Real Estate: అవుటర్‌లోపే నివాసాలెన్నో

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఖాళీ స్థలాలు లేకపోవడంతో పాత నివాసాలను కూల్చి అక్కడ కొత్తగా అపార్ట్‌మెంట్లు కడుతున్నారు. ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉండి నిర్మాణాలు చేస్తున్నా చదరపు అడుగు రూ.5వేలకు ఎక్కడా తక్కువ చెప్పడం లేదు.

Published : 15 Jun 2024 01:27 IST

బడ్జెట్‌ ధరల్లో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు 
మహానగరంలో కలిస్తే మున్ముందు డిమాండ్‌ పెరగవచ్చని అంచనా 

మౌలిక వసతులు ఉన్నచోట, ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో సహజంగానే ఇళ్ల ధరలు అధికంగా ఉన్నాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు ఇక్కడ చెబుతున్న ధరలు ఒకింత భారమే. కాస్త శివార్లకు వెళితే అనుకున్న బడ్జెట్‌లోనే కోరుకున్న ఇంటిని కొనుగోలు చేయవచ్చు. సొంతంగా నిర్మించుకోవచ్చు. శివార్లు అంటే ఎంతోదూరం అక్కర్లేదు. అవుటర్‌ లోపలే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందుకు ఇప్పుడే మంచి అవకాశం అని చెబుతున్నాయి మార్కెట్‌ వర్గాలు. మున్ముందు హైదరాబాద్‌ మహా నగరం బాహ్య వలయ రహదారి(అవుటర్‌ రింగ్‌రోడ్డు) వరకు విస్తరించనుంది. అవుటర్‌ లోపల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గ్రేటర్‌లో కలిపే ఆలోచన సర్కారు చేస్తోంది. అదే జరిగితే ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ముందే మేల్కొంటే ధరలు పెరగడానికంటే ముందే ఆయా ప్రాంతాల్లో తమ బడ్జెట్‌లో ఇల్లు, ఫ్లాట్, విల్లా, స్థలం కొనుగోలు చేయవచ్చు. 

ఈనాడు, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ పరిధిలో ఖాళీ స్థలాలు లేకపోవడంతో పాత నివాసాలను కూల్చి అక్కడ కొత్తగా అపార్ట్‌మెంట్లు కడుతున్నారు. ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉండి నిర్మాణాలు చేస్తున్నా చదరపు అడుగు రూ.5వేలకు ఎక్కడా తక్కువ చెప్పడం లేదు. గేటెడ్‌ కమ్యూనిటీలైతే ఆరువేల రూపాయల దాకా వెచ్చించగల్గితే కొనగలుగుతారు. ఉద్యోగ రీత్యా నగరంలో నివాసం కావాలనుకున్న వారు వీటిని కొనుగోలు చేస్తున్నారు. మూసాపేట, బాలానగర్, సైనిక్‌పురి, హస్తినాపురం, బొల్లారం, బాచుపల్లి, అమీన్‌పూర్, సాతంరాయి, కిస్మత్‌పూర్, అప్పకూడలి తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల్లో ఫ్లాట్లు పెద్ద ఎత్తున ఈ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధి లోపలే కాబట్టి మెరుగైన రహదారులు, ప్రజారవాణా, సరిపడా నీటి సరఫరా, సోషల్‌ ఇన్‌ఫ్రా కారణంగా ధరలు ఈ స్థాయిలో ఉన్నాయి. గత నాలుగైదు ఏళ్లలోనే భారీగా పెరిగాయి. కొందామనుకునే లోపే పెరిగాయని ఇప్పటికీ చాలామంది వాపోతుంటారు. మరేం ఫర్వాలేదు.. మరిన్ని అవకాశాలు ఉన్నాయి.

ఎందుకు ఇప్పుడే

జనావాసాలకు ప్రస్తుతం కాస్త దూరంగా ఉండటంతో ధరలు అందుబాటులో ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఇక్కడి దాకా    జనావాసాలు విస్తరిస్తే సహజంగానే ధరలు పెరిగే అవకాశం ఉంటుందని బిల్డర్లు చెబుతున్నారు. 

  • ఎంజీబీఎస్‌ నుంచి అవుటర్‌ రింగ్‌ రోడ్డు 20 నుంచి 25 కి.మీ. దూరం ఉంటుంది. మార్గాలను బట్టి హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఇప్పటికే ఎంజీబీఎస్‌ నుంచి నగరానికి 15 కి.మీ. వరకు విస్తరించింది. మరో ఐదు నుంచి పది కి.మీ. విస్తీర్ణం మాత్రమే ఖాళీగా ఉంది. ఇది కూడా రాబోయే ఐదేళ్లలో నివాసాలతో నిండిపోయే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
  • ఇన్నర్‌ రింగ్‌రోడ్డు వరకు ఉన్న మెట్రోని మున్ముందు అవుటర్‌ దాకా విస్తరణ, ఎంఎంటీఎస్‌ అనుసంధానం వంటి మౌలిక ప్రాజెక్టుల ప్రణాళికలు ఉన్నాయి. ఐదు నుంచి పదేళ్ల వ్యవధిలో ఇవి కార్యారూపం దాల్చే అవకాశం ఉంది. వీటి రాకతో శివార్లలో ఇల్లు ఉన్నా రవాణా పెద్ద సమస్య కాదు. 
  • శివారు పురపాలక సంస్థలు మహానగర పాలక సంస్థలో కలిస్తే మౌలిక వసతులు మరింతగా మెరుగవుతాయి. ఇవన్నీ డిమాండ్‌ పెరగడానికి కారణం అవుతాయి.

జీహెచ్‌ఎంసీ బయట..ఓఆర్‌ఆర్‌ లోపల

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) పరిధి దాటిన తర్వాత మరో ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో అత్యధికం అవుటర్‌ రింగ్‌రోడ్డు  లోపలే ఉన్నాయి.  ఇబ్రహీంపట్నం, మేడ్చల్, దుండిగల్, ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలు మినహా మిగతావన్నీ కొంపల్లి, తూంకుంట, ఫిర్జాదీగూడ, బోడుప్పల్, పోచారం, పెద్ద అంబర్‌పేట,  తుర్కయంజాల్, ఆధిభట్ల, జల్‌పల్లి, శంషాబాద్,  తుక్కుగూడ, నాగారం  మున్సిపాలిటీలు, మణికొండ, నార్సింగి,  బడంగ్‌పేట,  మీర్‌పేట, బండ్లగూడ జాగీర్,  నిజాంపేట  కార్పొరేషన్లు అవుటర్‌ లోపలే ఉన్నాయి. 

  • ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల ఉన్న నార్సింగి, మణికొండ, నిజాంపేట పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పూర్తిగా నివాసాలు వచ్చేశాయి. ఇక్కడ కూడా స్థలాలకు కొరత ఉంది. ప్రధాన నగరంతో ఇక్కడ ఇళ్ల ధరలు పోటీపడుతున్నాయి. చదరపు అడుగు రూ.6వేల దాకా చెబుతున్నారు. ఆకాశ హర్మ్యాల ధరలు మరింత అధికంగా ఉన్నాయి. 
  • నగరంలో దాదాపుగా కలిసిపోయిన పురపాలికల్లో ధరలు అధికంగా ఉన్నాయి కాబట్టి వీటిని మినహాయించి మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బడ్జెట్‌ ఇళ్ల కోసం ప్రయత్నించవచ్చు. 
  • బడ్జెట్‌ నివాసాలు భారీ ఎత్తున ఉత్తర హైదరాబాద్‌లోని పురపాలికల్లో అందుబాటులో ఉన్నాయి. చింతల్‌ నుంచి గండిమైసమ్మ మార్గంలో, కండ్లకోయ, మైసమ్మగూడ మార్గాల్లో పలు ప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని సంస్థలు రూ.45 లక్షల ధరల్లోనే రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం చేపట్టాయి. 
  • పోచారం, బోడుప్పల్, దమ్మాయిగూడ, రాంపల్లిలో బడ్జెట్‌  ధరల్లో ఫ్లాట్లు, విల్లాల నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా పలు కొత్త  ప్రాజెక్టులు ఈ ప్రాంతాల్లో వస్తున్నాయి.  
  • తుర్కయంజాల్, ఆదిభట్ల, బడంగ్‌పేట పురపాలక సంస్థల పరిధిలో అపార్ట్‌మెంట్లలో ఫ్లాటు, వ్యక్తిగత ఇళ్లు పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయి. ఫ్లాట్లు రూ.50 లక్షల లోపే ఉన్నాయి. వ్యక్తిగత ఇళ్లు కోటి రూపాయల లోపే కొనుగోలు చేయవచ్చు. 
  • తక్కుగూడలో భారీ ఎత్తున అపార్ట్‌మెంట్లు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఇక్కడ గృహ నిర్మాణాలు మొదలయ్యాయి. బడ్జెట్‌ ధరల్లో ఉన్నాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని