భవనాలే కరెంట్‌ ఇస్తున్నాయ్‌

నగరాల్లో విద్యుత్తు వినియోగ అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తక్కువ విద్యుత్తుతో ఎక్కువ అవసరాలను తీర్చుకునేందుకు భవనాల్లో మెరుగైన పద్ధతులను అనుసరించడం అనివార్యం.

Published : 19 Nov 2022 01:28 IST

ఏడాదిలో 430 నుంచి 620కిపెరిగిన ఈసీబీసీ విద్యుత్తు ఆదా భవనాలు
ఈనాడు, హైదరాబాద్‌

నగరాల్లో విద్యుత్తు వినియోగ అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తక్కువ విద్యుత్తుతో ఎక్కువ అవసరాలను తీర్చుకునేందుకు భవనాల్లో మెరుగైన పద్ధతులను అనుసరించడం అనివార్యం. వాణిజ్య భవనాల్లో ఇదివరకు చదరపు మీటరుకు వార్షికంగా 400 వందల యూనిట్లపైనే ఖర్చు అయ్యేది. దీన్ని 150 కంటే తక్కువకు తీసుకొచ్చేందుకు  ఈసీబీసీ దోహదం చేస్తుంది. బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ(బీఈఈ) భవనాల్లో విద్యుత్తు వినియోగం తగ్గించేందుకు ఈసీబీసీ కోడ్‌ను తీసుకొచ్చింది. తెలంగాణలో దీని అమలుకు టీఎస్‌రెడ్కో నోడల్‌ ఏజెన్సీగా ఉంది.  ప్రణాళిక దశ నుంచి నిర్మాణ దశ వరకు బిల్డర్లకు ఈసీబీసీ అమలులో తోడ్పాటు అందిస్తోంది. 2017 నుంచి తెలంగాణలో వెయ్యి చదరపు మీటర్లు, ఆపై.. 2000 చదరపు మీటర్లు, ఆపై నిర్మించే బిల్టప్‌ ఏరియా కలిగిన వాణిజ్య భవనాలకు ఈసీబీసీని తప్పనిసరి చేశారు. కరెంట్‌ను అధికంగా వినియోగించే మల్టీప్లెక్స్‌లు, ఆసుపత్రులు, హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఈసీబీసీని తప్పనిసరి చేశారు.

పాత నిర్మాణాలకు..

ఈసీబీసీ, ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ రేటింగ్‌తో విద్యుత్తు ఆదా భవనాలు కొత్తగా నిర్మిస్తున్నారు సరే.. మరి పాత భవనాల సంగతి? వీటికి ఈసీబీసీలో కరెంటు ఆదా చర్యలు చేపడితే ఒకటి నుంచి ఐదు నక్షత్రాల రేటింగ్‌ ఇస్తున్నారు. ఇంట్లో విద్యుత్తు గృహోపకరణాలపై ఆదా చేసే కరెంట్‌ను బట్టి చుక్కల గుర్తులుంటాయి. ఇదే మాదిరి భవనాలకు విద్యుత్తు ఆదా తీరును బట్టి నక్షత్రాలు కేటాయిస్తారు. ఖైరతాబాద్‌లోని విద్యుత్తు సౌధ, సైఫాబాద్‌లోని ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయం, సికింద్రాబాద్‌ రైల్‌ నిలయం, మాదాపూర్‌లోని సీఐఐ-ఐజీబీసీ సెంటర్‌,  ఈసీఐఎల్‌లోని ఎన్‌ఎస్‌ఐసీ భవనం, డీఈ షా భవనం స్టార్‌ రేటింగ్‌ పొందాయి. వీటి సంఖ్య పెరగాల్సి ఉందని విద్యుత్తు రంగ నిపుణులు అంటున్నారు.

నెట్‌ జీరో ఎనర్జీ ఇలా...

విద్యుత్తు ఆదా చేసే భవనాల దశను దాటి.. ప్రస్తుతం విద్యుత్తును గ్రిడ్‌కు సరఫరా చేసేలా కొత్త భవనాలు వస్తున్నాయి. వార్షిక కరెంట్‌ వినియోగాన్ని బట్టి భవనాలపైన సౌర, పవన విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఈ తరహాలో నెట్‌ జీరో ఎనర్జీ భవనంగా మాదాపూర్‌లోని సీఐఐ-ఐజీబీసీ సెంటర్‌ గుర్తింపు పొందింది. 130 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర పలకలను భవనంపైన ఏర్పాటు చేశారు. వార్షికంగా 2.20 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నారు. వీరి వార్షిక విద్యుత్తు వినియోగం 2.03 లక్షల యూనిట్ల మాత్రమే. అంటే వినియోగం కంటే అధికంగా 8 శాతం కరెంట్‌ను ఉత్పత్తి చేస్తూ నెట్‌మీటర్‌ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఈ విధంగా నెట్‌జీరో భవనంగా గుర్తింపు పొందింది.  టీఎస్‌రెడ్కో మింట్‌ కాంపౌండ్‌లో కొత్తగా నెట్‌ జీరో ఎనర్జీ భవనాన్ని నిర్మిస్తోంది. మున్ముందు ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.  100 కిలోవాట్ల కరెంట్‌ను సైతం క్యాప్టివ్‌లో తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో నెట్‌జీరో భవనాలు భారీగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సిటీలో పెద్ద ఎత్తున ఐటీ కార్యాలయాల భవనాలు ఉన్నాయి. వీటి కరెంట్‌ వాడకం ఎక్కువ. భవనాలపై ఆ మేరకు సౌర విద్యుత్తు ఉత్పత్తికి స్థలం ఉండటం లేదు. దీంతో వీరు ఇతర చోట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని గ్రిడ్‌కు సరఫరా చేస్తారు. ఇక్కడ గ్రిడ్‌ నుంచి కరెంట్‌ తీసుకుంటారు. ఆ విధంగా రాబోయే రోజుల్లో చాలా భవనాలు నెట్‌జీరో ఎనర్జీని చేరుకోబోతున్నాయని  నిపుణులు అంటున్నారు.

భవనాల్లో విద్యుత్తు వినియోగాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తున్నాయి. గతేడాది డిసెంబరు నాటికి తెలంగాణలో ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌(ఈసీబీసీ)ను అనుసరించి నిర్మించిన భవనాలు 430గా ఉంటే... ప్రస్తుతం వాటి సంఖ్య 620కి పెరిగింది. వీటిలో అత్యధికం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఏడాదిలోనే విద్యుత్తు ఆదా భవనాలు గణనీయంగా మెరుగవడమే కాదు.. కొత్తగా నెట్‌ జీరో ఎనర్జీ భవనాలతో వారికి కావాల్సిన కరెంట్‌ను వంద శాతం అక్కడే ఉత్పత్తి చేసుకుంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు