ఉత్తరం వైపు ఊపు

ఒకే దేశం ఒకే పన్ను పేరుతో అమల్లోకి తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) గృహ కొనుగోలుదారులకు తీవ్ర భారంగా మారినా.. గోదాముల నిర్మాణానికి కలిసి వచ్చింది. నగరంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాలు, ఇతర పట్టణాల్లో గోదాముల నిర్మాణంలో ఊపు వచ్చింది. గత ఏడాది తొలి అర్థిక సంవత్సరంతో పోలిస్తే..

Published : 25 Aug 2018 01:44 IST

ఉత్తరం వైపు ఊపు
గోదాముల నిర్మాణానికి ఊతమిచ్చిన జీఎస్‌టీ
లీజుల విషయంలో 25శాతం పెరుగుదల
ఈనాడు, హైదరాబాద్‌

ఒకే దేశం ఒకే పన్ను పేరుతో అమల్లోకి తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) గృహ కొనుగోలుదారులకు తీవ్ర భారంగా మారినా.. గోదాముల నిర్మాణానికి కలిసి వచ్చింది. నగరంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాలు, ఇతర పట్టణాల్లో గోదాముల నిర్మాణంలో ఊపు వచ్చింది. గత ఏడాది తొలి అర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్ధభాగంలో గోదాముల లీజింగ్‌ హైదరాబాద్‌లో 25 శాతం పెరిగిందని ‘ఇండియా ఇండస్ట్రీయల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మార్కెట్‌’ విడుదల చేసిన సీబీఆర్‌ఈ తాజా నివేదికలో పేర్కొంది.

హైదరాబాద్‌ స్థిరాస్తి మార్కెట్‌లో ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య భవనాలు, మాల్స్‌, ఈ-కామర్స్‌, ఫర్నీచర్‌, రిటైల్‌, థర్డ్‌పార్టీ సంస్థలు, ఉత్పత్తి రంగాల విస్తరణ ప్రణాళికతో గోదాముల నిర్మాణం కీలకంగా మారింది. జీఎస్‌టీతో వీటి నిర్మాణాలకు డిమాండ్‌ పెరిగింది. ఇప్పటికే నగర శివారులో పెద్దఎత్తున గోదాముల నిర్మాణం జరిగింది. కొంపల్లి, మేడ్చల్‌, గుండ్లపోచంపల్లి, నానక్‌రాంగూడ, నార్సింగి తదితర ప్రాంతాల్లో భారీగా గోదాముల నిర్మాణం జరిగింది.

* ఉత్తర హైదరాబాద్‌ వైపు 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా నిర్మాణాలు వచ్చాయి. ఫ్యూచర్‌ గ్రూపు 1,30,000 చదరపు అడుగులు, డెలివరీ ఎక్స్‌ప్రెస్‌ 1,14,000చ.అ. కండ్లకోయలో లీజుకు తీసుకున్నాయి. యూపీఎల్‌ సీడ్స్‌ 1,10,000 చ.అ. కిష్టాపూర్‌లో తీసుకుంది.
* ఉత్తర ప్రాంతంలోనే 90 శాతం లావాదేవీలు జరిగాయి. వీటిలో 38 శాతం వాటా థర్డ్‌ పార్టీ సంస్థలది కాగా.. ఎఫ్‌ఎంసీజీ సంస్థలు 18 శాతం, మిగతావి రిటైల్‌ సంస్థలు తీసుకున్నాయి. అద్దెల్లోనూ 4 శాతం వృద్ధి నమోదైంది. మిగతా ప్రాంతాల్లో  స్థిరంగానే ఉన్నాయి.
* ఉత్తరం తర్వాత తూర్పు ప్రాంతంలో పురోగతి కన్పిస్తోంది. ఆదిభట్లలో 22 ఎకరాల విస్తీర్ణంలో అంకాన్‌ గ్రూపు లాజిస్టిక్‌ హబ్‌ నిర్మిస్తోంది.
* పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో ఈ-కామర్స్‌, ఎఫ్‌ఎంసీజీ సంస్థలు తమ గోదాముల ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నాయి.
* నెలకు చదరపు అడుగు లీజు ఉత్తర ప్రాంతంలో రూ.9.5 నుంచి రూ.15 మధ్యలో ఉంది. పశ్చిమ ప్రాంతంలో రూ.8-12 మధ్య, తూర్పు ప్రాంతంలో రూ.16-20, దక్షిణం వైపు రూ.11-13 మధ్య ఉన్నాయి.

దేశవ్యాప్తంగా చూస్తే..
* ఏడాది తొలి భాగంలో కోటి చదరపు అడుగుల నిర్మాణాలను అద్దెకు తీసుకున్నారు.
* నగరాలవారీగా చూస్తే బెంగళూరు(25%), దిల్లీ(21%), ముంబయి(20%) రవాణారంగంలో ముందు వరసలో ఉన్నాయి. దక్షిణాదిలో చెన్నై(12%) తర్వాత హైదరాబాద్‌ ఉంది. కోల్‌కతా(8%), పుణె(3%), అహ్మదాబాద్‌(1%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
* రంగాలవారీగా చూస్తే ఈ-కామర్స్‌(30%)దే అగ్రపథం. థర్ట్‌పార్టీ సంస్థలు(27%), రిటైల్‌(14%), ఇంజినీరింగ్‌, ఉత్పత్తిరంగం(8%), ఎలక్ట్రానిక్స్‌(6%), ఎఫ్‌ఎంసీజీ(5%) వాటా అక్రమించాయి. ఇతరత్రా 10 శాతం ఉన్నాయి.
* సగటు లీజు ఒప్పందం గత ఏడాది తొలి అర్ధసంవత్సరంలో 75వేల చదరపు అడుగులు కాగా.. ఈసారి 90వేలకు పెరిగింది.
* ఈ-కామర్స్‌, రిటైల్‌ సంస్థలే ఏకంగా 30 లక్షల చ.అ.ను లీజుకు తీసుకున్నాయి.
* ప్రభుత్వాల ప్రోత్సాహాకాలు, సులభతర వ్యాపార వాతావరణంతో విదేశీ సంస్థల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దేశీయంగా ఈ రంగంలోకి కొత్తగా అడుగుపెడుతున్నవారూ పెరుగుతున్నారు.
* దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో అద్దెల్లో భారీ వృద్ధి కనిపించింది. కోల్‌కతాలోని ఎన్‌హెచ్‌-6 ప్రాంతం, ముంబయిలోని భీవండి ప్రాంతంలో అత్యధికంగా అద్దెలు ఉన్నాయి. పెరుగుదల 15 నుంచి 24 శాతం వరకు ఉంది.
* ఇతర మార్కెట్లలో చూస్తే కోల్‌కతాలోని ఎన్‌హెచ్‌-2, హైదరాబాద్‌లోని ఉత్తర ప్రాంతం, బెంగళూరులోని దక్షిణ ప్రాంతాల్లో, దిల్లీలోని ఎన్‌హెచ్‌-1 ప్రాంతంలో అద్దెల వృద్ధి 3 నుంచి 5 శాతం మధ్యలో ఉంది.
* ఈ తొలి భాగంలో పెద్ద ఒప్పందాలు జరిగాయి. బెంగళూరులో ఫ్లిప్‌కార్ట్‌ 3,90,000 చదరపు అడుగులు, డీమార్ట్‌ 3,00,000 చ.అ. ముంబయిలో, యూసెన్‌ లాజిస్టిక్స్‌ 2,50,000 చ.అ. ఒప్పందాలు జరిగాయి. పుణె, దిల్లీలో లావాదేవీలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎల్‌జీ, హైర్‌ సంస్థలు ఇక్కడ 2 లక్షలు, 2.56 లక్షల చ.అ. లీజుకు తీసుకున్నాయి.

* దిల్లీలో అద్దెలు చదరపు అడుగుకు నెలకు రూ.38- 52 మధ్యలో ఉంది. గుడ్‌గావ్‌లో రూ.15-22 మధ్యలో ఉండగా, ఘజియాబాద్‌ రూ.17 - 21 వరకు ఉన్నాయి.
* బెంగళూరులో అద్దెలు రూ.16-28 మధ్య, చెన్నైలో రూ.11-32 వరకు ఉన్నాయి. పుణెలో రూ.20-26 మధ్యలో ఉండగా.. హైదరాబాద్‌లో అత్యల్పంగా రూ.8-20 మధ్యలో అద్దెకు దొరుకుతున్నాయి. ఇక్కడ వృద్ధికి మరింత అవకాశం ఉందని స్థిరాస్తి కన్సల్టెంట్లు విశ్లేషిస్తున్నారు.

భవిష్యత్తులో మరింత వృద్ధి..
గోదాముల నిర్మాణంతోపాటు ఇతర రంగాలు అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా దీనికి అనుబంధంగా ఉన్న రవాణా రంగం కీలకంగా మారనుంది. ఆ రంగంలో భారీ ప్రగతి కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

* రవాణారంగ మార్కెట్‌ ప్రస్తుతం 160 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు కాగా.. 2020 నాటికి 215 అమెరికన్‌ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
* థర్డ్‌ పార్టీ, ఈ-కామర్స్‌ సంస్థలే మరికొద్ది సంవత్సరాలు ఈ రంగంలో అధీపత్యం చెలాయించనున్నాయి.
* జీఎస్‌టీ తర్వాత ప్రైవేటు ఈక్విటీ నిధులను భారత రవాణా రంగంలో పెట్టుబడి పెట్టారు. ఫలితంగా ప్రపంచస్థాయి ప్రమాణాలను ఈ రంగం అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని