ఇంకుడు గుంత ఎక్కడ తీసుకోవాలి?

రూ.లక్షలు, రూ.కోట్లు పెట్టి ఇల్లు కడతాం. వాస్తు, ప్లానింగ్‌ ఇలా ఎన్నో అన్నింటినీ ప్రయత్నించి జాగ్రత్తలు తీసుకుంటాం. అయినా.. ఒక్కడో వెలితి. ఇతరుల ఇల్లు చూసినప్పుడు ఏదో ఓ సందేహం వస్తూనే ఉంటుంది.

Published : 14 Jul 2018 01:39 IST

ఇంకుడు గుంత ఎక్కడ తీసుకోవాలి?

రూ.లక్షలు, రూ.కోట్లు పెట్టి ఇల్లు కడతాం. వాస్తు, ప్లానింగ్‌ ఇలా ఎన్నో అన్నింటినీ ప్రయత్నించి జాగ్రత్తలు తీసుకుంటాం. అయినా.. ఒక్కడో వెలితి. ఇతరుల ఇల్లు చూసినప్పుడు ఏదో ఓ సందేహం వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వాస్తు, దిక్కులు, బోర్ల తవ్వకం, ఇంకుడు గుంతల తవ్వకం, వీధిపోటు ఈ విషయాల్లో ఓ సగటు నగర వాసికి ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తుంటాయి. ఇంకుడు గుంతలు ఇంటి ఆవరణంలో ఎక్కడ నిర్మించుకుంటే మంచిదో ఇప్పటికీ చాలా మందికి సమాధానం దొరకని ప్రశ్నే. అలా.. సగటు వ్యక్తిని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు, కొందరు లేవనెత్తగా వాటిని ప్రముఖ వాస్తు నిపుణులు పి.కృష్ణాది శేషు నివృత్తి చేశారు. అందరిలో ఉదయించే సందేహాలకు పరిష్కారయుతమైన సమాధానాలు సూచించారు.

ప్రశ్న: ప్రస్తుతం వానలు పడుతున్నాయి. వర్షపు నీటిని ఇంటి ప్రాంగణంలో భూమిలోకి ఇంకేందుకు ఇంకుడు గుంతలు తవ్వించే ఆలోచన ఉంది. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఏర్పాటు వాస్తు ప్రకారం ఉండాలా?

- పి.రవికుమార్‌, చిక్కడపల్లి

జవాబు: ఇంటి నిర్మాణ ప్లానింగ్‌ వాస్తు శాస్త్ర ప్రకారం చేసుకోవడం సర్వసాధారణం. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం వదలడం అనేది వాస్తు నియమాల ప్రకారం తూర్పు, ఉత్తర దిక్కుల్లో ఉంటుంది. ఇంకుడు గుంతలకూ ఆయా దిశల్లో అనువుగా ఉంటుంది. పైగా ఆ దిశలలోనే బావి లేక బోరు ఏర్పాట్లు ఉంటాయి.. కాబట్టి అన్నివిధాల శ్రేయస్కరం.
ప్ర: ఈశాన్య వీధిపోటు చాలా మంచిది అంటారు. నిజమేనా?

- జి.వి.ఎస్‌. జగన్నాథం, నార్సింగి

జ: ఈశాన్య వీధిపోటు ఉన్న ఇంటిలో నివసించేవారికి సిరిసంపదలు మెండుగా ఉంటాయి. అన్ని శుభాలే జరుగుతాయని కొందరి భావన. గట్టి నమ్మకం కూడా. నిజానికి ఏ వీధి పోటు అయినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనర్థాలకు దారితీస్తుంది. దీనికి ముఖ్య కారణం ఆ ఇంటి ఎదురు వీధి నుంచి వచ్చే వాహనాలు ఇతర ప్రయాణ సాధనాలు, కాలిబాటలో వచ్చేవారికి ఆయా ఇళ్లపై తమ ప్రమేయం లేకుండానే వారి దృష్టిపడుతుంది. ఆ ఇంటిపైగాని, ఆ ఇంటిలో ఉండేవారిపై మంచోచెడో అభిప్రాయం కల్గుతుంది. అంటే నరుల దృష్టి అన్నమాట. మరో విషయం ఏంటంటే వాహనాలపై వచ్చేవారు మలుపు తిరగడానికి తత్తరపాటుతో గానీ, వేగాన్ని నియంత్రించుకోలేకపోయినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇల్లు పల్లపు ప్రాంతం అయితే వర్షపు నీరు, డ్రైనేజీ పొంగినప్పుడు ఆ ఇంటి ప్రాంగణంలోకి వచ్చే ప్రమాదం ఉంది. వీధి పోటు ఉన్న స్థలంలో ఇల్లు కట్టినప్పుడు వాస్తు నిపుణులు, ఇంజినీర్ల సలహాలు మేలు చేస్తాయి. ఆ తర్వాతే నమ్మకాల ప్రభావం.
ప్ర: తూర్పు, ఉత్తర దిక్కులున్న స్థలాలు, ఇళ్లకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. వాస్తు తెలిసినవారైనా ఈ రెండు దిక్కులకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. పడమర, దక్షిణ దిక్కుల మాటేమిటి?

- కె.సాయినాథ్‌, సనత్‌నగర్‌

జ: దిక్కు ఏదైనా నిర్మాణం మాత్రం శాస్త్ర ప్రకారం ఉండటం శుభప్రదం. వాస్తవానికి పడమర, దక్షిణ దిక్కుల ఇళ్లలో నివసించే వారు సుఖశాంతులతో పాటూ సంతృప్తికరమైన జీవితాన్ని సాగిస్తున్నారని భావించాలి.
ప్ర: ప్రజోపయోగ ప్రదేశాలైనా పార్కులు, క్రీడ స్థలాల ఏర్పాటులో వాస్తు పాటించడం సాధ్యమా?

- రఘురామ్‌, వనస్థలిపురం

జ: ప్రకృతికి అనుగుణంగా వాస్తు శాస్త్రం రూపొందించారు. పార్కులు, క్రీడా సముదాయాలు వినియోగించేది మనుషులే కాబట్టి వీటికి పాటించొచ్చు. వాటిలో సూర్యరశ్మీ, గాలి, వెలుతురు సమృద్ధిగా పొందేలా నిర్మించుకోవాలంటే వాస్తు శాస్త్ర నియమాలు ఉపకరిస్తాయి.
ప్ర: వాస్తరీత్యా ఇల్లు కట్టుకున్న వారంతా గొప్ప వారవుతారా?

- రాయపూడి కృష్ణారావు, సికింద్రాబాద్‌

జ: వాస్తురీత్యా ఇల్లు కుట్టుకున్న వారంతా అత్యంత ధనవంతులు, గొప్పవారవుతారని, కోరుకున్న విజయాలను అందుకోగలరనేది కచ్చితంగా చెప్పలేం. కానీ ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా సృష్టిలో లభ్యమయ్యే సహజవనరులను సమృద్ధిగా వినియోగించుకోగలరు. విశ్వశిస్తూ ముందుకు వెళ్లే వ్యక్తి నమ్మకంతో పూర్తి సామర్థ్యాలను ప్రదర్శించే అవకాశం ఉంది. తద్వారా మంచి ఫలితాలను, సంతృప్తికర జీవితాలను అనుభవించడానికి ఆస్కారం కల్గుతుంది. మంచి చెడులను గమనిస్తూ అనుభవజ్ఞుల సలహా, సంప్రదింపులకు ప్రాధాన్యత ఇస్తూ, ఓర్పు నేర్పులతో ముందుకు వెళతారు. తద్వారా మేలు కల్గుతుంది.
ప్ర: గతంలో వాస్తుకు ఇంతగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఈ మధ్యనే ఎక్కువైంది అనే అభిప్రాయం ఉంది? 

- పి.నారాయణ, రామంతాపూర్‌

జ: నిజానికి ప్రకృతి ఆధారంగా ఏర్పడిన వాస్తు శాస్త్రం ఎప్పటి నుంచో ఉంది. ఆనాడు ఈ శాస్త్రం కేవలం గుంబనంగా ఉండేది. కొందరి పండితులు, నిపుణుల వద్ద ఉండేది. వ్యాపార దృక్పథం కాక సమాజ శ్రేయస్సు కోసం ఉండేది. రానురాను కుల వృత్తులు మారి, ఆచార వ్యవహారాల్లో మార్పులు రావడం, వాస్తు ఆలోచన పరిజ్ఞానం ఉన్నవారంతా ఒక వ్యాపారంలా మార్చేశారు. కొందరి అవగాహన రాహిత్యంతో శాస్త్రాలపై భిన్నభిప్రాయాలు కల్గుతున్నాయి. శాస్త్రాల వెనక శాస్త్రీయ దృక్పథంతో చూస్తున్న మీదట సానుకూల అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.
ప్ర: వీధి శూల ఉన్న ఇంటి ముందు దేవుని విగ్రహాలు పెడతారు కదా! ఫలితంగా దోష నివారణ కల్గుతుందా?

- కె.రమణయ్య, ముషీరాబాద్‌

జ: కొన్ని నమ్మకాలు మంచి ఫలితాలనే ఇస్తాయి. వీధి పోటు ఉన్న ఇంటి ముందు దేవతా విగ్రహాలు ఉండటం మూఢనమ్మకం కంటే ఎదురుగా వచ్చే వారి దృష్టి ఆ విగ్రహాలపై పడి తమని తాము నియంత్రించుకుంటారు. తగిన జాగ్రత్తలతో వాహనాలను నడుపుతూ ప్రమాదాల బారిన పడరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని