కలపతో కళాత్మకంగా..

నిర్వహణ సులభంగా ఉండాలి.. చూడగానే ఆకట్టుకోవాలి.. విలాసవంతంగా కనిపించాలి.. ఇంటి గచ్చు విషయంలో యాజమానుల ఆలోచనలు వీటి చుట్టూనే తిరుగుతుంటాయి.

Published : 04 Mar 2023 01:07 IST

ఉడెన్‌ ఫ్లోరింగ్‌తో అందం.. ఆకర్షణ

ఈనాడు, హైదరాబాద్‌: నిర్వహణ సులభంగా ఉండాలి.. చూడగానే ఆకట్టుకోవాలి.. విలాసవంతంగా కనిపించాలి.. ఇంటి గచ్చు విషయంలో యాజమానుల ఆలోచనలు వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. అందుకోసం ఇటీవల కాలంలో ఉడెన్‌ ఫ్లోరింగ్‌ వైపు గృహస్థులు ఆసక్తి చూపిస్తున్నారు. మెరిసిపోతూ.. కళాత్మకంగా.. సుందరంగా కలప గచ్చు కనిపిస్తోంది.

మొదట్లో పడక గది వరకే ఎక్కువ మంది కలప ఫ్లోరింగ్‌ వేయించేవారు. ఇటీవల కాలంలో వచ్చిన మార్పులు.. టైల్స్‌లో వస్తున్న కొత్త రకాలతో వేర్వేరు గదుల్లో, వాహనాలు నిలిపే పార్కింగ్‌ ప్రదేశాల్లోనూ ఉడెన్‌ ఫ్లోరింగ్‌ వేయిస్తున్నారు.

కేవలం డిజైన్‌ మాత్రమే..

కొత్త ఇంటికైతే నిర్మాణ సమయంలో చెక్క మాదిరి కనిపించే ఉడెన్‌ టైల్స్‌ వేయిస్తున్నారు. సిరామిక్‌, విట్రిఫైడ్‌లో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. రంగు, డిజైన్‌లో ఎన్నో రకాలు లభిస్తున్నాయి. తమ ఇంటి ఇంటీరియర్స్‌కు తగ్గవి ఎంపిక చేసుకోవచ్చు. చదరపు అడుగు రూ.50 నుంచి మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవి సాధారణ టైల్స్‌ మాదిరే. కాకపోతే కలపలాగా కనిపిస్తాయి.

లామినేటెడ్‌...

ప్రస్తుతం మన దగ్గర ఎక్కువ శాతం కలప లామినేటెడ్‌ ఫ్లోరింగ్‌ చేయిస్తున్నారు. హార్డ్‌వుడ్‌, లామినేట్‌, వెదురు కలపతో రూపొందించిన వాటిని ఉపయోగిస్తున్నారు. వీటి బిగింపు కూడా సులువే. చదరపు అడుగు రూ.75 నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. ఇవి 8 ఎంఎం మందంతో వస్తాయి. ఇప్పుడున్న టైల్స్‌ పైన వేయించుకోవచ్చు.

పూర్తిగా కలపతో..

లామినేటెడ్‌ కాకుండా పూర్తిగా కలపతో రూపొందించిన టైల్స్‌ సైతం మార్కెట్లో లభిస్తున్నాయి. వీటి మందం 15 ఎంఎం వరకు ఉంటుంది. ధర ఎక్కువే. మన్నిక ఎక్కువే. 300 మి.మి. వెడల్పు నుంచి 2750 మి.మీ.పొడవు కలిగిన పలకలు సైతం ఇందులో లభిస్తున్నాయి. ఇవి దుమ్ము ధూళిని ఎక్కువగా ఆకర్షించవు.

పొడవాటివి మేలు..

ఇంటి అందం పెంచడంతోపాటు నిర్వహణ సమస్యలు లేకుండా ఉండాలంటే పొడవైన పలకలు వేయించుకోవడం మేలని ఇంటీరియర్‌ డిజైనర్లు చెబుతున్నారు.

* ఇంటీరియర్స్‌కు తగ్గట్టుగా ఫ్లోరింగ్‌ను ఎంపిక చేసుకుంటే ఇల్లు ట్రెండీగా కనిపిస్తుందని సూచిస్తున్నారు.

* నివాస, వాణిజ్య, ఆసుపత్రులు, హోటల్స్‌, పరిశ్రమలు, పాఠశాలలు, రిటైల్‌, జిమ్‌, క్రీడా ప్రాంగణాల్లో ఎక్కడైనా కలప గచ్చును వేసుకోవచ్చు.

* చల్లగా ఉండే గదుల్లో వేయించుకోవడం మేలు. వెచ్చదనం అనుభూతిని ఇస్తాయి.

నిర్వహణ సులువే..

అతుకులు, మూలల వద్ద బిగించేటప్పుడు సక్రమంగా జాగ్రత్తగా చేస్తే.. ఆ తర్వాత నిర్వహణ పరంగా పెద్ద సమస్యలు ఉండవని చెబుతున్నారు. మరకల కోసం పదేపదే తుడవాల్సిన పనిలేదు. దుమ్ము దూళి లేకుండా శుభ్రం చేసుకుంటే చాలు.


ఆకట్టుకునేలా.. మన్నికగా...

నాణ్యమైన చెక్కతో రూపొందించిన పలకలు దీర్ఘకాలం మన్నుతాయి. సహజ ఆకృతి, ప్రామాణికత, మన్నికనిస్తాయి. అతుకులు లేకుండా బిగించవచ్చు. పార్కింగ్‌ ప్రదేశాల్లో సైతం వేసుకోవచ్చు. అంత మన్నికగా ఉంటాయి. ఇవి అద్భుతంగా అందంగా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక కలప నుంచి మా చాలెంటినో సిరీస్‌ కలప పలకలు రూపొందిస్తున్నాయి.

గౌరవ్‌ సరాఫ్‌, జేఎండీ, స్కైర్‌ఫూట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని