అందంగా.. భిన్నంగా
ఆకాశహర్మ్యాల రూపురేఖలు మారుతున్నాయ్
ఆకట్టుకునే ఎలివేషన్లతో ఐకానిక్ టవర్ల నిర్మాణం
సరికొత్త డిజైన్లపై కసరత్తు చేస్తున్న బిల్డర్లు
ఈనాడు, హైదరాబాద్
హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఏటేటా భవనాల ఎత్తు పెరుగుతూ పోతోంది. 55 అంతస్తుల ఆకాశహర్మ్యాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. ఐటీ కారిడార్‌లోనే కాదు సిటీలోని ఇతర ప్రాంతాల్లోనూ 30 అంతస్తులపైన ఆవాసాలు నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు పూర్తైన రెసిడెన్షియల్ భవనాల ఎలివేషన్లలో పెద్దగా వైవిధ్యం లేదు. ఏ టవర్ చూసినా డబ్బాల మాదిరి కనిపిస్తున్నాయి. ఒక్కో చోట పది నుంచి పదిహేను టవర్లు కట్టినా.. విహంగ వీక్షణంలో చూస్తే అన్నీ డబ్బా తరహాలోనే. కొత్తగా నిర్మిస్తున్న వాటిలోనూ ఎక్కువ శాతం ఇదే పరిస్థితి. ఇప్పుడిప్పుడే కొన్ని సంస్థలు ఆ ప్రాంతానికి, నగరానికి అందం తీసుకొచ్చేలా.. చూపు తిప్పుకోనివ్వని ఎలివేషన్లతో ప్రాజెక్టులను మొదలెట్టాయి. మూడు నాలుగేళ్లలో సరికొత్త భవనాల రూపురేఖలను నగరవాసులు చూడబోతున్నారు.
ఐటీ కారిడార్‌లోని మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, కొండాపూర్, నార్సింగి, మంచిరేవుల, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, నల్లగండ్ల ప్రాంతాలను కొత్తగా చూసిన వారికి వావ్ అనిపిస్తుంది. 20 నుంచి 30 అంతస్తుల్లోని ఐటీ కార్యాలయాల భవనాలు.. ఆ పక్కనే నివాస ఆకాశహర్మ్యాలు చూస్తుంటే ఎక్కడో విదేశాల్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడే ఉంటున్న వారికి, దేశంలోని ఇతర నగరాలను, విదేశాల నుంచి చుట్టి వచ్చినవారికి ఇదేంటి అన్ని భవనాలు డబ్బాల మాదిరి కడుతున్నారే అనే అసంతృప్తి వ్యక్తం అవుతోంది. రాష్ట్ర పట్టణ, పురపాలక మంత్రి కేటీఆర్ కూడా ఇదే అభిప్రాయాన్ని క్రెడాయ్ ప్రాపర్టీ షో సందర్భంలో స్వయంగా బిల్డర్ల ముందే వ్యక్తం చేశారు. కాస్త కళాత్మకంగా.. ఆ ప్రాంతం, నగర అందాన్ని పెంచేదిగా ఉండేలా చూడాలని సూచించారు. కర్ణాటకలోని మంగుళూరు నగరాన్ని, అక్కడి ఆకాశహర్మ్యాల ఎలివేషన్‌ను ఆయన ఉదాహరించారు. దిల్లీ, ఇతర నగరాల్లోనూ అద్భుతమైన ఎలివేషన్లతో కడుతున్నారు.
మన దగ్గర ఎందుకు రాలేదు?
నగరంలో నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులను చూస్తే అంతర్జాతీయంగా పేరున్న అర్కిటెక్ట్‌లు డిజైన్ చేసినవి ఉన్నాయి. అయినా ఎలివేషన్ పరంగా కొత్తదనం లేకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని డెవలపర్లు అంటున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో గృహ విక్రయాలను ధర, వాస్తు ప్రభావితం చేస్తాయి. రెండు పడక గదులు మొదలు ఐదు పడక గదుల వరకు ఏది కట్టినా ప్రతి గది వాస్తు ప్రకారం ఉండాలని కొనుగోలుదారులు చూస్తుంటారు. వాస్తులేని ఫ్లాట్లను విక్రయించడానికి డెవలపర్లు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎలివేషన్ పరంగా భిన్న ఆకృతుల్లో నిర్మిస్తే కొన్ని ఫ్లాట్లను వాస్తు ప్రకారం నిర్మించలేమని.. పైగా ధర కూడా పెరుగుతుందని.. ఈ రెండింటి దృష్ట్యా ఎక్కువ మంది బిల్డర్లు భిన్నమైన ఎలివేషన్ల వైపు వెళ్లడం లేదని ఒక బిల్డర్ ‘ఈనాడు’తో అన్నారు. అద్భుతమైన ఎలివేషన్లతో ఐకానిక్ ప్రాజెక్ట్‌గా నిర్మించాలని తమకూ ఉంటుందని.. ధర పెరుగుతుందని చెప్పారు. గతంలో అత్తాపూర్‌లో ఒక ఆకాశహర్మ్యాన్ని భిన్నమైన ఆకృతిలో నిర్మించారు. ఇలా మన దగ్గర ఒకటి రెండు చోట్ల పదేళ్ల క్రితమే ప్రయోగాలు చేసినా.. ఆ తర్వాత చెప్పుకోతగ్గ ప్రాజెక్టు రాలేదు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయని... కొన్ని సంస్థలు సరికొత్త ఎలివేషన్లతో వస్తున్నాయని చెప్పారు. ఒకసారి భవనం కడితే ఆ ప్రాంతంలో యాభై అరవైఏళ్ల పాటూ నిల్చిపోయే కట్టడం అవుతుంది. పైగా ఆకాశహర్మ్యమైతే.. ఆయా ప్రాంతాల్లో అదే మొదటిది కూడా అవుతోంది. ఇలాంటి ప్రాధాన్యత ఉంది కాబట్టే బిల్డర్లు ఇప్పుడిప్పుడే ఎలివేషన్లపైన కసరత్తు చేస్తున్నారు.
నగరంలో ఆలస్యంగా మొదలు
స్థానిక బిల్డర్లతో పాటూ ఇతర నగరాల నుంచి వచ్చిన బిల్డర్లు ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌లో అబ్బురపరిచే ఎలివేషన్లతో ఆకాశహర్మ్యాల నిర్మాణాలకు ప్రణాళికలు వేస్తున్నారు. కొన్ని ఇప్పటికే ప్రారంభం కాగా... మరికొన్ని కాగితాల దశలోనే ఉన్నాయి. హైటెక్ సిటీ, పుప్పాలగూడ, నార్సింగి, రాయదుర్గంలో వస్తున్నాయి. వీటిలో ఎక్కువగా స్కైవిల్లాలు, విల్లామెంట్‌లను కడుతున్నారు. స్కైడెక్‌ల వంటి వినూత్న డిజైన్లతో వస్తున్నారు. ఇంటి లోపల డిజైన్లే కాదు.. బయటి రూపురేఖలు కూడా ముఖ్యమే అని గ్రహించారు. మున్ముందు వచ్చే కొత్త ప్రాజెక్టుల్లో మరిన్ని సరికొత్త ఎలివేషన్లను నగరవాసులు చూడబోతున్నారు. వీరి కంటే ముందే అనుమతులు లేకుండా విక్రయాలు మొదలెట్టిన సంస్థలు సైతం కళ్లు చెదిరే ఎలివేషన్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ ఉత్తరాఖండ్‌లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో ఫొటోలు
-
Sports News
Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్
-
Movies News
Ajith Kumar: హీరో అజిత్ ఇంట విషాదం
-
Politics News
kotamreddy giridhar reddy: నెల్లూరు టు మంగళగిరి.. కార్లతో గిరిధర్‌రెడ్డి భారీ ర్యాలీ
-
Movies News
Keerthy Suresh: ‘మహానటి’ని అంగీకరించినందుకు ట్రోల్స్ ఎదుర్కొన్నా: కీర్తిసురేశ్
-
Politics News
YSRCP: ఆ అత్యాశే కొంప ముంచిందా?