ఎక్కడ బాగు..?

ఐదు అంతస్తులున్న అపార్ట్‌మెంట్‌లోనే ఏ అంతస్తులో ఫ్లాట్‌ తీసుకుంటే మంచిదని చాలామంది ఆలోచిస్తుంటే.. ఇప్పుడు ఏకంగా పదిహేను, పాతిక, ముప్పై అంతస్తుల్లో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు ఇప్పుడు మరింత ఆలోచించాల్సి వస్తోంది. కింద మేలా? పైన తీసుకోవడం ఉత్తమమా? .

Published : 23 Apr 2016 01:22 IST

ఎక్కడ బాగు..?
ఆకాశహర్మ్యాల్లో ఫ్లాట్‌కొనుగోలుదారుల సంశయం
ఏ అంతస్తులో తీసుకోవాలనే తర్జనభర్జన


ఈనాడు, హైదరాబాద్‌ ఐదు అంతస్తులున్న అపార్ట్‌మెంట్‌లోనే ఏ అంతస్తులో ఫ్లాట్‌ తీసుకుంటే మంచిదని చాలామంది ఆలోచిస్తుంటే.. ఇప్పుడు ఏకంగా పదిహేను, పాతిక, ముప్పై అంతస్తుల్లో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులు ఇప్పుడు మరింత ఆలోచించాల్సి వస్తోంది. కింద మేలా? పైన తీసుకోవడం ఉత్తమమా? ..అలాకాకుండా మధ్యస్థంగా వెళదామా అనే గందరగోళంలో ఉన్నారు. ఇప్పటికే నగరంలోని ఆకాశహర్మ్యాల్లో ఉంటున్న నివాసితులతో ‘స్థిరాస్తి’ సంభాషించింది. వారేమన్నారంటే..

పార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ అంటేనే ఎన్నో విషయాలను పరిశీలించాల్సి ఉంటుంది. బహుళ అంతస్తుల భవనం ఉన్న ప్రాంతం.. రవాణా వంటి మౌలిక వసతులు.. అద్దె ఎంత వస్తుంది.. భవిష్యత్తులో వృద్ధికి ఉన్న అవకాశాలు.. తన బడ్జెట్‌లో ఉందా లేదా అనే అంశాలను చూడటంతో పాటూ ఏ అంతస్తు ఎంపిక చేసుకోవాలనేదీ కొనుగోలుదారుడి కోణంలో ముఖ్యమైందే. ప్రతి దాంట్లోనూ సానుకూల, ప్రతికూల అంశాలు ఉంటాయని.. కుటుంబ సభ్యుల అభిరుచులు, ఆసక్తులను బట్టి ఎంపిక చేసుకోవాలని అంటున్నారు. మరి ఏ అంతస్తులో కొనుగోలు చేస్తే మంచిది?

పై అంతస్తుల్లో..
* అత్యంత ఎత్తులో ఉండే పైఅంతస్తుల్లో నివసించే వారు బాల్కనీల్లోంచి చూస్తే నగరం మొత్తం కన్పిస్తుంది. చుట్టూ ఉండే పరిసరాలు, పచ్చదనాన్ని ఆస్వాదించవచ్చు.
* గాలి, వెలుతురు ధారాళంగా ఇంట్లోకి వస్తాయి.
* పైఅంతస్తుల్లో ఉంటారు కాబట్టి భద్రతాపరమైన సమస్యలు అంతగా ఉండవు.
* పర్యావరణ సమస్యలు .... ముఖ్యంగా ధ్వని కాలుష్యం ఉండదు. ్ద 25వ అంతస్తులో నివసించడం అంటే సమాజంలో అదో హోదాగా చూస్తుంటారు.
* కొనుగోలు చేసేటప్పుడు ఆరో అంతస్తుపై నుంచి ప్రతి చ.అడుగునకు రూ.10 నుంచి 15 రూపాయలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. పది అంతస్తుల తర్వాత మరో ధర, 20 అంతస్తుల పైన మరో ధర ఉంటుంది.
* పైఅంతస్తుల్లో ఎండ ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి .. విద్యుత్తు వినియోగం తద్వారా బిల్లు పెరుగుతాయి. ఈ సమస్య లేకుండా ఉండాలంటే .. కిటికీలకు ఏ సామగ్రి వినియోగిస్తున్నారనే దాన్ని బట్టి విద్యుత్తు వినియోగం పెరుగుదల ఆధారపడి ఉంటుంది. ఎండ ప్రభావం అంతగా పడనిరీతిలో ఉండే ఆధునిక కిటీకీలూ ఇటీవల మార్కెట్‌లోకి వచ్చాయి.
* గాలులు వీచినప్పుడు అసాధారణ పరిస్థితుల్లోనూ తట్టుకునేలా కిటికీల సామగ్రి వాడుతున్నారా లేదా అని చూసుకోవాలి.
* అత్యవసరాల సమయంలో పైనుంచి కిందికి చేరుకోవడంలో సమస్యలు ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. అత్యంత వేగంగా పనిచేసే లిఫ్ట్‌లు అమర్చడం వంటి చర్యలతో ఈ ఇబ్బందిని సరిదిద్దే దిశగా జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి.
* వీటిలో కొనుగోలు చేసేటప్పుడు పిల్లలు, పెద్దల రక్షణ కూడా చూసుకోవాలి. ఆ మేరకు నిర్మాణపరంగా బాల్కనీల్లో ఏర్పాట్లను పరిశీలించాలి.

కింది అంతస్తుల్లో...
* కొత్తగా నిర్మిస్తున్న ఆకాశహర్మ్యాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అధికంగా వస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామీణ వాతావరణం ఉంటుంది. ఇటువంటి చోట్ల కింది అంతస్తుల్లోనూ ఎంపిక చేసుకోవచ్చు.  ఇప్పటికే కాంక్రీట్‌ జంగీల్‌గా మారిన ప్రాంతంలో నిర్మిస్తున్నట్లయితే కింద అంతస్తుల్లో కొనుగోలు సరైంది కాదని అనుభవజ్ఞుల అభిప్రాయం. చుట్టూ నిర్మాణాలు ఉండటంతో గాలి, వెలుతురు పరిమితంగా ఉంటుంది. గేటెడ్‌ కమ్యూనిటీల్లో దూరం దూరంగా టవర్ల నిర్మాణంతో ఈ సమస్య లేకుండా జాగ్రత్త పడుతున్నారు. భద్రతాపరంగా, వచ్చిపోయేవారి సందడితో కింద అంతస్తుల్లో కొంత ఇబ్బందిగా ఉంటుంది.  తరచూ ఇల్లు మారే వారికి సామగ్రి తరలించడం కింది అంతస్తుల్లో సులువు కాబట్టి దీన్ని ఎంపిక చేసుకోవచ్చు.  ఒంటరితనం బాధిస్తున్నవారు, చుట్టూ సందడి ఉండాలని కోరుకునే వారు కింది అంతస్తుల్లో నివసించవచ్చు.  బాల్కనీలో నుంచి చూస్తే నలుగురు కన్పించడం.. అవసరమైతే అక్కడి నుంచి మాట్లాడే అవకాశం ఉంటేనే కొందరికి సౌకర్యంగా ఉంటుంది. అటువంటి వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చు.

మధ్య అంతస్తుల్లో..
* పైన, కింద అనేది తేల్చుకోలేకపోతున్నట్లయితే మరేం ఆలోచించకుండా మధ్య అంతస్తులు ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
* సానుకూలం, ప్రతికూలం ఏవైనా ఇక్కడ సమంగానే ఉంటాయి.
* కిటికీల అమరిక పకడ్బందీగా ఉంటే ధ్వని కాలుష్యం వంటి సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. అటువంటి ఏర్పాట్లను వీటిలో పరిశీలించాలి.


ఏ అంతస్తు అయినా ఒక్కటే..
- సుమిత్‌ బెనర్జీ, 17వ అంతస్తు, మంజీరా మెజిస్టిక్‌ హోమ్స్‌

‘కొనుగోలు చేసేటప్పుడు ఏ అంతస్తు అనే ఆలోచనే తప్ప.. ఒక్కసారి అందులోకి వచ్చాక ఏదైనా ఒకటే. నేను 17వ అంతస్తులో ఉంటాను.. మా అపార్ట్‌మెంట్‌ మొత్తం 23 అంతస్తులు. చుట్టూ చూడటానికి బాగుండాలంటే పై అంతస్తులను వెళ్లొచ్చు. లేకపోతే నా దృష్టిలో ఏదైనా ఒకటే. 24 గంటల విద్యుత్తు బ్యాకప్‌ ఉంటుంది కాబట్టి సమస్య ఉండదు.’


చివరి అంతస్తు కాకుండా..
- ఎస్‌.వి.జి.వెంకటరమణ, 13వ అంతస్తు, రెయిన్‌బో విస్టాస్‌

‘నిర్మాణదారులు కొనుగోలుదారులకు హామీ ఇచ్చిన మేరకు.. నిబంధనల ప్రకారం నిర్మిస్తే సాధారణ బహుళ అంతస్తుల కంటే ఆకాశహర్మ్యాల్లో నివాసం సౌకర్యవంతంగా ఉంటుంది. 14 అంతస్తుల మా అపార్ట్‌మెంట్‌లో మేం పదమూడో అంతస్తులో ఉంటాం. మాపైన మరో అంతస్తు మాత్రమే. చివరి అంతస్తులో వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి కిందనే తీసుకోవాలి. ఇక కింది అంతస్తులో ఉంటే మెట్ల మార్గంలో.. లిఫ్ట్‌ వద్ద వచ్చిపోయే వారితో ఇబ్బందిగా ఉంటుంది. పైకి వెళ్లే కొద్దీ ఈ సమస్యలు ఉండవు. మూడు నాలుగు లిఫ్ట్‌లు ఉంటాయి కాబట్టి ఎదురుచూపు ఉండదు. అగ్నిమాపక ఏర్పాట్లు చేస్తే భయపడాల్సిన పనిలేదు. కాకపోతే బిల్డర్‌ ఇవన్నీ పక్కాగా నిర్మించి ఇచ్చేలా చూసుకోవాలి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని