ఒడిదొడుకులు ఎదురైనా.. భవిత బంగారమే

దీర్ఘకాలంలో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ఎలా ఉండబోతుంది? స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టవచ్చా? గతంలో మాదిరే మంచి రాబడులు అందుకోవడం సాధ్యమేనా? అంటే..  ఒడిదుడుకులు ఎదురైనా మరి కొన్నేళ్లపాటూ స్థిరాస్తి రంగం వృద్ధికి ఢోకా లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Updated : 01 Apr 2023 06:59 IST

మౌలిక వసతుల ప్రాజెక్టుల రాకతో రియల్‌ వృద్ధికి దోహదం
ఈనాడు, హైదరాబాద్‌

దీర్ఘకాలంలో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ఎలా ఉండబోతుంది? స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టవచ్చా? గతంలో మాదిరే మంచి రాబడులు అందుకోవడం సాధ్యమేనా? అంటే..  ఒడిదుడుకులు ఎదురైనా మరి కొన్నేళ్లపాటూ స్థిరాస్తి రంగం వృద్ధికి ఢోకా లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం సైతం హైదరాబాద్‌ అభివృద్ధి ప్రయాణం ఇప్పుడే మొదలైందని.. మున్ముందు సిసలైన అభివృద్ధి ఉంటుందని ఆశలు పెంచుతోంది. భారీ ప్రాజెక్టులు చేపట్టే ప్రణాళికలు ఉన్నాయని ప్రకటిస్తోంది. సిటీలో అన్నివైపుల 250కి.మీ. మేర మెట్రో విస్తరణ,  55 కి.మీ. మూసీ ఎక్స్‌ప్రెస్‌ వే, దాదాపు 350 కి.మీ. ప్రాంతీయ వలయ రహదారి, రూ.2400కోట్లతో లింక్‌రోడ్లు పూర్తిచేయడం.. సిటీ నలువైపుల వచ్చేలా యాచారంలో ఫార్మాసిటీ, రాచకొండ గుట్టలో ఫిలింసిటీ, క్రీడా నగరం, విద్యానగరం నిర్మించే ప్రణాళికలు ఉన్నాయని.. వచ్చే ఐదేళ్లలో దశలవారీగా ఇవి పట్టాలెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇవి కాకుండా ప్రైవేటు సంస్థలు పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయని అంటున్నారు. ఈ తరహా మౌలిక వసతుల ప్రాజెక్టుల రాకతో ఉపాధి అవకాశాలు పెరిగి ప్రత్యక్షంగా, పరోక్షంగా రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి దోహదం చేయనుందని రియాల్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

గరంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పెద్దపీట వేయడం ద్వారా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల విలువ పెరగడంతో పాటూ.. మెరుగైన రవాణా కారణంగా శివార్లకు అనుసంధానం పెరిగి అన్నివర్గాలకు సొంతింటి కలను చేరువ చేస్తుందని స్థిరాస్తి కన్సల్టెన్సీల అంచనాలు. గత అనుభవాలు సైతం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. నగరంలో కొత్తగా ఒక ప్రాజెక్టు వస్తుందంటే అందరి దృష్టి అటువైపే ఉంటుంది.  ముఖ్యంగా స్థిరాస్తి రంగం వృద్ధికి ఇవి ఇంధనంగా పనిచేస్తుంటాయి. రియల్‌ వ్యాపారులు వీటిని చూపించి మార్కెటింగ్‌ చేస్తుంటారు. తొలిదశలో స్వల్పకాలంలోనే రియల్టర్లు లాభపడుతుంటారు. ఆ తర్వాత కొనుగోలుదారులకు వాటి పురోగతిని బట్టి రాబడి అందుతుంది.

ఇవి గతానుభవాలు..

నగరంలో రెండు దశాబ్దాల క్రితం భారీ ప్రాజెక్టుల ప్రకటనలు వెలువడ్డాయి. ప్రభుత్వాలు మారినా అవి పట్టాలెక్కాయి. శంషాబాద్‌లో విమానాశ్రయం, సిటీ చుట్టూ బాహ్య వలయ రహదారి, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే,  మెట్రోరైలు నిర్మాణం తదితరాలన్నీ ఐదేళ్ల క్రితం వరకు ఒక్కోటిగా పూర్తయ్యాయి. నగరానికి మణిహారాలుగా పేర్కొనే వీటి చుట్టూనే హైదరాబాద్‌ స్థిరాస్తి వృద్ధి సాగింది. ఈ పేరు చెప్పే ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాలు, విల్లాలు, కార్యాలయ స్థలాల క్రయ విక్రయాలు జరిగాయి. మరో దశాబ్దం వరకు వీటి చుట్టూనే నివాస రంగ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని డెవలపర్లు అంటున్నారు. అయితే ఇక్కడ ధరలు ఇప్పటికే భారీగా పెరిగాయి. అన్ని వర్గాలు అందుకునే స్థితిలో లేవు. గతంలో అవకాశాలను అందుకోలేకపోయిన వారికి కొత్తగా రాబోతున్న భారీ ప్రాజెక్టులు ఆశలు రేకెత్తిస్తున్నాయి. 

భవిష్యత్తు ఆశాజనకం..

* ప్రస్తుతం వేర్వేరు మౌలిక ప్రాజెక్టుల పనులు ప్రకటనల దశ నుంచి టెండర్ల దశ వరకు, కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. భవిష్యత్తులో ఆయా ప్రాంతాల్లో ఆస్తుల విలువ పెరుగుదల గురించి సొంతంగా బేరీజు వేసుకోవచ్చు.

* రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో పనులు టెండర్‌ దశలో ఉన్నాయి. బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌, ఇక్కడి నుంచి విమానాశ్రయం వరకు అనుసంధానం, ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు విస్తరణ ప్రణాళికలు ఉన్నాయి. 250 కి.మీ. మేర మెట్రోను ప్రాధాన్య క్రమంలో విస్తరించనున్నారు. ఆయా ప్రాధాన్యాలను గుర్తించగల్గితే నిర్ణయం తీసుకోవడం సులువు అవుతుంది.

* నగరం చుట్టూ భారీ పరిశ్రమలు వస్తున్నాయి. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ సంస్థ 200 ఎకరాల్లో ప్లాంటును ఏర్పాటు చేస్తుంది. దశలవారీగా 30వేల మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అంటే కొత్తగా ఒక నియోజకవర్గమంత జనాభా చుట్టుపక్కల నివసించే పరిస్థితులు భవిష్యత్తులో రాబోతున్నాయని సర్కారు అంటోంది.

* ఫార్మాసిటీ భూసేకరణ దశలో ఉంది. కొత్త ప్రభుత్వంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ భారీగా ఉపాధి అవకాశాలు ఉండనున్నాయి. సిటీ మధ్య నుంచి తూర్పు పడమర కలిపే మూసీ ఎక్స్‌ప్రెస్‌ వే ప్రతిపాదనల దశలో ఉంది. ఈ తరహాలో మరిన్ని మౌలిక వసతులు, పరిశ్రమలు, పెట్టుబడులు రాబోతున్నాయి. ఎక్కడ వస్తున్నాయో గమనిస్తుంటే... భవిష్యత్తు పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే మౌలిక వసతుల ప్రాజెక్ట్‌లన్నీ స్థిరాస్తిపై ఒకే తరహా ప్రభావం ఉండదని..కొన్నిసార్లు కృత్రిమంగా డిమాండ్‌ సృష్టిస్తుంటారని ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని