అటు రక్షణ.. ఇటు సౌకర్యం

కొవిడ్‌ అనంతరం ఇంటి నిర్వచనమే మారిపోయింది. ఇదివరకు ఇల్లంటే ఇల్లు మాత్రమే. ఇప్పుడు చాలామంది ఉద్యోగులకు కార్యాలయం కూడా. ఇప్పటికే ఎంతోమంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు.

Published : 17 Dec 2022 02:33 IST

ఇళ్లలో స్మార్ట్‌ కెమెరాలు, డిజిటల్‌ లాక్స్‌, వీడియోడోర్‌ బెల్స్‌వైపు మొగ్గు
పెరుగుతున్న ఐవోటీ ఆధారిత పరికరాల వినియోగం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ అనంతరం ఇంటి నిర్వచనమే మారిపోయింది. ఇదివరకు ఇల్లంటే ఇల్లు మాత్రమే. ఇప్పుడు చాలామంది ఉద్యోగులకు కార్యాలయం కూడా. ఇప్పటికే ఎంతోమంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. మరికొంతమంది హైబ్రీడ్‌ పనివిధానంలో సగం రోజులు కార్యాలయం, మిగతా సగం రోజులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఫలితంగా విశాలమైన ఇళ్లకు డిమాండ్‌ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతోపాటు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) ఆధారిత సెక్యూరిటీ డివైజెస్‌ను ఏర్పాటు చేసుకోవడం ఇళ్లలో పెరిగింది. రియల్‌ టైమ్‌లో ట్రాక్‌ చేసే స్మార్ట్‌ కెమెరాలు, స్మార్ట్‌ లాక్‌లు, స్మార్ట్‌ వీడియో డోర్‌బెల్స్‌ వినియోగంతో ఇళ్లను స్మార్ట్‌గా మార్చేస్తున్నారు.

రాఘవ కుటుంబం ఇంట్లో ఒక గదిలో కూర్చుని కార్యాలయం పని చేసుకుంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ పనిలో తీరిక లేకుండా ఉన్నారు. కానీ తరచూ ఎవరో ఒకరు వచ్చి కాలింగ్‌ బెల్‌ కొట్టడం.. పని మధ్యలో వదిలేసి రావడం చికాకు తెప్పించింది. దీంతో ఇంటికి స్మార్ట్‌ వీడియో డోర్‌బెల్‌ బిగించుకున్నారు. సంబంధిత యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఎవరైనా బెల్‌ నొక్కగానే యాప్‌లో వీక్షించడంతోపాటు డోర్‌ బయట ఏర్పాటు చేసిన మైక్రోఫోన్‌లో వచ్చినవారితో కూర్చున్న చోట నుంచి మాట్లాడేవారు. ఆ తర్వాత అవసరాన్నిబట్టి తలుపులు తీసేవారు. ఇటీవల ఈ తరహా స్మార్ట్‌ రక్షణ పరికరాల ఏర్పాటు పెరిగింది. కొత్తగా కడుతున్న బహుళ అంతస్తుల నిర్మాణాలు, విల్లాల్లో బిల్డర్లే వీటిని ఏర్పాటు చేస్తుండగా వ్యక్తిగత ఇళ్లలోనూ ఇంటి యాజమానులు బిగించుకుంటున్నారు.

కొనుగోలుదారుల అవసరాలకు తగ్గట్టుగా..

ఇంటి నిర్మాణ సమయంలో బిల్డర్లు స్మార్ట్‌ ఉపకరాలను జోడిస్తున్నారు. ప్రాజెక్ట్‌ మార్కెటింగ్‌లో ఇప్పుడు ఇదో ప్రధాన ఆకర్షణగా మారింది. ఐటీ కారిడార్‌లో పలు ప్రముఖ సంస్థలు వీటితో ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్నాయి. సొంతంగా కట్టుకునే ఇళ్లలోనూ వీటి ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నారు.  పిల్లలు, పెద్దలు ఉన్న ఇంట్లో ఇవి తప్పనిసరిగా మారాయి. ప్రతి అపార్ట్‌మెంట్లో, ఇంట్లో హోమ్‌ సెక్యూరిటీ కెమెరా సహజంగా మారింది. ఈ ఏడాది మొదటి తొమ్మిదినెలల్లో 7 లక్షల కెమెరాలను భారత్‌ దిగుమతి చేసుకుందని ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి వీటికి ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. గత రెండేళ్లుగా డిజిటల్‌ స్మార్ట్‌ లాక్స్‌ విక్రయాలు 18 శాతం నుంచి 30 శాతానికి పెరిగాయి. ఇప్పుడు కొత్తగా వీడియో డోర్‌బెల్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. 5జీ రాకతో వీటి వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని బిల్డర్‌ ఒకరు అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని