6డీలో నిర్మాణ పనులు

హైదరాబాద్‌లో మూడు నాలుగేళ్లుగా చూస్తే భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. పలు సంస్థలు గృహ, వాణిజ్య విభాగంలో ఆకాశహర్మ్యాలను చేపడుతున్నాయి. 45 నుంచి 55 అంతస్తుల మధ్య పలు ప్రాజెక్టులను బడా నిర్మాణ సంస్థలు మొదలెట్టాయి.

Published : 12 Nov 2022 01:03 IST

భారీ ప్రాజెక్టుల్లో ఆధునాతన బీమ్‌ సాంకేతికత వినియోగం  
ముందుగానే సుస్థిర మూల్యాంకనంతో సమయం, ఖర్చు ఆదా
ఆకాశహర్మ్యాల కట్టడాల్లో వినియోగిస్తున్న బడా సంస్థలు
ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌లో మూడు నాలుగేళ్లుగా చూస్తే భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. పలు సంస్థలు గృహ, వాణిజ్య విభాగంలో ఆకాశహర్మ్యాలను చేపడుతున్నాయి. 45 నుంచి 55 అంతస్తుల మధ్య పలు ప్రాజెక్టులను బడా నిర్మాణ సంస్థలు మొదలెట్టాయి. ఈ స్థాయి ప్రాజెక్టులు అనుకున్నది అనుకున్నట్లుగా గడువు లోపల పూర్తి చేయాలంటే సాంకేతిక తోడ్పాటు తప్పనిసరి. సామగ్రి పరంగా ఇప్పటికే ప్రీకాస్టింగ్‌ వైపు మళ్లారు. అయితే అంతకంటే ప్రధానమైంది ప్రణాళిక దశ. ఇక్కడ ఏ మాత్రం లోపాలు ఉన్నా పనులు ఆలస్యం కావడం, చేసిన పనిని కూల్చి మళ్లీ చేయడం, సామగ్రి వృథాతో ప్రాజెక్టు ఆలస్యంతో పాటూ వ్యయం పెరుగుతుంది. దీన్ని అధిగమించేందుకు బీమ్‌ 6డీ టెక్నాలజీని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ఉపయోగిస్తున్నాయి.

బీమ్‌ టెక్నాలజీలో..

2డీ, 3డీ గురించి తెలుసు.. నిర్మాణ రంగంలో ఇప్పుడు 6డీ వచ్చేసింది. ఇదొక సాఫ్ట్‌వేర్‌. ఇందులో  ఒక మోడల్‌ను అభివృద్ధి చేస్తారు. డిజైన్‌తో పాటూ సమయం, వ్యయం, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌, సుస్థిర మూల్యాంకనం, ఇతర్రతా.. ఇలా అన్ని అంశాలను  కంప్యూటర్‌లో ముందే చూస్తారు. ప్రతి అడుగు.. ముందే తెలిసిపోతుంది. ఒకే పనిని రెండుసార్లు చేసే పని తప్పుతుంది. వృథా ఉండదు. వచ్చే ఏడాది మార్చిలో పని ఏ దశలో ఉంటుంది అనేది ముందే చూడొచ్చు. అందుకు ఎంత పెట్టుబడి కావాలో కూడా చెబుతుంది. ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తాన్ని బట్టి పని ఎంత శాతం పూర్తయ్యింది?  పని ఎక్కడ ఆలస్యం అవుతోంది అనే విషయాలు తెలిసిపోతాయి.

అర్కిటెక్చర్‌ నుంచి స్ట్రక్చరల్‌ వరకు...

ఇప్పటివరకు అర్కిటెక్చర్‌ వాక్‌ త్రూలను చూశాం. ఇల్లు పూర్తయితే ఇంటిలోపల గదులు ఎలా ఉంటాయో ఆర్కిటెక్చర్‌ వాక్‌త్రూలో ముందే చూసే వీలుంది. ఇదే మాదిరి నిర్మాణం మొత్తాన్ని చూసేందుకు మెకానికల్‌ ఎలక్ట్రికల్‌ పంబ్లింగ్‌ (ఎంఈపీ), స్ట్రక్చరల్‌ పరంగా బీమ్‌ 6డీ ఉపయోగపడుతుంది అని బిల్డర్లు అంటున్నారు. 

భవిష్యత్తులో సమస్యలు రాకుండా

భారీ భవనాలను సాధారణంగా ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సంస్థలు నిర్వహిస్తుంటాయి. ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్‌,  భవనంలో ఉపయోగించిన పరికరాలు ఎక్కడ కొన్నారు? ఎంత విద్యుత్తు ఖర్చు అవుతుంది? వంటి వివరాలు తెలిస్తేనే సమర్థంగా నిర్వహించగలుగుతారు. బీమ్‌ 6 డీతో ఇలాంటి వెలుసుబాటు ఉంటుంది. నిర్మాణంలో ఉపయోగించిన ప్రతి సామగ్రి ఎక్కడ కొన్నారు? ఎంత ఖర్చు? అనే వివరాలు ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్‌ చేస్తారు. దీంతో భవిష్యత్తులో ఏదైనా సమస్య వచ్చినా..ఎక్కడ అనేది సులువుగా గుర్తించేందుకు, సరి చేసేందుకు దోహదం చేస్తుందని చెబుతున్నారు. ‘నిర్మాణ రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పు అని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. మన దగ్గర చిన్న ప్రాజెక్టుల్లో చాలా తక్కువ మంది ఉపయోగిస్తున్నారు. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నైపుణ్యం కావాలి. మేం భారీ ప్రాజెక్టులో బీమ్‌ 6డీని ఉపయోగిస్తున్నాం. ఇందుకోసం ఇక్కడి నుంచి సిబ్బందిని ఈ టెక్నాలజీ అధ్యయనానికి విదేశాలకు పంపాం. నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు అక్కడే కొంతకాలం పాటూ పరిశీలించి వచ్చారు. వీటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి’ అని మైహోమ్‌ సీనియర్‌ ప్రెసిడెంట్‌(ప్రాజెక్ట్స్‌) ఎం.కె.రవి సాయి ‘ఈనాడు’తో అన్నారు.
నిర్మాణపరంగా హైదరాబాద్‌ కొంత పుంతలు తొక్కుతోంది. పలు కొత్త సాంకేతికతలను భారీ ప్రాజెక్టుల్లో వినియోగిస్తూ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. పలు టెక్నాలజీలను మొదటిసారి పరిచయం చేస్తోంది. ఇతర మెట్రో నగరాలను అనుకరించే దశ నుంచి... ఆయా నగరాలే మనల్ని చూసి నేర్చుకునేలా ఆధునికతకు పెద్దపీట వేయడం ఇటీవల హైదరాబాద్‌ నిర్మాణ రంగంలో వచ్చిన ప్రత్యేక మార్పుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు చిన్న ప్రాజెక్టుల్లో వినియోగించిన బీమ్‌ టెక్నాలజీ 6డీని ఇక్కడ భారీ వాణిజ్య ప్రాజెక్టులో మొదటిసారి ఉపయోగిస్తున్నారు. 

సెల్లార్‌ తవ్వకాల పురోగతి డ్రోన్‌తో..

నగరంలో వస్తున్న భారీ ప్రాజెక్టుల్లో పార్కింగ్‌ కోసం మూడు నుంచి నాలుగు అంతస్తుల లోపల వరకు సెల్లార్లు తవ్వుతున్నారు. దీనికోసం చాలా సంస్థలు ఆరు నెలల నుంచి ఏడాది సమయం వెచ్చిస్తున్నాయి. హైదరాబాద్‌లో రాతినేలలు ఎక్కువ కాబట్టి భూగర్భం తవ్వకాల్లో బండలు బయట పడుతుంటాయి. వీటిన్నింటిని తొలగించి సకాలంలో పనులు మొదలెట్టాలంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ తప్పనిసరి. ఇందుకోసం హైదరాబాద్‌లో పలు కంపెనీలు డ్రోన్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు అభివృద్ధి చేశాయి. మొదట బోర్‌ తవ్వి డ్రోన్‌ ద్వారా ఫొటోలు తీసి విశ్లేషిస్తారు. దీంతో ప్రతిరోజూ ఎంత మేర తవ్వకాలు చేపట్టారనేది తెలుసుకుంటున్నారు. ఫలితంగా పనుల వేగం పెరిగిందని బిల్డర్లు చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని