మొదటి దశలోనే మన రెరా!

దేశంలో స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం(రెరా) అమల్లోకి వచ్చి ఏడాది కావొస్తున్నా మనకు ఇంకా పూర్తి స్థాయిలో...

Published : 28 Apr 2018 01:28 IST

మొదటి దశలోనే మన రెరా!

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం(రెరా) అమల్లోకి వచ్చి ఏడాది కావొస్తున్నా మనకు ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. మన రాష్ట్రంలోని పరిస్థితులకు తగ్గట్టుగా అవసరమైన మార్పులు చేర్పులతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టులో నోటిఫై చేసింది. గత ఏడాది జనవరి 1 నుంచి అనుమతి పొందిన నిర్మాణాలకు రెరా వర్తిస్తుందని పేర్కొంది. రెరా అథారిటీని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడం.. వెబ్‌సైట్‌ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో నిర్మాణదారులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. మార్కెట్‌ జోరు మీదున్న ఈ సమయంలో రెరా జాప్యంతో కొత్త ప్రాజెక్ట్‌ల్లో విక్రయాలపై ప్రభావం పడుతోందని అంటున్నారు. ఇటీవలె రెరా కమిటీలోని అధికారుల బృందం మహారాష్ట్ర వెళ్లి అక్కడ అధ్యయనం చేసి వచ్చింది. జులైలో పొర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. రెరా ఏడాది అయిన సందర్భంగా దేశవ్యాప్త పరిస్థితులను నైట్‌ఫ్రాంక్‌ సంస్థ నివేదికను విడుదల చేసింది.
* జమ్మూ కశ్మీర్‌ మినహా దేశంలోని 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో రెరా అమలు చేయాలి. అమలును నాలుగు దశలుగా చూస్తే వేర్వేరు రాష్ట్రాల్లో పలు దశల్లో ఉన్నాయి.
* రాష్ట్రాలు వారి పరిస్థితులకు అనుగుణంగా మొదటి దశలో 20 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు నిబంధనలను నోటిఫై చేశాయి. పశ్చిమబంగాల్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయా, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర ఇంకా నోటిఫై చేయలేదు.
రెండో దశ.. రియల్‌ ఎస్టేట్‌ అథారిటీని 20 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశాయి.
* మూడో దశ.. పోర్టల్‌ను 14 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశాయి.
నాలుగో దశ.. రియల్‌ ఎస్టేట్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ను 10 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశాయి.
* తెలంగాణ రాష్ట్రంలో మొదట దశ మాత్రమే పూర్తయ్యింది. రెండో దశ పాక్షికంగా చేపట్టారు.
* మహారాష్ట్రలో రెరా పూర్తి స్థాయిలో పని చేయడం మొదలెట్టింది. దేశంలో 25వేల ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదుకాగా.. అందులో 62 శాతం ఒక్క మహారాష్ట్ర నుంచే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రెరా కింద రెండు ప్రాజెక్ట్‌లు రిజస్టర్‌ అయ్యాయి.
* మహారాష్ట్రలోని చాలా తీర్పులు 30 రోజుల వ్యవధిలోనే వెలువరిస్తున్నారు. ఎక్కువ శాతం ఫిర్యాదులు గడువులోపు నిర్మాణాన్ని పూర్తిచేయకపోవడంపై అందుతున్నాయి. కర్ణాటక రెరా సైతం మహారాష్ట్ర బాటలోనే దూకుడుగా వెళుతోంది. గడువులోపే 63 కేసుల్లో తీర్పులు వెలువరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని