Hyderabad: మెరుగైన నివాసం.. కొనుగోలుదారుల గమ్యం

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది ప్రథమార్థంలో 21 శాతం పెరిగాయి. రెండో త్రైమాసికం పరంగా 28 శాతం వృద్ధి నమోదైంది.

Published : 06 Jul 2024 02:00 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది ప్రథమార్థంలో 21 శాతం పెరిగాయి. రెండో త్రైమాసికం పరంగా 28 శాతం వృద్ధి నమోదైంది. కార్యాలయాల్లో 71 శాతం పెరుగుదల నమోదైందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తాజాగా విడుదల చేసిన అర్ధవార్షిక నివేదికలో పొందుపర్చింది. ఆర్థిక పరిస్థితులతో పాటూ మౌలిక సదుపాయాల మెరుగుదల, కొనుగోలుదారుల ప్రాధాన్యతలతో మార్కెట్‌లో గణనీయమైన పెరుగుదల కనిపించిందని విశ్లేషించింది.

  • నగరంలో మెరుగైన జీవన పరిస్థితులు ఉండే ప్రాంతాల్లో నివాసమే గమ్యంగా ఉన్న కొనుగోలుదారుల ఆలోచనలే మార్కెట్‌ వృద్ధికి కారణం. 
  • ఇందుకు నిదర్శనమే పశ్చిమ హైదరాబాద్‌లో నగరంలో మొత్తం విక్రయాల్లో 62శాతం ఇక్కడే నమోదవడం. గత కొన్నేళ్లుగా ఇదే పోకడ కొనసాగుతోంది.
  • హైటెక్‌సిటీ, గచ్చిబౌలి చుట్టుపక్కలనే ఐటీ కార్యాలయాలు కేంద్రీకృతమై ఉండటం, మెరుగైన మౌలిక వసతులతో పశ్చిమ హైదరాబాద్‌లో నివాసం కొనుగోలుదారుల ప్రాధాన్యంగా ఉంది.
  • ఉత్తర హైదరాబాద్‌కు కూడా క్రమేణా ఊపు వస్తోంది. ఇక్కడ జనవరి నుంచి జూన్‌ వరకు ఆరునెలల వ్యవధిలో గత ఏడాదితో పోలిస్తే 20 శాతం విక్రయాలు పెరిగాయి. 
  • మౌలిక వసతులు రూపుదిద్దుకుంటుండడం, తక్కువ ఇళ్ల ధరలు, తమ బడ్జెట్‌లో లభిస్తుంటడం, మెరుగైన రవాణాకు చర్యలు చేపట్టడం వంటి కారణాలతో ఉత్తరం వైపు వృద్ధి నమోదైంది. 

రూ కోటిపైనే..

కొనుగోలు చేసిన ఇళ్లలో కోటిరూపాయలు అంతకంటే అధిక ధరలు ఉన్న గృహాల వాటానే 62 శాతం ఉంది. అంతక్రితం ఏడాది ఇది 45 శాతంగా ఉండేది. ఈ ఏడాది మరింతగా వీటి వాటా పెరిగింది. మొత్తం విక్రయాల్లో సగానికి పైగా విలాస నివాసాలే ఉన్నాయి. పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థతో ఈ విభాగంలో లావాదేవీలు పెరగడానికి దోహదం చేసిందని నిపుణులు అంటున్నారు. 

  • కొనుగోలుదారులు విశాలమైన ఇళ్లను, అత్యాధునిక సౌకర్యాలు కోరుకుంటుండంతో మధ్యస్త, సరసమైన గృహాల్లో విక్రయాలు పడిపోయాయి. 
  • 50 లక్షల రూపాయల లోపు విలువైన ఇళ్ల వాటా 2023 ప్రథమార్థంలో 13 శాతం ఉంటే.. 2024లో 9 శాతానికి పడిపోయాయి. 
  • రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల గృహ విభాగంలోనూ ఇదే పరిస్థితి. గత ఏడాది మొదటి ఆరునెలల కాలంలో వీటి వాటా 42 శాతం ఉంటే.. 2024 ప్రథమార్థంలో 29 శాతానికి పడిపోయింది.

కొత్తగా కట్టేవాటిలోనూ..

కొనుగోలుదారుల డిమాండ్‌ను బట్టి బిల్డర్లు ప్రాజెక్ట్‌లను ప్రారంభిస్తున్నారు. 2024 మొదటి ఆరునెలల్లో 22,300 యూనిట్లను ప్రారంభిస్తే... అందులో 67 శాతం వాటా కోటి రూపాయల పైన ఉన్న ఇళ్లే. రూ.50 లక్షల నుంచి కోటి మధ్య యూనిట్ల వాటా 25 శాతంగా ఉంది. రూ.50 లక్షల లోపు ఇళ్ల వాటా 8 శాతం మాత్రమే. 

అక్కడే కడుతున్నారు

వ్యవస్థీకృత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో అత్యధిక నిర్మాణాలు పశ్చిమ హైదరాబాద్‌లో చేపడుతున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలోనూ 63 శాతం ప్రాజెక్ట్‌లు  ఈప్రాంతానికి చెందినవే. 
సగం  ఇళ్లు అవే : మార్కెట్‌లో అమ్మకానికి ఉన్న ఇళ్ల(ఇన్వెంటరీ) సంఖ్య 49,232 ఉంది. గత ఏడాదితో పోలిస్తే 27 శాతం పెరిగాయి. అంటే అమ్మకానికి సమయం ఎక్కువ పడుతోంది. వీటిలో 60 శాతం ఇళ్ల వాటా రూ.50 లక్షల లోపు, రూ.కోటి లోపు ఉన్నవేనట.

ఇవి మాత్రం ఆగడం లేదు

  • ఇళ్ల ధరల పెరుగుదల ఆగడం లేదు. గత ఏడాది మొదటి ఆరునెలలతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్థంలో స్థిరాస్తి ధరలు 5 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. ఇప్పటికీ సిటీ అభివృద్ధిపై విశ్వాసంతో ఇన్వెస్టర్లు స్థిరాస్తులపై పెట్టుబడులు పెడుతున్నారు. 
  • ఇతర నగరాలతో, కొన్ని ద్వితీయ శ్రేణి నగరాలతో పోల్చి చూసినా హైదరాబాద్‌లో తక్కువ జీవన వ్యయం, మంచి విద్యా, వైద్య సదుపాయాలు, ఏడాదిపాటూ అనువైన వాతావరణంతో కుటుంబాలు, వృత్తినిపుణులు ఇక్కడ స్థిర నివాసానికి మొగ్గు చూపుతుండటంతో మార్కెట్‌ వృద్ధికి ఢోకా ఉండదని నిపుణులు విశ్లేషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని