Villas: విల్లా నిర్మాణానికి.. ఎంత ఖర్చు అవుతుంది?

నిర్మాణ వ్యయం మూడేళ్లలో భారీగా పెరిగింది. రవాణా సమస్యలతో కొవిడ్‌ సమయంలో ముడిసరకుల ధరలకు రెక్కలొచ్చాయి. ఆ తర్వాత స్వల్పంగా తగ్గినా క్రమంగా మళ్లీ పెరిగాయి.

Updated : 22 Apr 2023 09:24 IST

మూడేళ్లలో భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం
ఈనాడు, హైదరాబాద్‌:  

నిర్మాణ వ్యయం మూడేళ్లలో భారీగా పెరిగింది. రవాణా సమస్యలతో కొవిడ్‌ సమయంలో ముడిసరకుల ధరలకు రెక్కలొచ్చాయి. ఆ తర్వాత స్వల్పంగా తగ్గినా క్రమంగా మళ్లీ పెరిగాయి. నిర్మాణ కూలీల ధరలతో పాటు సిమెంట్‌, స్టీల్‌, కాంక్రీట్‌, అల్యూమినియం, కాపర్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో నిర్మాణ వ్యయం సగటున మూడేళ్లలో 30 శాతం పైగా పెరిగిందని నిర్మాణదారులు చెబుతున్నారు.

మెట్రో నగరాల్లో : హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీ వంటి మెట్రో నగరాల్లో నైపుణ్యం కలిగిన నిర్మాణ కూలీలకు ఇచ్చే రోజువారీ సగటు కూలి రూ.900 ఉంది. నైపుణ్యం లేనివారికి రూ.700 ఇస్తున్నారు. వీటితో పాటు కీలకమైన సిమెంట్‌, స్టీల్‌ ధరల పెరుగుదల తీరుతెన్నులను 2020 నుంచి 2022 వరకు త్రైమాసికాల వారిగా జేఎల్‌ఎల్‌ తాజా నివేదికలో విశ్లేషించింది. మెట్రో నగరాల్లోని సగటు ధరలను పరిగణనలోకి తీసుకుంది.

సిమెంట్‌ : నిర్మాణంలో కీలకమైన సిమెంట్‌ ధరలు మూడేళ్లలో 16 శాతం పెరిగాయి. ఒక దశలో పెరుగుదల గరిష్ఠంగా 39 శాతం వరకు వెళ్లింది. గత ఏడాది చివర్లో ధరలు తగ్గడంతో నిర్మాణం రంగం ఊపిరిపీల్చుకుంది. 53 గ్రేడ్‌ సిమెంట్‌ మెట్రిక్‌ టన్నుకు 2020 ప్రారంభంలో రూ.5,120 ఉంటే 2021 నాటికి రూ.7100 చేరి 2022 ఆఖరుకు రూ.5,960కి తగ్గింది.

స్టీల్‌.. : స్టీల్‌ ధరలు మూడేళ్లలో భారీగా పెరిగాయి. మూడేళ్ల క్రితం టన్ను రూ.42,480 ఉన్న రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ స్టీల్‌ ఏకంగా 43 శాతం పెరిగి గత ఏడాది ఆఖరు నాటికి రూ.60,717 వద్ద ఆగింది. గరిష్ఠంగా సగటు ధరలు రూ.67 వేల వరకు వెళ్లిన రోజులున్నాయి.

కాంక్రీట్‌.. : నిర్మాణాల్లో వేగం పెరిగాక కాంక్రీట్‌ వినియోగం అధికమైంది. ఎం25, ఎం30, ఎం35 గ్రేడ్‌ రకం కాంక్రీట్‌ ధరలు 2020 ఆరంభంలో ఒక క్యూబిక్‌ మీటర్‌కు రూ.5012 వసూలు చేసేవారు. గత ఏడాది ఆఖరు నాటికి 11 శాతం ధర పెరిగి రూ.5,553కి చేరింది. ఒక దశలో రూ.4,550కు పడిపోయినా ఒక త్రైమాసికంలోనే తిరిగి 20 శాతం ధర పెరిగింది.

అల్యూమినియం.. : నిర్మాణాల్లో అల్యూమినియం, కాపర్‌ వినియోగం కూడా ఎక్కువే. ఎలక్ట్రికల్‌లో ఇవే కీలకం. వీటి ధరలు అనూహ్యంగా పెరిగాయి. అల్యూమినియం ధరలు 2020తో పోలిస్తే 2021 నాటికి రెట్టింపయ్యాయి. ఆ తర్వాత ధరలు దిగి వచ్చాయి. 2022 ఆఖరు నాటికి ధరల్లో పెరుగుదల 46 శాతం ఉంది. మెట్రిక్‌ టన్ను అల్యూమినియం 1.86 లక్షలుగా ఉంది.

కట్టడానికి  అయ్యే వ్యయమెంత?

* ప్రస్తుతం మార్కెట్లో అందుబాటు ధరల ఇళ్లు మొదలు ఆకాశహర్మ్యాల వరకు కడుతున్నారు. చదరపు అడుగుకు హైదరాబాద్‌లో ఎంత వ్యయం అవుతోందనేది జేఎల్‌ఎల్‌ తమ నివేదికలో పేర్కొంది.

* ఆకాశహర్మ్యాల భవనాలను 30 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మిస్తున్నట్లయితే నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.5,300 నుంచి 6,300 వరకు అవుతోంది. నాణ్యంగా, ప్రీమియంగా కట్టే వాటిలో వ్యయం ఉంటుంది.. ప్రాజెక్ట్‌ను బట్టి మారిపోతుంటాయి.

* పదిహేను అంతస్తులపైన కట్టేవాటిలో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.3,800 నుంచి 4,500 అవుతుంది.

* 5 నుంచి 12 అంతస్తులలోపు కట్టే భవనాల్లో చ.అ.కురూ.2,900 నుంచి రూ.3,300 వ్యయం అవుతుంది.

* అందుబాటు ఇళ్ల నిర్మాణంలో స్టాండలోన్‌ అపార్ట్‌మెంట్లు ఐదు అంతస్తుల వరకు ప్రతి చదరపు అడుగు నిర్మాణానికి సగటున రూ.2,200 నుంచి రూ.2,600 ఖర్చు అవుతుంది.

* విల్లాల్లో జీ+2 అంతస్తుల వరకు చ.అ.కు రూ.4,300 నుంచి రూ.5 వేల వ్యయం అవుతుంది.


డీజిల్‌... : ఇంధన ధరల పెరుగుదల పరోక్షంగా నిర్మాణ వ్యయం పెరగడానికి కారణమవుతోంది. సిమెంట్‌, స్టీల్‌, కాంక్రీట్‌, ఇసుక, ఇటుకలు వేరేచోట తయారై నిర్మాణ స్థలానికి చేరుకుంటాయి. ఇంధన ధరలు పెరిగితే ఆ ప్రభావం నిర్మాణ వ్యయంపై పడుతుంది. మూడేళ్లలో 30 శాతం డీజిల్‌ ధరలు పెరిగాయి. 2021లో గరిష్ఠంగా 37 శాతానికి చేరిన రోజులున్నాయి.


వాణిజ్యంలో...  

* వాణిజ్య ఆకాశహర్మ్యాల నిర్మాణ వ్యయం గృహ నిర్మాణంతో పోలిస్తే తక్కువే ఉంటుంది. ఇక్కడ చదరపు అడుగు రూ.4,100 నుంచి రూ.4,800 వరకు ఉంటుంది. 

* వాణిజ్యంలో మధ్యస్థ భవనాల నిర్మాణానికి చ.అ.కు రూ.3,500-4,100 ఖర్చువుతుంది.

* రిటైల్‌లో మాల్స్‌ నిర్మాణం నగరంలో ఎక్కువగా జరుగుతోంది. వీటి నిర్మాణానికి ప్రతి చదరపు అడుగుకు రూ.4,200 నుంచి 4,500 వరకు వ్యయం అవుతుంది.

* పరిశ్రమలు, పాఠశాలలు, వేర్‌హౌసింగ్‌, ఆసుపత్రులు.. ఇలా ఎందు కోసం నిర్మాణాలను చేపడుతున్నామనే దాన్ని బట్టి వ్యయంలో తేడాలు ఉంటాయి. వీటిలో తక్కువలో వ్యయం అంటే వేర్‌హౌసింగ్‌లో చ.అ.రూ.1850 నుంచి మొదలవుతోంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని