వంటగది ఏ దిక్కున ఉండాలి?

వంట గదుల అలంకరణలో ఎన్ని ఆధునికపోకడలు వచ్చినా వాటి లక్ష్యం సౌకర్యంగా ఉండటమే. అందంగా, శుభ్రంగా కన్పిస్తే మాత్రమే చాలదు. ప్రకృతిసిద్ధంగా తగినంత గాలి, వెలుతురు అవసరం. అలా ఉండాలంటే ఇంటిలో వంటగది

Published : 17 Mar 2018 01:15 IST

వంటగది ఏ దిక్కున ఉండాలి?
ఈనాడు, హైదరాబాద్‌

వంట గదుల అలంకరణలో ఎన్ని ఆధునికపోకడలు వచ్చినా వాటి లక్ష్యం సౌకర్యంగా ఉండటమే. అందంగా, శుభ్రంగా కన్పిస్తే మాత్రమే చాలదు. ప్రకృతిసిద్ధంగా తగినంత గాలి, వెలుతురు అవసరం.  అలా ఉండాలంటే ఇంటిలో వంటగది ఏ దిక్కున ఉండాలి? వాస్తు ఏం చెబుతుందో.. వివరిస్తున్నారు వాస్తు నిపుణులు పి.కృష్ణాదిశేషు.

వాస్తు శాస్త్రం ప్రకారం మనిషి మనుగడ సాఫీగా సాగిపోవడానికి ఇంట్లో ఏ గది ఏ దిశలో ఉంటే ఉపయోగకరంగా ఉంటుందనేది వివరంగా ఉంది. వంటగది విషయానికి వస్తే.. ముఖ్యంగా ఆగ్నేయ దిశ లేక మూలన ఉండటం అన్ని విధాల శ్రేయస్కరం. శాస్త్రీయంగా చూస్తే ఆగ్నేయ మూలన ఏర్పాటుతో తూర్పు దక్షిణ దిక్కుల నుంచి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. తద్వారా వంట చేసే వారికి అలసట.. విసుగు లేకుండా పనులు చకచకా చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. సాధారణంగా పొయ్యి వెలిగించేటప్పుడు పొయ్యి నుంచి, అగ్గి పుల్లల నుంచి కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువు వెలువడుతుంది. దీనికి అనారోగ్యం పాలు చేసే స్వభావం ఉంది. తరచూ ఇలాంటి గాలి పీల్చడం వల్ల త్వరగా అలసిపోవడం, తల తిరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
* రెండు దిశలలో కిటికీలు లేక ద్వారాలు ఉండేలా చూసుకొంటే మంచిది. పొయ్యి నుంచి వెలువడే ఆవిరులు, ఘాటు వాసనలు బయటకు సులువుగా వెళతాయి. పోపులు, కూరల వేపుళ్లు వగైరా చేసేటప్పుడు ఘాటు పొగల్లాంటివి వెలువడి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆగ్నేయంలో ఉండటంతో కిటికీలు, ద్వారాల ఏర్పాటు కుదురుతుంది.
* ఇంటికి ఆగ్నేయ మూల ఏర్పాటుతో వంట చేసేవారు తూర్పు అభిముఖంగా ఉండి చేయడం వల్ల కిటికీ నుంచి వచ్చే వెలుతురు కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ మీద పడుతుంది. పాత్రల్లోని వంటలు వగైరా బాగా కన్పించడమే కాదు... వంట చేసేవారి నీడ ఆటంకంగా ఉండదు.

వాయువ్యంలో ఉండవచ్చా?
వంటగది  వాయువ్యం దిక్కునా ఉండవచ్చు. ఇదీ శాస్త్ర సమ్మతమే. వాయువ్యంలో వంటగది ఉంటే తూర్పు అభిముఖంగా వంట చేసే వారి నీడ పొయ్యి మీద పడే అవకాశం ఉంది. తగినంత వెలుతురు వచ్చేలా చూసుకొంటే ఇబ్బంది కలగదు.
* వంట చేసేవారికి అవసరమైన సామగ్రి, సరకులు వగైరా అందుబాటులో  అవసరం. తదనుగుణంగా  గది తగినంత విశాలంగా ఉండాలి. ఒకరిద్దరు అటుఇటు తిరగానికి వీలుగా ఉండటమూ అవసరమే.
* ఇల్లు కట్టుకునేటప్పుడు వంటగది  ప్రాధాన్యం రీత్యా తగినంత పొడవు, వెడల్పు ఉండేలా చూసుకోవాలి. 8X8 అడుగులు, 8X10, 8X12, 10X12 అడుగులు బాగా కుదురుతుంది. సరకులు భద్రపర్చే గది విడిగా లేకపోతే  గది మరింత విశాలంగా ఉండేలా చూసుకోవాలి. వంట చేసేవారికి అందుబాటులో ఫ్రిజ్‌ ఉండాల్సిన ఆవశ్యకతనూ పరిగణనలోకి తీసుకోవాలి.
* గోడలకు వేసే రంగులు, ఆధునిక కిచెన్‌ వార్డ్‌రోబ్‌ రంగుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తిగా ముదురు రంగులు మానసికంగా ఇరుకుగా ఉన్నట్టుగా అన్పించడమే కాక, వెలుతురును తగ్గిస్తాయి. అలాగని లేత రంగులు త్వరగా మసకబారుతాయి. ఈ రెండు సమస్యలను తీర్చేలా రంగుల ఎంపిక ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని