నిర్మాణంలో 40 లక్షల చ.అడుగులు

ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం ప్రభావం హైదరాబాద్‌ ఆఫీసు మార్కెట్‌పై కన్పిస్తోందని కన్సల్టెన్సీ సంస్థలు అంచనా వేశాయి.

Published : 20 May 2023 01:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం ప్రభావం హైదరాబాద్‌ ఆఫీసు మార్కెట్‌పై కన్పిస్తోందని కన్సల్టెన్సీ సంస్థలు అంచనా వేశాయి. నిర్మాణ కార్యక్రమాలు తొలి త్రైమాసికంలో కొంతమేర తగ్గాయని.. బిల్డర్లు జాగ్రత్త పడుతున్నారని వెస్టియన్‌ సంస్థ తాజా నివేదికలో పేర్కొంది. గ్రేడ్‌ ‘ఎ’ రకం కార్యాలయాలు పెద్దఎత్తున అందుబాటులో ఉండటంతో సబ్‌ డాలర్‌ అద్దెల మూలంగా మార్కెట్‌ను కాపాడగల్గిందని పేర్కొంది. ప్రస్తుతం హైదరాబాద్‌ వ్యాప్తంగా 40 లక్షల చదరపు అడుగుల కార్యాలయాల భవనాలు వేర్వేరు దశల్లో నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా చూస్తే ఆర్థిక మందగమన ప్రభావంతో రియల్‌ఎస్టేట్‌ తొలి త్రైమాసికంలో 4 శాతం నెమ్మదించింది. అద్దెకు తీసుకునే ఐటీ సంస్థల వాటా సైతం కిందటి త్రైమాసికంతో పోలిస్తే 31 నుంచి 23 శాతానికి తగ్గింది. కొత్తగా పూర్తైన నిర్మాణాలు ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో కలిపి 8.60 మిలియన్‌ చ.అ.గా ఉన్నాయి. బెంగళూరు నగరం అత్యధిక వాటాని నమోదు చేసింది. కోల్‌కతా కొత్త నిర్మాణాల పూర్తిలో ముందుంది.

* హైదరాబాద్‌ నగరంలో ఇతర నగరాలతో పోలిస్తే ఆఫీస్‌ మార్కెట్‌ కొవిడ్‌ తర్వాత వేగంగా పుంజుకుంది. విస్తృతమైన మౌలిక వసతులు, తక్కువ అద్దెల కారణంగా ఐటీ నగరాలైన బెంగళూరు, పుణే నగరాలకు గట్టి పోటీ ఇస్తోంది.  

అద్దెలు సగటున (చ.అడుగుకు) ..ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, బయోటెక్నాలజీ, రక్షణ పరిశోధనలకు కేంద్రమైన హైదరాబాద్‌లో గ్రేడ్‌ ‘ఎ’ కార్యాలయాల అద్దెలు నిలకడగా పెరుగుతూనే ఉన్నాయి.

* హైదరాబాద్‌ ప్రధాన నగరంగా చెప్పుకొనే సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్‌ (సీబీడీలో) సగటున చదరపు అడుగు అద్దె ధర రూ.50కి చేరింది.

* ఐటీ సంస్థలకు నెలవైన పశ్చిమ హైదరాబాద్‌లో పీబీడీ (వెస్ట్‌)లో అత్యధికంగా చదరపు అడుగు అద్దెల ధర రూ.75కి పెరిగింది. మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, మణికొండ, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో కార్యాలయాల ఏర్పాటుకు ఐటీ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి.

* తొలి త్రైమాసికంలో మొత్తం నిర్మాణాల్లో 16 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలోని భవనాలను పూర్తయ్యాయి. దేశంలోని 7 నగరాల్లో పూర్తైన భవనాల విస్తీర్ణంలో ఇది 19 శాతానికి సమానం. గత త్రైమాసికంతో పోలిస్తే మాత్రం వాటా తగ్గింది. నిర్మాణ కార్యకలాపాలు 36 శాతం మందగించాయి. నిర్మాణం పూర్తయ్యాక అద్దెలకు రాక ఖాళీగా ఉన్న స్థిరాస్తుల 15.4 శాతంగా ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని