గోడలు పోయి.. ప్యానెళ్లు వచ్చే!

ఇటుకలతో గోడల నిర్మాణం, ప్లాస్టరింగ్‌కు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ పని చేసేందుకు నైపుణ్యం కలిగిన మేస్త్రీలు అవసరం. ప్రస్తుతం వస్తున్న వాణిజ్య భవనాలన్నీ పాతిక అంతస్తులకు తక్కువ కాకుండా ఉంటున్నాయి.

Published : 19 Nov 2022 01:29 IST

నిర్మాణ రంగంలో వేగంగా మార్పులు
ఈనాడు, హైదరాబాద్‌

ఇటుకలతో గోడల నిర్మాణం, ప్లాస్టరింగ్‌కు ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ పని చేసేందుకు నైపుణ్యం కలిగిన మేస్త్రీలు అవసరం. ప్రస్తుతం వస్తున్న వాణిజ్య భవనాలన్నీ పాతిక అంతస్తులకు తక్కువ కాకుండా ఉంటున్నాయి. ఈ భవనాల లోపల ఇటుకలతో గోడలు కట్టి ప్లాస్టరింగ్‌ చేయాలంటే తక్కువలో తక్కువ వెయ్యిమంది మేస్త్రీలు కావాలి. వీరి లభ్యత నగరంలో సమస్యగా ఉందని బిల్డర్లు అంటున్నారు. ఇదివరకు నెల్లూరు, ఒంగోలు, కరీంనగర్‌ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చేవారని.. ఇప్పుడు స్థానికంగా పనులు చేసుకుంటున్నారని చెబుతుంటారు. ఇటుక గోడల ప్లాస్టరింగ్‌ ఎంత బాగా చేసినా.. ఏవో కొన్ని సమస్యలు చికాకు పెడుతుంటాయని.. నాణ్యతపైన ఫిర్యాదులు వస్తుంటాయని బిల్డర్లు అంటున్నారు. ఇటుకలు పగిలిపోవడం, వృథా కూడా ఎక్కువే. వీటికి పరిష్కారంగా ప్యానళ్లను బిగిస్తున్నారు.

చురుగ్గా  పనులు...

ప్యానల్స్‌ ప్రీ ప్యాబ్రికేటెడ్‌. ఫ్యాక్టరీలో తయారవుతాయి. నాణ్యతలో ఢోకా ఉండదు. భవనాల లోపల అవసరం ఉన్న చోట వీటిని బిగించుకుంటే సరిపోతుంది. కావాల్సిన పరిమాణాల్లో ముందుగానే ఆర్డరిస్తే ఆ మేరకు సిద్ధమై వస్తాయి. చకచకా బిగించేందుకు కుదురుతుంది. చాలా సమయం ఆదా అవుతుంది.  నీటి అవసరం ఉండదు. వృథా తగ్గిపోతుంది. నిర్మాణ సమయంలో వెలువడే కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. పర్యావరణహితంగా ఉంటుందని అంటున్నారు బిల్డర్లు. వాణిజ్య భవనాల నిర్మాణం విషయంలో కార్పొరేట్‌ సంస్థలు వీటిని సైతం చూస్తున్నాయి. కాబట్టి మొదట్లో వాణిజ్య భవనాల్లో, ఐటీ టవర్లలో వినియోగిస్తున్నారు. ఈ సాంకేతికతకు కొనుగోలుదారుల నుంచి  ఆమోదం లభిస్తే మున్ముందు గృహ నిర్మాణంలోనూ వీటిని తీసుకురానున్నట్లు బిల్డర్లు చెబుతున్నారు.

విదేశాల నుంచి దిగుమతి

అక్వాటిక్‌ ప్యానళ్లను నగరంలోని ఒక ప్రముఖ స్థిరాస్తి సంస్థ ఫిన్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది. చైనాలోనూ పెద్ద ఎత్తున వీటిని తయారు చేస్తున్నారు. మన దగ్గర ప్లాంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగం పెరిగితే స్థానికంగానే తయారు చేయనున్నారు. కావాల్సిన డిజైన్లలో వీటిని తయారు చేయించుకోవచ్చు.
నిర్మాణాల్లో క్రమంగా ఇటుక గోడలు మాయమవుతున్నాయి. ఆకాశహర్మ్యాల భవనాల్లో ఇప్పటికే పూర్తిగా కాంక్రీట్‌తో గోడలను షీర్‌వాల్‌ టెక్నాలజీలో నిర్మిస్తున్నారు. వీటితో పాటూ ఖర్చు తగ్గించేందుకు ఇప్పుడు భవనాల లోపల ఇటుక గోడల స్థానంలో ప్యానెళ్లు వాడుతున్నారు. తొలుత వాణిజ్య భవనాల్లో వినియోగిస్తున్నారు. విదేశాల నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. మున్ముందు గృహ నిర్మాణంలోనూ ఉపయోగించే అవకాశం ఉందని అగ్రశ్రేణి డెవలపర్లు అంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని