Real estate Market: మార్కెట్‌పై మబ్బులు కొనసాగుతున్నాయా?

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే విక్రయాలు, కొత్త ప్రాజెక్ట్‌లు పెరిగాయి. ధరల్లోనూ పెరుగుదల కనిపించింది.

Updated : 05 Mar 2024 16:52 IST

ఇళ్ల విక్రయాలు, కొత్త ప్రాజెక్టుల యూనిట్లలో ఆశాజనక వృద్ధి
నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తొలి త్రైమాసిక నివేదికలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్‌

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే విక్రయాలు, కొత్త ప్రాజెక్ట్‌లు పెరిగాయి. ధరల్లోనూ పెరుగుదల కనిపించింది. నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా జనవరి నుంచి మార్చి నెలకు సంబంధించిన నివేదికను శుక్రవారం విడుదల చేసింది.  

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ ఏడాది మొదటి మూడునెలల్లో 8300 ఇళ్ల విక్రయాలు జరిగాయి. క్రితం సంవత్సరం ఇదే సమయంలో 6,993 ఇళ్లు మాత్రమే విక్రయించారు. వృద్ధి 19 శాతంగా ఉంది.

* విక్రయాల కంటే కొత్త ప్రాజెక్టుల్లో ప్రారంభించే యూనిట్లు సాధారణంగా ఎప్పుడూ ఎక్కువే ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 10,986 రెసిడెన్షియల్‌ యూనిట్లు పలు ప్రాజెక్టుల్లో కలిపి ప్రారంభం అయ్యాయి. 2022లో ఇదే కాలంలో 10,256 యూనిట్లు విక్రయించారు. స్వల్పంగా 7 శాతం వృద్ధి కనిపించింది.

5 శాతం ధరల పెరుగుదల

* మార్కెట్‌తో సంబంధం లేకుండా ధరల పెరుగుదల కొనసాగుతోంది. గతేడాది తొలి త్రైమాసికంలో నగరంలో సగటున చదరపు అడుగు ధర రూ.4775 ఉంటే... ఈ ఏడాది మొదటి మూడునెలల కాలంలో సగటు ధర రూ.5వేలకు చేరింది. ఏడాదిలోనే 5 శాతం పెరుగుదలను ఇక్కడ గమనించవచ్చు.

* ఇళ్ల ధరలు పెరిగినా, వడ్డీరేట్లు ఎగబాకినా, నగదు లభ్యత పడిపోయినా డిమాండ్‌ మాత్రం స్థిరంగా కొనసాగుతూనే ఉందని నివేదికలో సదరు సంస్థ విశ్లేషించింది.

వాణిజ్యంలో చూస్తే..

గృహ నిర్మాణమే కాదు వాణిజ్య నిర్మాణాల కార్యకలాపాలు హైదరాబాద్‌లో ఇటీవల బాగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో 6 మిలియన్‌ చదరపు అడుగుల లావాదేవీలు కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌లో జరిగాయి. 9.2 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త నిర్మాణాలు పూర్తయ్యాయి.

ఆర్థిక సంవత్సరంలో చూస్తే..

హైదరాబాద్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 44,577 యూనిట్లు కొత్త ప్రాజెక్టుల్లో ప్రారంభం అయ్యాయి. అంతక్రితం సంవత్సరంలో 36,642 యూనిట్లు మాత్రమే. వృద్ధి 21.65 శాతం. సగటున ఒక్కో త్రైమాసికంలో 11,144 యూనిట్లను ప్రారంభించారు.

* విక్రయాలు చూస్తే 32,353 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం సంవత్సరం 24,402 మాత్రమే విక్రయించారు. ఇక్కడ 32.58 శాతం వృద్ధి కనిపించింది. ఒక్కో త్రైమాసికంలో సగటున 8,088 ఇళ్లను విక్రయించారు.

ఎవరు కొంటున్నారంటే..

ఒకప్పుడు హైదరాబాద్‌ మార్కెట్లో ఇళ్లు కావాల్సిన వారే (ఎండ్‌ యూజర్లు) ఎక్కువగా కొనుగోళ్లు చేసేవారు. ఇప్పుడు వీరితో పాటూ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారని తెలిపింది. రెండింటి మిశ్రమంగా హైదరాబాద్‌ మార్కెట్‌ ఉందని వెల్లడించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని