ఇంట్లోనే అవుట్‌ డోర్‌

నగరంలో భారీ ఎత్తున ఆకాశహర్మ్యాల నిర్మాణాలు రావడానికి కొనుగోలుదారుల నుంచి సానుకూల స్పందన ఉండటమే కారణం. అంతఎత్తున ఉంటూ నగరం మొత్తం చూడొచ్చు అనే భావన ఎక్కువ మందిది. ఒకటో అంతస్తులో ఉంటే నగరం మొత్తం చూడలేకపోవచ్చు కానీ కాలనీని, చుట్టుపక్కల పరిసరాలను చూడొచ్చు. ఒకటో అంతస్తులో ఉన్నా.

Published : 21 Jan 2023 01:22 IST

విశాలమైన బాల్కనీల నిర్మాణం

కొనుగోలుదారులను ఆకట్టుకునేలా పోకడలు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో భారీ ఎత్తున ఆకాశహర్మ్యాల నిర్మాణాలు రావడానికి కొనుగోలుదారుల నుంచి సానుకూల స్పందన ఉండటమే కారణం. అంతఎత్తున ఉంటూ నగరం మొత్తం చూడొచ్చు అనే భావన ఎక్కువ మందిది. ఒకటో అంతస్తులో ఉంటే నగరం మొత్తం చూడలేకపోవచ్చు కానీ కాలనీని, చుట్టుపక్కల పరిసరాలను చూడొచ్చు. ఒకటో అంతస్తులో ఉన్నా.. 50వ అంతస్తులో ఉన్నా చుట్టుపక్కల ప్రపంచాన్ని చూడాలంటే బాల్కనీయే ఆధారం. ఇంట్లో ఉంటే ఎక్కువ సమయం బాల్కనీలో గడిపేందుకు ఇష్టపడుతుండటంతో పెద్ద బాల్కనీలు ఉన్న ఇళ్లవైపు కొనుగోలుదారులు చూస్తున్నారు.

డిజైన్‌లో జాగ్రత్తలు..

అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్లలో ఇటీవలవరకు బాల్కనీని ఏదో ఒక పడక గదిలో సర్దేవారు. పెద్ద గదికి చిన్న బాల్కనీ ఇచ్చేవారు. 30 చదరపు అడుగులు కూడా ఉండేది కాదు. సౌకర్యంగా లేక దీన్ని చాలామంది స్టోర్‌ రూమ్‌గా మార్చేవారు. హాల్‌లో బాల్కనీ ఇచ్చినా నాలుగు అడుగుల పొడువు మాత్రమే ఉండేది. దీంతో బాల్కనీని బట్టలు ఆరేయడానికి, కొందరు పూలకుండీలతో పచ్చదనం పెంచుకోవడానికి మాత్రమే వినియోగించేవారు. భద్రత కోసం చుట్టూ గ్రిల్స్‌తో మూసేసేవారు. కొనుగోలుదారుల అభిరుచులు, అవసరాలు మారడంతో ఇటీవల అపార్ట్‌మెంట్లలో పెద్ద బాల్కనీలను ఇస్తున్నారు. ఒక గది అంత విశాలంతో వీటిని నిర్మిస్తున్నారు. 130 నుంచి 150 చదరపు అడుగుల విస్తీర్ణం కేటాయిస్తున్నారు. అక్కడే ఊయల వేసుకుని ఊగుతూ ప్రకృతిని ఆస్వాదించేలా..  ఒకమూలకు నచ్చిన మొక్కలను పెంచుకునేలా.. ఇష్టమైన వ్యాపకాన్ని కొనసాగించేలా.. రోజులో ఎక్కువ సమయం గడిపేందుకు అనుకూలంగా బాల్కనీలను కడుతున్నారు. 2000 చదరపు అడుగుల విస్తీర్ణం కల్గిన మూడు పడగ గదుల ఫ్లాట్‌లో కార్పెట్‌ ఏరియా 1250 చదరపు అడుగులు వస్తే..  కామన్‌ ఏరియా 470 చదరపు అడుగులు పోతుంది. గోడలు గట్రా 140 చదరపు అడుగులు పోతే.. మరో 140 చదరపు అడుగులు బాల్కనీకి కేటాయిస్తున్నారు. అంటే ఇంటి లోపల విస్తీర్ణంలో పదిశాతం కంటే ఎక్కువే బాల్కనీకి కేటాయిస్తున్నారు. స్లైడ్‌డోర్‌తో హాల్‌, డైనింగ్‌ ఏరియా మొదలు బాల్కనీ వరకు పెద్దగా కనిపిస్తుంది. ఇంట్లో విస్తీర్ణాన్ని తగ్గించి బాల్కనీ విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. బండ్లగూడలో రాజీవ్‌సృగృహ అపార్ట్‌మెంట్లలోని మూడు పడగక గదుల ఫ్లాట్లలో ఈ తరహాలో దశాబ్దం కిందటే నిర్మించారు. గేటెట్‌ కమ్యూనిటీల్లో పెద్ద ఫ్లాట్లలో విశాలమైన బాల్కనీలను ఎక్కువగా నిర్మిస్తున్నారు. పార్కులవైపు, చెరువుల వైపు బాల్కనీలను ఇదివరకంటే ఇప్పుడు మరింత పెద్దగా కడుతున్నారు. ఐటీ కారిడార్‌లో ఇవి ఎక్కువగా కన్పిస్తున్నాయి. ‘అవుట్‌డోర్‌ బాల్కనీ నిర్మాణాలకు సాధారణ బాల్కనీతో పోలిస్తే నిర్మాణ వ్యయం అధికం. అయినా ఇల్లు కొనుగోలు చేసిన వారు తమ ఇంట్లో ఇది లేదే అనే భావన ఉండకూడదని ఖర్చుకు వెనకాడటం లేదు. కొనుగోలుదారులు అర్థం చేసుకుంటున్నారు’ అని బిల్డర్‌ ఒకరు అన్నారు.

అభిరుచులకు తగ్గట్టు..

ఇంటీరియర్‌ అంటే ఇంటి లోపల వరకే అన్నట్లుగా ఉండేది.. బాల్కనీలో అక్కర్లేదు అనేవారు ఎక్కువ మంది. కానీ బయటి నుంచి చూస్తే కన్పించేదేమో బాల్కనీ. అందుకే ఇటీవల చిన్నదైనా.. పెద్ద బాల్కనీ అయినా అందంగా ఇంటీరియర్స్‌ చేయిస్తున్నారు. తమ అభిరుచులను బట్టి మొక్కల దగ్గర్నుంచి రకరకాల థీమ్స్‌తో డిజైన్‌ చేయించుకుంటున్నారు. ప్రత్యేకంగా వీటిని డిజైన్‌ చేసేవారు సైతం మార్కెట్లో ఉన్నారు. రీడింగ్‌ కార్నర్‌గా కొందరు మలుచుకుంటున్నారు.  వేలాడదీసే కుండీలు, దీపాలతో, కృత్రిమ పచ్చగడ్డితో.. ఇలా ఎవరి తరహాలో వాళ్లు డిజైన్‌ చేసుకుంటున్నారు.

భద్రత ముఖ్యం..

బాల్కనీలకు ఇదివరకు ఎక్కువగా రెయిలింగ్‌ ఉపయోగించేవారు. ఇటీవల చూస్తే ఎక్కువగా గ్లాసులు ఉపయోగిస్తున్నారు. ఎత్తు తక్కువగా ఉండటంతో ప్రమాదకరంగా కన్పిస్తున్నాయి. బాల్కనీలో నిలబడితే రెయిలింగ్‌ నడుం కంటే పైకి రావాలని నిపుణులు చెబుతున్నారు. నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ ప్రకారం బాల్కనీ రెయిలింగ్‌ ఎత్తు ఒక మీటర్‌ లోపల ఉండరాదు. అంటే ఒక మీటర్‌ ఎత్తు గోడ కట్టి.. ఆపై రెయిలింగ్‌ రాడ్‌ ఏర్పాటుతో ఎత్తు పెరుగుతుంది.. పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. పొరపాటున కాలు జారినా భవనం పైనుంచి పడిపోయే పరిస్థితి ఉండదు.

ఇంట్లో ఉంటున్నా చుట్టూ బయటి ప్రపంచం కనిపించాలి.. ప్రధాన ద్వారం మూసేసినా ఇంట్లో బందీ అయ్యామనే భావన రాకూడదు. ఉదయం పూట భానుడి లేలేత కిరణాలు ఇంట్లోవాళ్లను పలకరించాలి. సాయంత్రం వీధుల్లో పిల్లలు ఆడే ఆటల్ని, వచ్చీపోయే వారిని చూస్తూ కాలక్షేపం చేసేలా రాత్రి ఆకాశంలోని నక్షత్రాలతో కబుర్లు చెప్పాలంటే బాల్కనీ ఉండాల్సిందే. ఇంతటి ప్రాధాన్యత ఉండబట్టే కొనుగోలుదారులు ఇంటి లోపలే కాదు బాల్కనీ సైతం విశాలం ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే బాల్కనీ నిర్మాణంలో ఇటీవల పలు మార్పులు చేసుకుంటున్నారు. విశాలమైన అవుట్‌డోర్‌ లివింగ్‌ బాల్కనీలను తీర్చిదిద్దుతున్నారు. గతంలోనూ ఉన్నా.. మధ్యలో విస్మరించారు. మళ్లీ ఇప్పుడు ప్రాధాన్యం ఇస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని