Interior Design: పక్కా ప్రణాళిక ఉంటేనే త్వరగా గృహ ప్రవేశం

ఇల్లు నిర్మించి ఇవ్వడం అంటే.. నాలుగు గోడలు.. ఆరు తలుపులులా మారింది. గృహావసరాలన్నీ తీరేలా ఇంటిని తీర్చి దిద్దుకోవాలంటే ఇంటీరియర్‌ కోసం చాలా వ్యయం అవుతోంది.

Published : 25 May 2024 01:11 IST

సొంతంగా ఇంటీరియర్స్‌ చేయించేటప్పుడు వీటిని గమనించండి
ఈనాడు - హైదరాబాద్‌

ల్లు నిర్మించి ఇవ్వడం అంటే.. నాలుగు గోడలు.. ఆరు తలుపులులా మారింది. గృహావసరాలన్నీ తీరేలా ఇంటిని తీర్చి దిద్దుకోవాలంటే ఇంటీరియర్‌ కోసం చాలా వ్యయం అవుతోంది. అసలు దీనికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందనేది అంచనా వేయాలి. లేకపోతే నిధులు సరిపడాలేక గృహప్రవేశం ఆలస్యం కావడం, మరింత అప్పులపాలవడం చాలామంది  అనుభవంలోకి వస్తున్న విషయం. ఇల్లు నిర్మాణ దశలోనే మీకు కావాల్సిన రూపురేఖలు నిర్ణయించుకోవాలి. ఎంత సైజులో వంటగది ఉండాలి.. పూజగది ఎక్కడ ఎలా ఉండాలనేది స్పష్టమైన అవగాహన ఉంటే తర్వాత మనం కోరుకున్న విధంగా ఇంటిని రూపొందించగలం అని ఇంటీరియర్‌ డిజైనర్లు చెబుతున్నారు. 

  • వంటింట్లో డిష్‌వాషర్‌ అవసరమా కాదా అనేది ముందు తెలుసుకుంటే.. ఆ విధంగా వుడ్‌ వర్కు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ముందు ఏమీ ఆలోచించకుండా ఆ తర్వాత డిష్‌వాషర్‌ సమకూర్చుకుంటే.. వంటింట్లో ఉడ్‌ వర్కును తొలగించి ఎత్తు, కొలతల ఆధారంగా తిరిగి చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎంత సమయం, డబ్బులు వృథా అవుతాయో ఆలోచించండి.
  • ఫ్రిజ్‌ ఎంత వైశాల్యంలో ఉంటుందో.. ఎంత స్థలాన్ని ఆక్రమిస్తుందో తెలుసుకుని ఇంట్లో ఉడ్‌ వర్కును చేయించుకోవాలి. ఉడ్‌ వర్కు జరుగుతోంది కదా.. ఇప్పుడే తీసుకువస్తే ఫ్రిజ్‌పైన చెత్త పడుతుందనుకుని తర్వాత తెచ్చామా.. అది మనం పెట్టాలనుకున్న చోట స్థలం సరిపోదు. అలాగే ఫ్రిజ్‌కు కరెంటు సరఫరా చేసే బోర్డు ప్రత్యేకంగా ఉండాలి. ఫ్రిజ్‌ స్విచ్‌ మిగతా వాటితో కలిసి ఉంటే.. లైట్లు ఆర్పినప్పుడు మనకు తెలియకుండానే ఫ్రిజ్‌ స్విచ్‌ను కూడా ఆపేస్తాం. 
  • సోఫాలు, బెడ్లు, డైనింగ్‌ టేబుల్‌ కొలతల విషయంలోనూ స్పష్టమైన అవగాహన ఉండాలి. లేని పక్షంలో అవి పెద్దవి కావడం, లేకపోతే పట్టకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెద్దవైతే ఇంట్లో తిరిగేందుకు చోటే మిగలదు. ఇంటి కొలతల ఆధారంగా, మనం తిరిగేందుకు స్థలాన్ని అంచనా వేసుకుని కొనాల్సి ఉంటుంది. 
  • ఇంట్లో కప్‌ బోర్డులు, వాటికి హ్యాండిల్స్‌ అమర్చినప్పుడు కూడా మనం తరచూ తీసేవి ఏవి.. ఎప్పుడో ఒకప్పుడు తీసి సామాన్లు భద్రపరిచేవి ఏవి అనేది స్పష్టమైన అవగాహన ఉండాలి. లేని పక్షంలో హ్యాండిల్స్‌ ఒత్తిడికి గురై.. కొద్ది రోజులకే ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. క్రమం తప్పక తీసేవాటిని ఖర్చుకు వెనకాడకుండా నాణ్యంగా, ఎక్కువ రోజుల మన్నిక వచ్చేవి ఎంపిక చేసుకోవాలి. 
  • కింది అంతస్తులే కదా అని బెడ్‌రూమ్‌లలో ఫాల్స్‌సీలింగ్‌ చేయరు. ఉన్న స్లాబు ఆధారంగా ఏసీలు పెడితే కరెంటు లైన్లు, నీటి పైపులు అమర్చడానికి కన్నాలు పెట్టి ఉంచుతారు. ఏసీలు బిగించేటప్పుడు వచ్చే తలనొప్పులు చెప్పలేం. డ్రైన్‌ పైపు పైకి ఉంటుంది. ఏసీ ఔట్‌పుట్‌ డ్రైన్‌ కిందకు ఉంటుంది. దీంతో ఆ రంధ్రాలను మూసి కిందకు పెట్టాల్సి ఉంటుంది. ఈ మధ్య కాంక్రీట్‌ గోడలు వస్తుండడంతో మరో దగ్గర రంధ్రాలు చేయడానికి కుదరదు. దీంతో ఫాల్స్‌ సీలింగ్‌ను ఏసీ ఉన్నంత వరకూ కట్‌ చేసి అమర్చాల్సి వస్తోంది. దీంతో బెడ్‌రూమ్‌లోని సీలింగ్‌ రూపం దెబ్బతింటుంది. అందుకే ఇవన్నీ ముందే చూసుకోవాలి.

దే పరిస్థితి వంటింట్లో స్టవ్, చిమ్నీ అమర్చినప్పుడు కూడా వస్తుంది. సరైన కొలతలుంటే ఫర్వాలేదు. లేని పక్షంలో తర్వాత వాటిని తెచ్చి పెడదామనుకుంటే.. కొలతల్లో తేడా వస్తుంది. ఇంటి నిర్మాణ సమయంలోనే అన్ని పనులు పూర్తి చేసుకోవాలి లేని పక్షంలో ప్రతి సేవకు రూ. 100 నుంచి రూ.2 వేల వరకూ ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు గ్యాస్‌ స్టవ్‌ పైపు కోసం అక్కడ ఉన్న బండరాయికి కన్నం ముందే పెట్టుకోవాలి. లేని పక్షంలో గృహప్రవేశ సమయంలో ఇబ్బందికరంగా మారుతుంది. 


గేటెడ్‌ కమ్యూనిటీల్లో అందరూ గృహప్రవేశం చేసిన తర్వాత మన ఇంటి పనులు మొదలు పెట్టినా.. సెకెండ్‌ సేల్‌లో ఫ్లాట్‌ కొన్నా.. ఇంటీరియర్‌ డెకరేషన్‌ పనులు చేస్తే చాలా నిబంధనలు అడ్డుపడి పనులు ఆలస్యానికి కారణమవుతాయి. మధ్యాహ్నం 2 గంటల వరకే పనులు  జరుగుతాయి. అలాగే ఆదివారాలు, మిగతా ముఖ్యమైన సెలవు దినాల్లో పనులకు అనుమతివ్వరు. ఇంట్లో పని జరిగినందుకు చెత్త పారవేయడానికి అని నెలకు అదనంగా నిర్దిష్ట మొత్తాన్ని తీసుకుంటారు. ఈ నిబంధనల వల్ల రెండు నెలల్లో పూర్తవుతుందనుకున్న పనికి 4 నెలలు పడుతుంది. ఆ నాలుగు నెలలకూ నిర్వహణ ఛార్జీలు కింద ప్రతి నెలా అదనంగా చెల్లించాల్సిందే. 


వీటికోసం ముందే ప్రణాళికబద్ధంగా.. 

  • ఎప్పుడైనా బయటకు వెళ్లేటపుడు ఇంట్లోని విద్యుత్తు దీపాలు, ఫ్యాన్లు, ఏసీలు.. ఇలా అన్నీ ఒకేసారి అపేందుకు వీలుగా ఒకే స్విచ్‌ ఉండాలి. అయితే ఇందులో ఫ్రిజ్‌ది కూడా ఉంటే.. కరెంటు సరఫరా ఆగితే అందులో భద్రపరిచినవి పాడయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రీషియన్‌తో ఇందుకు తగ్గ మార్పులు చేయించుకోవడం మేలు. 
  • ఇంట్లో కర్టెన్ల దగ్గర బల్బులు, ట్యూబ్‌లైట్లు లేకుండా చూసుకోవాలి. వేడికి డోర్‌కర్టెన్లు అంటుకునే ప్రమాదం ఉంటుంది. బల్బు వేడెక్కినప్పుడు కూడా కాలిపోయే అవకాశాలున్నాయి. 
  • గ్యాస్‌ సిలిండర్‌ బయట ఉండి.. పైపు లోపలకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. లేని పక్షంలో ఇంట్లోనే సిలిండర్, స్టవ్‌ అన్నీ ఉండడం వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. గేటెడ్‌ కమ్యూనిటీల్లో గ్యాస్‌ నేరుగా వంటింటికి చేరుతుంది. ఆ పైపులో ఆన్‌..ఆఫ్‌ ఉంటుంది. అక్కడ లీకేజీ లేకుండా చూసుకోవాలి. సొంతంగా ఇంటీరియర్స్‌ చేయించుకునేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా ముందే ప్రణాళిక వేసుకోవాలి. అంత శ్రమ పడలేం అంటారా.. ఇంటీరియర్‌ డిజైనర్‌కు అప్పగిస్తే సరిపోతుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని