పార్కింగ్‌కు సెల్లారే ఎందుకు?

నగరంలో భారీ వర్షం పడితే కొన్ని ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు నీటమునుగుతున్నాయి. సెల్లార్లు వరద నీటితో నిండిపోతున్నాయి. వర్షం కురిసిన ప్రతిసారీ ప్రాంతాలు మారుతున్నాయి కానీ దృశ్యాలు మాత్రం అవే. రూ.లక్షలు పోసి కొన్న ఫ్లాట్లవాసుల అవస్థలు అంతా ఇంతా కాదు. లోతట్టు ప్రాంతాల్లో సెల్లారు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం కట్టొచ్చుగా? ఎందుకు సెల్లార్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు...

Published : 07 Oct 2017 01:37 IST

పార్కింగ్‌కు సెల్లారే ఎందుకు?
ఈనాడు, హైదరాబాద్‌ 

గరంలో భారీ వర్షం పడితే కొన్ని ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు నీటమునుగుతున్నాయి. సెల్లార్లు వరద నీటితో నిండిపోతున్నాయి. వర్షం కురిసిన ప్రతిసారీ ప్రాంతాలు మారుతున్నాయి కానీ దృశ్యాలు మాత్రం అవే. రూ.లక్షలు పోసి కొన్న ఫ్లాట్లవాసుల అవస్థలు అంతా ఇంతా కాదు. లోతట్టు ప్రాంతాల్లో సెల్లారు లేకుండా బహుళ అంతస్తుల నిర్మాణం కట్టొచ్చుగా? ఎందుకు సెల్లార్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు?
ఇళ్లు పల్లంలో కాకుండా.. ఎవరైనా సాధారణంగా ఎత్తుగా ఉన్న ప్రదేశాల్లో నిర్మించుకొంటారు. స్థలం కొనేటప్పుడే దిక్కులతోపాటు పరిసరాలు చూశాకే నిర్ణయం తీసుకొంటారు. నగరాల్లో అన్నిచోట్ల అన్నివేళల్లో అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇళ్ల స్థలాల కొరత నేపథ్యంలో అందుబాటులో ఉన్న భూమిలోనే కలల గృహం నిర్మించుకొంటారు. లోతట్టు ప్రాంతంలో రహదారికంటే దిగువన ఉంటే వ్యక్తిగత గృహ నిర్మాణం నీట మునగకుండా ఎత్తు పెంచి కట్టుకుంటున్నారు. బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్న కొందరు నిర్మాణదారులు మాత్రం కనీస జాగ్రత్తలు తీసుకోకుండా కట్టేసి చేతులు దులుపుకొంటున్నారు. తక్కువ ధరకు వస్తుందనో.. కోరుకున్న ప్రాంతంలో లభిస్తుందనో అందులో ఫ్లాట్లు కొన్నవారు వర్షం పడితే వణకాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎందుకిలా.. నగరంలో నీట మునుగుతున్న బహుళ అంతస్తుల నివాసాలు చూస్తే చాలావరకు ఐదంతస్తుల భవనాలే. సాధారణ, మధ్యతరగతి వాసులే వీటిలో ఎక్కువగా నివసిస్తున్నారు. మునుగుతున్న అపార్ట్‌మెంట్లు అధికంగా పంచాయతీల పరిధిలో అక్రమంగా నిర్మించినవే. జీహెచ్‌ఎంసీలోనూ లేకపోలేదు.
అనుమతి అక్కర్లేదని.. వాణిజ్య భవనాలైతే ఎత్తు 15 మీటర్లు, నివాస సముదాయలైతే 18 మీటర్లు దాటితే అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరి. దీన్నుంచి తప్పించుకునేందుకు నిర్మాణదారులు జాగ్రత్త పడుతున్నారు. భూమి నుంచి ఎత్తును పరిగణిస్తారు కాబట్టి పార్కింగ్‌ కోసం సెల్లార్‌వైపు మొగ్గు చూపుతున్నారు. నిర్మాణదారులు మాత్రమే స్టిల్ట్‌ను పార్కింగ్‌ కోసం కేటాయిస్తున్నారు. మిగిలినవారు కేటాయించకపోవడానికి పలు కారణాలను చెబుతున్నారు.
* స్టిల్ట్‌ అంటే గ్రౌండ్‌ఫ్లోర్‌. సెట్‌బ్యాక్‌పోను నిర్మాణం వచ్చే ప్రాంతం పరిమితంగా ఉంటుంది. పైగా వాచ్‌మన్‌ గది పోను వాహనాలకు పార్కింగ్‌కు చాలడం లేదని సెల్లారుకు వెళ్తున్నామంటున్నారు. సెల్లార్‌ అయితే ఉన్న స్థలం మేరకు పైన శ్లాబు వేయడంతో అధిక విస్తీర్ణం లభ్యత ఉండటంతో ఇటువైపే మొగ్గుచూపుతున్నారు.
* ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే బహుళ అంతస్తుల భవనాల ప్రాజెక్టుల్లో ఫ్లాట్ల సంఖ్య ఎక్కువ కాబట్టి సిల్ట్‌, సెల్లార్‌ 1, ఇంకా ఎక్కువ ఫ్లాట్లు ఉంటే సెల్లార్‌ 2 పార్కింగ్‌కు కేటాయిస్తున్నారు. నిర్వహణ బాధ్యతలను ప్రత్యేకంగా ఒక సంస్థ చూసుకుంటుంది కాబట్టి సమస్య లేదు. ఎటొచ్చీ తక్కువ విస్తీర్ణంలో అందునా లోతట్టు ప్రాంతాల్లో కడుతున్న సెల్లార్లు మునిగే ప్రమాదాలున్నాయి.
* అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుందని కొందరు నిర్మాణదారులు అంటున్నారు. అయితే సెల్లార్ల తవ్వకం.. అక్కడ రాయి వస్తే తొలగిచంచడం.. చుట్టూ రక్షణ గోడలు నిర్మించడం, సబ్‌సెల్లార్లతే శ్లాబుల ఖర్చు కలిపితే పెద్ద తేడా ఉండదని కొందరు నిర్మాణదారులు అంటున్నారు.
* ఇప్పుడు మారుతున్నారు.. భవనాల ఎత్తు విషయంలో నిబంధనలను గత ఏడాది ప్రభుత్వం సవరించింది. దీంతో నిర్మాణాల్లో అధిక ఫ్లాట్లు ఉంటే తప్ప సెల్లార్లకు వెళ్లడం లేదని నిర్మాణదారులంటున్నారు. పార్కింగ్‌ కోసం ఉపయోగించే స్టిల్ట్‌ను ఎత్తులో పరిగణించడం లేదని జీహెచ్‌ఎంసీ సహాయ పట్టణ ప్రణాళిక అధికారి సాయి తెలిపారు. అయితే అగ్నిమాపకశాఖ మాత్రం భూమి నుంచే తాము ఎత్తును పరిగణనిస్తామని చెబుతుండటంతో కొంత సందిగ్ధం నెలకొంది. ‘అన్నింటికీ ఒకే నిబంధన పెట్టడం మంచిది కాదు. భవన నిర్మాణాల్లో వెసులుబాటు ఉండటం వల్ల ఆయా పరిస్థితులను అనుగుణంగా నిర్మాణం చేయడానికి వీలవుతుంది. ఇదే మంచిది కూడా’ అని స్థిరాస్తి సంఘ ప్రతినిధి ఒకరు అన్నారు.

అనధికార భవనాల్లోనే ముంపు ఎక్కువ.. జీహెచ్‌ఎంసీ పరిధిలో బిల్టప్‌ ఏరియాలో పార్కింగ్‌ కోసం 33 శాతం కేటాయించాలి. ఇందులో నివాసితుల కోసం 30 శాతమైతే.. సందర్శకుల కోసం మరో 3 శాతం. హెచ్‌ఎండీఏ పరిధిలో 22 శాతం నిబంధన ఉంది. గతంలో గ్రామపంచాయితీల పరిధిలో పార్కింగ్‌కు అంటూ మినహాయింపులుండేవి కావు. దీంతో జీ+2, 3 అంతస్తులు నిర్మించేవారు. గ్రౌండ్‌ఫ్లోర్‌ వదిలితే ఫ్లాట్లు తగ్గుతాయి కాబట్టి అనధికారికంగా సెల్లార్లు నిర్మించేవారు. స్థిరాస్తి భూమ్‌ సమయంలో ఎక్కువగా ఇవి వెలిశాయి. పూర్తి అభివృద్ధి చెందిన ప్రాంతాలు కాకపోవడంతో ఎక్కడ వరద కాలువలున్నాయనే అవగాహన లేక కట్టడం కూడా సమస్యలకు కారణం. వర్షాలకు మునుగుతున్న వాటిలో చాలావరకు ఇలాంటివే.
- జె.వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌
పార్కింగ్‌ పైఅంతస్తుల్లో మేలు.. ‘‘నిర్మాణ ఎత్తు ఆంక్షల దృష్ట్యా గతంలో పార్కింగ్‌ సెల్లార్లలో నిర్మించేవారు. పరిమిత ఎత్తు దాటితే మరిన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉండటంతో స్టిల్ట్‌, సెల్లార్‌, సబ్‌ సెల్లార్‌ పార్కింగ్‌కు వదిలేవారు. ఇప్పుడు ఎత్తుకు సంబంధించి పార్కింగ్‌ కోసం వదిలిన అంతస్తులకు మినహాయింపులు ఇస్తున్నారు. లోతట్టు ప్రదేశాల్లో పార్కింగ్‌ కోసం స్టిల్ట్‌, ఆపైన వదలడం మేలు. దీంతో కరెంట్‌ బిల్లులు వంటి నిర్వహణ భారమూ తగ్గుతుంది. లీకేజీలు, వరద ముప్పు వంటి సమస్యలూ ఉండవు.
- ఎం.విజయసాయి, ఉపాధ్యక్షుడు, ట్రెడా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని