Home constructions: పొదుపు పాటిస్తే.. ఇల్లు కొనడం సులభం

సొంతింటి కల సాకారం అవ్వాలంటే ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి వర్గాలు పొదుపు మంత్రం పఠించాల్సిందే. ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.

Published : 15 Jun 2024 01:33 IST

ఈనాడు - హైదరాబాద్‌: సొంతింటి కల సాకారం అవ్వాలంటే ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి వర్గాలు పొదుపు మంత్రం పఠించాల్సిందే. ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లు సైతం ఎక్కువే ఉన్నాయి. పొదుపు చేసిన డబ్బులతోనే కొంటామంటే.. అది ఎన్నటికీ నెరవేరని కలగానే మిగిలిపోతుంది. అందుకే కూడబెట్టిన మొత్తానికి ఊతంగా బ్యాంకు రుణం తీసుకుంటే ఇల్లు కొనడం సులభం. ఇంటి ధరలో 20 శాతం మీరు ముందుగా చెల్లిస్తే..  బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. మీ సంపాదనలో 30 శాతం పొదుపు పాటిస్తే ఈ రుణాలు తర్వాత చెల్లించడం సులభం అవుతుంది. 

10 నుంచి 20 శాతం డౌన్‌ పేమెంట్‌

కొన్నిసార్లు 10 శాతం.. మరి కొన్ని సందర్భాలలో 20 శాతం మనం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది కట్టిన తర్వాతే బ్యాంకులు మిగతా మొత్తానికి రుణాలు ఇస్తాయి. డౌన్‌ పేమెంట్‌ ఎంత ఎక్కువ చెల్లిస్తే అంత సులభంగా మిగతా వాయిదాలు చెల్లించవచ్చు. ఉదాహరణకు రూ.50 లక్షలు రుణం తీసుకుంటే.. 20 ఏళ్లకుగాను ప్రతి నెలా రూ.45 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చెల్లించగలమా లేదా అనేది మన పొదుపుపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మరో లెక్క ఉంది. ఈ వాయిదాలో ఇంటి అద్దె  కలిసి రావడం కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం.


ఐదేళ్ల వరకూ ఇబ్బంది తప్పదు

ఇల్లు కొన్నాక గృహప్రవేశం, ఇంటిలో సామాన్లు సమకూర్చుకోవడం ఇలా ఖర్చులు పెరుగుతాయి కనుక 5 ఏళ్ల వరకూ కాస్త ఇబ్బంది పడాల్సి ఉంటుంది. తర్వాత మన ఆదాయం పెరుగుతుంది. అప్పుడు సులభంగా వాయిదాలు చెల్లించే అవకాశం ఉంటుంది. అంతే కాదు.. మనకు ఏదైనా రూపంలో డబ్బులు వస్తే వెంటనే వచ్చిన మొత్తాన్ని రుణ విముక్తికి వినియోగించుకుంటే.. మరింత వాయిదా మొత్తం తగ్గడంతో పాటు.. చెల్లించాల్సిన కాలం సైతం తగ్గుతుంది. ఇదే సమయంలో మరో ఇంటికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. దీనిని అద్దె ఎంత వస్తుందో అంతే మొత్తం రుణ వాయిదాలు చెల్లించేటట్టు ప్రణాళికలు రూపొందించుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా రుణం తీసుకున్నప్పుడు మరి కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. రుణం అధికంగా వస్తుంది. ఇదే సమయంలో ఈఎంఐ భారాన్ని ఇద్దరూ పంచుకుంటారు కాబట్టి భారం తగ్గుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని