కళ్ల ముందు అనుభవాలు..మీకొద్దు ఆ పాట్లు

బౌరంపేటలో ఓ విల్లా ప్రాజెక్ట్‌కు అనుమతులు లేకపోవడంతో కట్టిన నిర్మాణాలను హెచ్‌ఎండీఏ అధికారులు ఇటీవల కూల్చేయడంతో కొనుగోలుదారులు తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. బాలాపూర్‌లో మరో సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్‌ వివాదాల్లో చిక్కుకుంది.. బేగంపేటలో ....

Published : 22 Apr 2017 02:02 IST

కళ్ల ముందు అనుభవాలు..మీకొద్దు ఆ పాట్లు
ఈనాడు, హైదరాబాద్‌

* ప్రతి 10 మందిలో 8 మంది తాము కొనే ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అనే స్పష్టత లేకుండానే బుక్‌ చేస్తున్నారు.
* ప్రతి 10 మంది నిర్మాణదారుల్లో ఏడుగురు ప్రాజెక్ట్‌ ప్రారంభానికి ఉన్న అనుమతులను కొనుగోలుదారులకు చూపడానికి నిరాకరిస్తున్నారు.
* కొనే ప్రతి 10 మందిలో 9 మందికి ప్రాజెక్ట్‌ ఆర్థిక నిర్వహణ, పూర్తి చేయగలరా లేదా అనే అంశాలపై అసలు ఏమాత్రం అవగాహన లేదు.
* కొనుగోలు చేసిన ప్రతి 10లో 6గురు నివాసయోగ్య పత్రం(ఓసీ), ప్రాజెక్ట్‌ పూర్తి(సీసీ) పత్రం ఇవ్వాలని బిల్డర్‌తో పోరాడుతున్నారు. ఇటీవల ట్రాక్‌ 2 రియాలిటీ సంస్థ సర్వేలో వెల్లడైన విషయాలివి.
బౌరంపేటలో ఓ విల్లా ప్రాజెక్ట్‌కు అనుమతులు లేకపోవడంతో కట్టిన నిర్మాణాలను హెచ్‌ఎండీఏ అధికారులు ఇటీవల కూల్చేయడంతో కొనుగోలుదారులు తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. బాలాపూర్‌లో మరో సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్‌ వివాదాల్లో చిక్కుకుంది.. బేగంపేటలో హుస్సేన్‌సాగర్‌ పరివాహక ప్రాంతంలో వెంచర్‌ వేయడంతో జీహెచ్‌ఎంసీ లేఅవుట్‌ను ధ్వంసం చేసింది. నగర శివార్లలో పలు అక్రమ వెంచర్లను అధికారులు కూలదోశారు. కొహెడ మార్గంలో ఒక నిర్మాణదారు బుకింగ్‌ సమయంలో పలు సౌకర్యాలు ఉంటాయని చెప్పి ఇప్పుడేమో చేద్దాం.. చూద్దాం అంటూ దాటవేస్తున్నాడు.

నిర్మాణదారుల మీద నమ్మకంతో కొనుగోలుదారులు పూర్తి వివరాలు తెలుసుకోకుండానే కొనుగోళ్లకు సిద్ధపడుతుండటంతో ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు బిల్డర్లు ఇదే పనిగా అమాయక కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు.

తెలుసుకుంటేనే..
నగరంలో అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్నారంటే అంతస్తులను బట్టి చుట్టూ వదిలే ఖాళీ స్థలం ఎంత ఉండాలనేది నియమ నిబంధనలు ఉన్నాయి. ఇవేవీ పట్టించుకోకుండా.. సెట్‌బ్యాక్‌ వదలకుండానే కొంత మంది బిల్డర్లు ఇప్పటికీ నిర్మాణాలు చేపడుతున్నారు. శివార్లలోనూ ఇటీవల బహుళ అంతస్తుల భవనాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. జీ+2 దాటితే గ్రామ పంచాయతీ అనుమతి చెల్లదు. హెచ్‌ఎండీఏ అనుమతి తప్పనిసరి. కానీ అనుమతి లేకుండానే కట్టి విక్రయిస్తున్నారు. ధర తక్కువని అమ్మేసి సొమ్ములు చేసుకుంటున్నారు. నిబంధనల మేరకు కట్టిన ప్రాజెక్టుల్లో ధర కాస్త ఎక్కువే ఉంటుంది. వీటిలో కొనుగోలు చేసే ఆస్తులకు చట్టపరంగా భద్రత ఉంటుంది.

దూరం పెడితేనే..
ఇప్పటికిప్పుడు ఇల్లు కొనగల్గే స్థోమత లేని వారు ముందుగా స్థలం కొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. మరికొందరు పెట్టుబడి దృష్ట్యా కొంటుంటారు. కారణం ఏదైనా స్థలాల వెంచర్‌ అంటే హెచ్‌ఎండీఏ అనుమతి కచ్చితం. లేదంటే డీటీసీపీ అనుమతైనా ఉండాలి. కానీ ఇప్పటికీ పంచాయితీ లేఅవుట్లలో స్థలాలు విక్రయిస్తున్నారు. జీవో111 పరిధిలో నిషేధంలో ఉన్న ప్రాంతాలను సైతం తక్కువ ధర అని విక్రయిస్తున్నారు. కొంటున్నారు. కాబట్టి ఇప్పటికీ వీటిని అమ్ముతున్నారు. చట్టబద్ధం కాని ప్రాజెక్ట్‌లకు కొనుగోలుదారులు దూరంగా ఉంటే ఆదరణ లేక కొత్తగా అక్రమ లేఅవుట్లు పుట్టుకొచ్చేందుకు అవకాశం తగ్గిపోతుంది.

కొనే ముందు ఒక్కసారి..
స్థలమైనా, ఇల్లైనా కొనుగోలు చేసేముందు ప్రభుత్వం, స్థానిక సంస్థల నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకున్నాకే కొనడం మేలు. చాలా సంస్థలు అనుమతులు లేకుండా మొదలెడుతున్నాయి. తర్వాత అనుమతులు తెచ్చుకుంటున్నాయి. నిర్మాణ సంస్థ పూర్వ చరిత్రను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. గతంలో చేపట్టిన ప్రాజెక్ట్‌లు సకాలంలో పూర్తిచేశారా లేదా.. హామీ ఇచ్చిన వసతులన్నీ ఏర్పాటు చేస్తున్నారా లేదా అని చూడాల్సి ఉంటుంది.

ప్రారంభానికి ముందు..
* నిర్మాణ సంస్థలు ప్రారంభానికి ముందే వినియోగదారుల ముందుకు వస్తుంటారు. వారి ఆధీనంలోకి భూమి రాగానే అమ్మకాలు మొదలెడుతున్నారు.
* నిర్మాణం చేపట్టేది వ్యవసాయ భూమి అయితే గృహ, వాణిజ్య నిర్మాణాల కోసం భూ మార్పిడి అయ్యిందో లేదో నిర్ధారించుకోవాలి. ఆర్డర్‌ కాపీని, మార్పిడి పత్రాన్ని చూపించమని కోరాలి.
* మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం నిర్మించే స్థలం ఏ జోన్‌ పరిధిలో ఉందో కూడా తెలిపే పత్రాలను పరిశీలించాలి.
* కొందరు ప్రభుత్వ భూముల్లో, చెరువు శిఖం, పరివాహక ప్రాంతాల్లో, నాలాపైన నిర్మాణాలు చేపడుతుంటారు. సర్వే నంబర్ల ఆధారంగా అటువంటి ఉల్లంఘనలను తెలుసుకోవచ్చు.
* సాధారణంగా స్థలాన్ని బిల్డర్‌ అభివృద్ధి చేస్తుంటారు కాబట్టి స్థల యజమానితో ఒప్పందం అయ్యిందో లేదో చూడాలి. వారి పేరుమీద టైటీల్‌ డీడ్‌, రిజిస్టర్డ్‌ స్టాంప్‌ పేపర్‌ ఉందో లేదో చూడాలి. అది అసలో నకిలీనో తెలుసుకునేందుకు అవసరమైతే న్యాయవాది సహాయం తీసుకోండి.

నిర్మాణ దశలో..
* కొనుగోళ్లు ఎక్కువగా ఈ దశలోనే జరుగుతుంటాయి. వీరు స్థానిక సంస్థల నుంచి భవన అనుమతి ప్లాన్‌ పొందారో లేదో చూడాలి.
* ఎంత ఎత్తు వరకు నిర్మాణం చేయవచ్చో ఫ్లోర్‌ ప్లాన్‌.. మెట్లు, లిఫ్ట్‌, కామన్‌ ఏరియా వంటివన్నీ కూడా స్పష్టంగా పరిశీలించాలి.
* జలమండలి నుంచి మురుగునీటికి సంబంధించి నిరభ్యంతర ధృవీకరణ పత్రం, ప్రధాన రహదారిలో ఉంటే ట్రాఫిక్‌ పోలీసులు, కాలుష్య నియంత్రణ మండలి, అగ్ని మాపక శాఖ అనుమతులు ఉన్నాయో లేదో చూడాలి. అన్ని అపార్ట్‌మెంట్‌లకు ఇవన్నీ అవసరం లేకపోవచ్చు కానీ కట్టే ఎత్తు, విస్తీర్ణం, ప్రదేశాన్ని బట్టి వేర్వేరు అనుమతులు తప్పనిసరి.
* నిర్మాణం పూర్తయ్యాక స్థానిక సంస్థల నుంచి నిబంధనల మేరకు పూర్తి చేశానని నివాస యోగ్య పత్రం తీసుకోవాలి.


మీరేదైనా ఆస్తి కొంటుంటే..

అన్నివేళల్లో..
* ఎల్లప్పుడూ అసలు పత్రాల కోసం పట్టుబట్టండి.
* టైటిల్‌ డీడ్స్‌, ఆస్తి యాజమాన్య పత్రాలను సంబంధిత ప్రభుత్వ విభాగాలు జారీ చేసిన ధృవీకృత కాపీలతో సరిచూసుకోవాలి.
* కొనే భూమి రిజిస్ట్రేషన్‌ చట్టం 1908 సెక్షన్‌ 22ఎ, ప్రభుత్వం చేసిన ఇతర చట్టాల కింద నిషేధిత ఆస్తుల కిందకు రాదని నిర్ధారించుకోవాలి.

నిర్ధారించుకోండి..
* వాస్తవ యజమాని, ప్రస్తుత విక్రయదారు వరకు లింకు డాక్యుమెంట్లు అన్ని ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి.
* అన్ని లింక్‌ డాక్యుమెంట్లలోనూ ఆస్తి సర్వే నంబరు/ ఆవరణల సంఖ్య, సరిహద్దుల పరంగా ఒకేలా ఉందని నిర్ధారించుకోవాలి.
* ఆస్తిపై హక్కు కల్గిన చట్టబద్ధ వారసులు, ప్రతినిధులందరూ సమ్మతించారా లేదా అనేది నిర్ధారించుకోవాలి.
* ముందుగా కుదుర్చుకున్న విక్రయ ఒప్పందాలు/తాకట్టు/మార్టగేజ్‌ లేదనే విషయాన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం జారీ చేసే ఎంకంబరెన్స్‌ సర్టిఫికేట్‌(ఈసీ) ద్వారా నిర్ధారించుకోవాలి.
* చిరునామా ధ్రువీకరణతో పాటూ కొనుగోలుదారులు, విక్రయదారుల ఫొటోలు, వేలిముద్రలు డాక్యుమెంట్స్‌లో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. సాక్షుల ధృవీకరణ పత్రం, ఐడీ కార్డులను కూడా పొందాలి.

చేయకూడనివి..
* కొనే ఆస్తికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ అయిన అమ్మకపు దస్తావేజు లేకుండా, నోటరీ డాక్యుమెంట్లపై ఆధారపడవద్దు.
* వ్యక్తిగతంగా ఆస్తిని చూడకుండా.. ఆప్రాంతాన్ని పరిశీలించకుండా కొనుగోలు చేయవద్దు.

తనిఖీ చేసుకోండి..
* జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ వంటి పత్రాలను సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద రిజిస్టర్‌ అయ్యాయా, వాటి చెల్లుబాటు ఎలాంటిది వంటి అంశాలను నిర్ధారించుకోవాలి.
* అనుమతి పొందిన ప్లాన్‌ ప్రకారం సైట్‌ ప్లాన్‌, లొకేషన్‌ హద్దులు ఉన్నాయో లేవో ఆ ప్రాంతాన్ని సందర్శించి నిర్ధారించుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని