కలల గృహం.. కట్టేది వారే
వ్యక్తిగత ఇళ్ల నిర్మాణంలోకి అంకుర సంస్థలు
సాంకేతికత తోడ్పాటుతో మార్కెట్‌లో వేగంగా మార్పులు
ఈనాడు, హైదరాబాద్: నిర్మాణ రంగంలో ఇప్పుడు బ్రాండింగ్‌కు ప్రాముఖ్యత పెరిగింది. పేరున్న సంస్థలు మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా అమ్మకాలు చేపడుతున్నాయి. నిజం చెప్పాలంటే మార్కెట్ బాగోలేనప్పుడు ఈ సంస్థల విక్రయాలు బాగుంటున్నాయి. ఆయా సంస్థలు కొనుగోలుదారుల నుంచి సంపాదించుకున్న నమ్మకానికి నిదర్శనమిది. ఇప్పటివరకు అపార్ట్‌మెంట్లు, విల్లాలు, వెంచర్లలో బ్రాండింగ్‌తో పెద్ద ఎత్తున రియల్ వ్యాపారం చేస్తున్నారు. వ్యక్తిగత ఇళ్ల నిర్మాణంలో ఇప్పటివరకు ఇది లోటుగానే ఉంది. వీటికి సైతం పెద్ద ఎత్తున మార్కెట్ ఉందని గుర్తించిన రియల్‌ఎస్టేట్ అంకుర సంస్థలు ఇప్పుడు ఇందులోకి అడుగుపెట్టాయి.
నగరంలో అపార్ట్‌మెంట్లే కాదు వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం పెద్ద సంఖ్యలో జరుగుతోంది. శివారు ప్రాంతాల్లో ఎక్కువగా కడుతుంటారు. ఇటీవల కాలంలో చూస్తే జీ+4 అంతస్తుల వరకు కడుతున్నారు. సొంతంగా దగ్గరుండి కట్టించుకోవడం, లేదంటే గుత్తేదారుకు కాంట్రాక్ట్ ఇచ్చి చేయించుకుంటున్నారు. అనుభవం, అర్హత ఉన్న ఇంజినీర్లు చేపడితే ఫర్వాలేదు.. అన్ని విషయాలు వాళ్లే చూసుకుంటారు. కానీ ఎక్కువ శాతం అనుభవం లేనివాళ్లు కడుతున్నవే. దీంతో గుత్తేదారుకు తోచినట్లుగానో.. ఇంటి యజమానికి నచ్చినట్లుగా కట్టేస్తున్నారు. ఇల్లు కట్టే సమయంలో నిర్మాణ సామగ్రి వినియోగంలో అవగాహన లేమి వల్ల నాణ్యత లోపాలు వెక్కిరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధ్యయనం ద్వారా సొంతింటి నిర్మాణదారులు ఎదుర్కొంటున్న ఈ తరహా సమస్యలను గుర్తించిన పలు అంకుర సంస్థలు వ్యక్తిగత ఇళ్ల మార్కెట్‌లోకి ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నాయి. బ్రాండెడ్ ఇళ్లను పరిచయం చేస్తున్నాయి. రెరా నిబంధనలు వీరికి వర్తించక పోయినా పదేళ్ల స్ట్రక్చరల్ గ్యారంటీ, ఏడాది పాటు ఫ్లంబింగ్, ఎలక్ట్రికల్ వారంటీ అంటూ కొనుగోలుదారుల విశ్వాసం చూరగొనే ప్రయత్నం చేస్తున్నాయి. సాంకేతికతను వినియోగిస్తున్నాయి.
డిజైన్ లోపాలు లేకుండా...
ఇంటి నిర్మాణంలో ఎక్కువ మంది చేసే పొరపాట్లలో డిజైన్లలో లోపాలే కారణం. స్ట్రక్చరల్ డిజైనే కాదు.. ఆర్కిటెక్చరల్, ఫ్లంబింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లలో లోపాలు తర్వాత బయట పడుతుంటాయి. వంటగదిలో ఇంటి యజమాని ఆరు సాకెట్లు చాలని చెబుతారు. తీరా ఇంట్లోకి దిగాక పది సాకెట్లు అవసరం ఉంటాయి. దీంతో ఎక్స్‌టెన్షన్ బాక్స్‌లు వినియోగిస్తుంటారు. మరో గదిలో సాకెట్లను వినియోగిస్తుంటారు. ఇంట్లో క్రాస్ వెంటిలేషన్‌తో గణనీయంగా విద్యుత్తు వాడకాన్ని తగ్గించవచ్చు. కానీ కిటికీ ఉండాల్సిన చోట వార్డ్‌రోబ్ ఏర్పాటుతో గదిలోకి వెలుతురు రాదు. ఇంట్లోని కార్బన్ డైయాక్సైడ్ బయటికి పోదు. ఇలాంటివన్నీ శాస్త్రీయంగా చేపట్టాల్సిన అంశాలు. వంటగదిలో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యుల ఎత్తుతో సంబంధం లేకుండా కిచెన్ ప్లాట్‌ఫామ్ ఎత్తుగా కడుతుంటారు. పిల్లల గది అంటారు.. కమోడ్ ఎత్తులో ఉంటుంది. వీటి గురించి అవగాహన లేకపోవడంతో ఇంటి నిర్మాణంలో పొరపాట్లు చేస్తుంటారు. వీటిపై అవగాహన కల్పించేందుకు.. పనిలో పనిగా తమ బ్రాండింగ్ చేసుకునేందుకు ఆయా సంస్థలు సిటీలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. ఇల్లు కట్టుకోవడానికి ముందు ఆయా కేంద్రాలను సందర్శించి అవగాహన పెంపొందించుకోవచ్చు.
ముందే కళ్లకు కట్టినట్లు..
ఒకసారి కట్టిన తర్వాత నచ్చక కూలగొట్టి మళ్లీ కడుతుంటారు. ఇది ఇంటి బడ్జెట్‌ను పెంచుతుంది. ఇప్పుడా అవసరం లేకుండానే తమ ఇంటిని ఎలా కావాలని కోరుకుంటున్నారో అలాగే ఉందా లేదా అనేది వర్చువల్ రియాలిటీలో చూసుకోవచ్చు. ఇంటి డిజైన్ రూపొందించాక ఆయా సంస్థలు ఇంటి యజమానులకు వీటిని చూపిస్తున్నాయి. కారు కొంటే టెస్ట్ డ్రైవ్ లాగా.. ఇంటి నిర్మాణానికి ముందే ఇది టెస్ట్ డ్రైవ్ అంటున్నాయి. ఎలివేషన్ ఎలా ఉంటుందో ముందే చూసుకోవచ్చు. మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. కాబట్టి తీరా ఇల్లు పూర్తయ్యాక ముందుభాగం నచ్చలేదనే... మేడపైన రెయిలింగ్ కంటే గోడ బాగుండేదేమో అనే అసంతృప్తి ఉండదని చెబుతున్నారు.
ఇంటిని ఒక వస్తువుగా...
మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు నాణ్యత ఇన్నేళ్లలో పెరుగుతూనే వచ్చింది. చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పుడు అందులో నాణ్యమైన వాటికే మొగ్గు చూపుతున్నారు. ఇంటిని సైతం అంకుర సంస్థలు ఒక ఉత్పత్తిలాగా చూస్తున్నాయి. నాణ్యతను పెంచి వీటిలో సైతం తమ బ్రాండ్‌ను చాటాలని.. అందుకోసం సాంకేతికతను జోడిస్తున్నాయి. వీరి ప్రయత్నాన్ని మెచ్చి పలు వెంచర్ క్యాపిటలిస్టులు అంకుర సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెట్టి చేదోడుగా నిలుస్తున్నాయి. మార్కెట్లోకి వీరి రాకతో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం తదుపరి దశకు చేరుతుందని పరిశ్రమలో కొత్తదనాన్ని ఆహ్వానించే పెద్దలు అంటున్నారు.
మన దగ్గర ఇప్పుడిప్పుడే..
- గోపీ కృష్ణన్, ఫినాజ్, బిల్డ్‌నెక్ట్స్
మన దగ్గర అపార్ట్‌మెంట్లలో వేల యూనిట్లను నిర్మిస్తున్న సంస్థలు ఉన్నాయి. వ్యక్తిగత ఇళ్లలో హైదరాబాద్‌లోనే కాదు దేశంలో ఎక్కడ చూసినా పెద్దగా సంస్థలు కనిపించవు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 80 ఏళ్ల క్రితమే వ్యక్తిగత ఇళ్ల నిర్మాణంలో పేరున్న కన్‌స్ట్రక్షన్ సంస్థలను చూడొచ్చు. 50వేల ఇళ్లను నిర్మించే సామర్థ్యం కలిగిన సంస్థలు అక్కడ ఉన్నాయి. ప్రతి పనీ ఎంతో శాస్త్రీయంగా జరుగుతుంది. మనది భిన్నమైన పరిస్థితులు. వేర్వేరు ప్రాంతాలు, ఆచారాలు, అవసరాలు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భిన్నరకాల ఇళ్లను ఇక్కడ చూస్తుంటాం. ఇల్లుంటే చాలు అనే దశ నుంచి.. ఎవరికివారు.. వారి జీవన శైలికి సరిపోయేలా ఇల్లు కట్టుకోవాలనే స్పృహ వచ్చింది. ఇక్కడే మాలాంటి సంస్థలు అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఐఐటీ, ఐఐఎం పూర్వ విద్యార్థులమైన మేం ఎంతో అధ్యయనం చేసి 2015లో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణంలోకి అడుగుపెట్టాం. కేరళలో మొదలెట్టినా.. హైదరాబాద్, వరంగల్‌లో పలు ప్రాజెక్టులు చేస్తున్నాం. బెంగళూరుకు విస్తరిస్తున్నాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!