటుంది.  అందుకే వీటిలో తొలిసారి ప్రయత్నిస్తున్నాం. మున్ముందు గృహ నిర్మాణంలో ఉపయోగించే అవకాశం లేకపోలేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని