రెరాతో ముందడుగు పడింది

నిర్మాణ రంగంలో కొనుగోలుదారులకు భరోసానిచ్చే స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం(రెరా) సెప్టెంబరు నుంచి ...

Published : 01 Sep 2018 01:36 IST

రెరాతో ముందడుగు పడింది
ఈనాడు, హైదరాబాద్‌

నిర్మాణ రంగంలో కొనుగోలుదారులకు భరోసానిచ్చే స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం(రెరా) సెప్టెంబరు నుంచి  అందుబాటులోకి రాబోతుంది. తరచూ వచ్చే సందేహాలకు చట్టం ఆధారంగా రెరా నిపుణులు అశోక్‌కుమార్‌ నివృత్తి చేశారు.
ఈ చట్టం కొనుగోలుదారులకు ఏ విధంగా భరోసా ఇస్తుంది?
నిర్మాణదారులు ఇప్పటి వరకు ఏం చెబితే దానిని విశ్వసించి కొనుగోలు చేసేవారు. చెప్పినవి చేయకపోయినా.. చేసిన వాటిలో లోపాలున్నా న్యాయం కోసం ఇబ్బంది పడేవారు. రెరాలో నమోదుతో ఆయా సంస్థలు ఇచ్చే వివరాలన్నీ సంబంధిత యంత్రాంగం పరిశీలిస్తుంది. కాబట్టి పారదర్శకత ఉంటుంది. రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లను ధైర్యంగా కొనుగోలు చేయవచ్చు. ఏదైనా సమస్య తలెత్తితే సత్వరం న్యాయం పొందేందుకు అవకాశం ఉంది.
నిర్మాణదారుల జవాబుదారీ ఎలా?
వ్యాపారులకు తమ ప్రాజెక్టు ఏమిటో, ఎలా చేయబోతున్నారో చెప్పాల్సి ఉంటుంది.  ఎప్పటికి పూర్తి చేస్తారో తెలపాలి. గడువు మేరకు నిర్మాణాలను పూర్తి చేయాలి. లేదంటే భారీ జరిమానాలు ఉంటాయి.
స్థిరాస్తి వ్యాపారంపై ఏ మేరకు ప్రభావం ?
ఈ చట్టం అమలు కోసం రెండు సంవత్సరాలుగా చాలామంది బిల్డర్లు, కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు, ప్రారంభించిన ప్రాజెక్టు రెరాలో నమోదుతో కొనుగోళ్లకు అవకాశం ఉంటుంది. 2017 జనవరి నుంచి అనుమతులు తీసుకుని ఇప్పటికే ప్రాజెక్టులు మొదలు పెట్టిన వారు సైతం ఇందులో చేరనున్నారు.
ఇంటి ధరలు పెరుగుతాయా?
నాణ్యంగా నిర్మాణం చేపట్టడం, ఐదేళ్ల వరకు లోపాలకు నిర్మాణదారే బాధ్యత వహించడం వంటి నిబంధనలతో 4 శాతం నుంచి 7 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  .
ఫ్లాట్‌ విస్తీర్ణం కచ్చితంగా తెలుసుకోవచ్చా?
ప్రస్తుతం నిర్మాణదారులు ఇంటి లోపల కార్పెట్‌ ఏరియాతో పాటూ కామన్‌ ఏరియాను కలిపి సూపర్‌ బిల్టప్‌ ఏరియా విస్తీర్ణమే చెబుతున్నారు. రెరా చట్టంతో ఇది మారబోతుంది. వెయ్యి చదరపు అడుగుల సూపర్‌ బిల్టప్‌ ఏరియాలో వాస్తవంగా ఇంటి లోపల ఉండే కార్పెట్‌ ఏరియా 800 చ.అడుగులు మాత్రమే. ఇప్పుడు దీన్నే విక్రయించాలి. ఆ ప్రకారం ఇదివరకు చదరపు అడుగు రూ.4000 చొప్పున వెయ్యి గజాలకు రూ.40లక్షలకు విక్రయించేవారు. రెరాతో రూ.5000 చొప్పున 800 చ.అడుగులకు బిల్డర్‌ వసూలు చేస్తారు. అప్పుడూ రూ.40లక్షలే అవుతుంది. అడుగు ధర పెరుగుతుందే తప్ప నికరంగా ధరలో మార్పు ఉండదు. కామన్‌ ఏరియాను అసోసియేషన్‌ పేరిట రిజిస్టర్‌ చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని