Real estate: బెంగళూరుతో మనకు పోటీ

గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) రాకతో కార్యాలయాల భవనాల లీజింగ్‌లో పెరుగుదల నమోదైంది. ఎక్కువ విస్తీర్ణంలో, ఏ గ్రేడ్‌ భవనాల్లోనే జీసీసీ ఏర్పాటుకు మొగ్గు చూపుతుండటంతో రియల్‌ ఎస్టేట్‌ లీజింగ్‌ పరంగా వృద్ధి చోటు చేసుకుంది.

Published : 01 Jun 2024 04:23 IST

కార్యాలయ భవనాల లీజింగ్‌లో పెరుగుతున్న జీసీసీల వాటా 
ఈనాడు,హైదరాబాద్‌ 

గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) రాకతో కార్యాలయాల భవనాల లీజింగ్‌లో పెరుగుదల నమోదైంది. ఎక్కువ విస్తీర్ణంలో, ఏ గ్రేడ్‌ భవనాల్లోనే జీసీసీ ఏర్పాటుకు మొగ్గు చూపుతుండటంతో రియల్‌ ఎస్టేట్‌ లీజింగ్‌ పరంగా వృద్ధి చోటు చేసుకుంది. జీసీసీలు 2023-24 నాటికి దేశవ్యాప్తంగా లీజ్‌కు తీసుకున్న కార్యాలయాల విస్తీర్ణం 22.5 మిలియన్‌ చదరపు అడుగులకు చేరింది. అంతక్రితం ఏడాదిలో 19.2 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. ఏడాదిలో 17 శాతం వృద్ధి నమోదైనట్లు భారతీయ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్‌ఈ ఒక నివేదికలో వెల్లడించింది. 

  • దేశంలోని కార్యాలయ భవనాల లీజింగ్‌లో జనవరి నుంచి మార్చి 24 త్రైమాసికంలో జీసీసీల వాటానే 29 శాతంగా ఉంది. విస్తీర్ణం పరంగా చూస్తే 4.2 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది. కొన్నేళ్లుగా వాటా పెరుగుతున్న తీరు చూస్తే.. 
  • 2017-19 కాలంలో దేశంలో 1250 జీసీసీలు పనిచేస్తున్నాయి. 13 లక్షల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయ భవనాల లీజింగ్‌లో 30-35 శాతం వాటా కల్గి ఉంది. 
  • 2020-22 కాలంలో జీసీసీలు ఏర్పాటు చేసిన కార్యాలయ భవనాల లీజింగ్‌ వాటా 38 నుంచి 43 శాతానికి పెరిగింది. మొత్తం 1580 జీసీసీలలో 16.6 లక్షల మంది పనిచేస్తున్నారు. 
  • 2023-25 నాటికి కార్యాలయ భవనాల లీజింగ్‌లో జీసీసీల వాటా 40 నుంచి 45 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. జీసీసీల సంఖ్య 1900 చేరుకుంటుందని.. అక్కడ పనిచేసే ఉద్యోగులు 20 లక్షలు దాటుతారని అంచనా వేసింది. జీవశాస్త్రాలు, ఆటోమొబైల్, వైమానికరంగం పురోగమిస్తుందని అంచనా వేసింది. 

రెండో స్థానంలో మనం.. 

నైపుణ్యం కల్గిన ఉద్యోగులు పనిచేసేందుకు ఆధునిక సౌకర్యాలు, మెరుగైన పని వాతావరణ పరిస్థితులు ఉండేలా నిర్మిస్తున్న భవనాలకు జీసీసీల నుంచి డిమాండ్‌ ఉంటుంది. ఈ తరహా భవనాలు హైదరాబాద్‌లో పలు నిర్మాణంలో ఉన్నాయి. జీసీసీలను ఆకర్షించడంలో బెంగళూరు ముందు వరసలో ఉంది. పొరుగు నగరంతో భాగ్యనగరం పోటీపడుతోంది. చాలా మెరుగు కావాలని తొలి త్రైమాసికం గణాంకాలు సూచిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బీమా, టెక్నాలజీ, ఇంజినీరింగ్, తయారీ రంగంలోని గ్లోబల్‌ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. నైపుణ్యం కల్గిన మానవ వనరులు, తక్కువ లీజింగ్‌ అద్దెలు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ఈ సంస్థలు భారత్‌లో ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటితోనే కార్యాలయాల భవనాలకు కొంతవరకు డిమాండ్‌ నెలకొంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు