Real estate: రియల్‌ ఆస్తులకు రిజిస్ట్రేషన్‌తో చట్టబద్ధత

గ్రేటర్‌తో పాటు శివారు జిల్లాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇల్లు, ఖాళీ స్థలం, అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ వంటి స్థిరాస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ద్వారా వాటికి చట్టబద్ధత ఏర్పడుతుందనే సంగతి అందరికీ తెలిసిందే.

Updated : 01 Jun 2024 08:28 IST

మూసాపేట, న్యూస్‌టుడే

మూసాపేటలోని కూకట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో..

గ్రేటర్‌తో పాటు శివారు జిల్లాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇల్లు, ఖాళీ స్థలం, అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ వంటి స్థిరాస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ద్వారా వాటికి చట్టబద్ధత ఏర్పడుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే రిజిస్ట్రేషన్‌ వ్యవహారాల విషయంలో చాలా మందికి అవగాహన ఉండదు. దీంతో దస్తావేజు లేఖర్లను గుడ్డిగా నమ్మి మోసపోయిన సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఆయా సందర్భాల్లో కొందరు న్యాయపరమైన చిక్కులను సైతం కొనితెచ్చుకుంటుంటారు. అలా కాకుండా రిజిస్ట్రేషన్‌ సమయంలో క్రయవిక్రయదారులు తీసుకోవాల్సిన అంశాలు మీ కోసం.. 

నిబంధనలే శ్రీరామరక్ష 

ఆస్తుల కొనుగోలు విషయంలో ధ్రువపత్రాలను నిర్ధారించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కొనుగోలుదారుడిదే. ఈ అంశంలో రిజిస్ట్రేషన్‌ శాఖకు ఎటువంటి బాధ్యతలు ఉండవు. ఇబ్బందులు ఎదురైనపుడు న్యాయస్థానాలను ఆశ్రయించడం మినహా మరో గత్యంతరం ఉండదు. కాబట్టి కొనుగోలుకు ముందే అవసరమైన ధ్రువపత్రాలను సరిచూసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో క్రయ, విక్రయదారులు పాటించాల్సిన నిబంధనలను తెలంగాణ రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌ www.registration.telangana.gov.in అందుబాటులో ఉంచింది. ఇందులో ప్రాంతాల వారీగా భూములు, ఫ్లాట్లకు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ ధరలు మొదలుకుని సర్టిఫైడ్‌ కాపీ (సీసీ), ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికేట్‌ (ఈసీ), స్లాట్‌ బుకింగ్‌ వంటి రిజిస్ట్రేషన్‌ సేవలకు సంబంధించిన అన్ని అంశాలను అంతర్జాలంలో పొందుపరిచింది. కొనుగోలుదారుడు ఎక్కడైనా ఇల్లు, ఖాళీ స్థలం, అపార్ట్‌మెంట్‌ లేదా గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఫ్లాట్‌కు సంబంధించిన మార్కెట్‌ ధరలు, నిర్మాణ వ్యయం వంటి వివరాలను వెబ్‌సైట్‌లో చూసుకునే వెసులుబాటు కల్పించింది. కొన్ని సేవలకు నిర్ణీత రుసుం చెల్లించి కూడా ధ్రువపత్రాలను అంతర్జాలం ద్వారా నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. నిబంధనలకు అనుగుణంగా అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే కొనుగోలుకు ముందుకు వెళ్తే మంచిదని.. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అవే శ్రీరామరక్షగా నిలుస్తాయని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. 

చెల్లింపు  విధానాలివీ..

ఖాళీ స్థలాలకు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ ధరపై 7.5 శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, 0.1 శాతం మ్యూటేషన్‌ ఛార్జీలను రిజిస్ట్రేషన్‌ శాఖకు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. (అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలకైతే ప్రాంతాల వారీగా చదరపు అడుగుకు ప్రభుత్వం నిర్ణయించిన నిర్మాణ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.) 

ఈ మొత్తాన్ని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘ఈ చలానా’కు లాగిన్‌ అయి డబ్బులు చెల్లించాలి. లేనిపక్షంలో ఏదైనా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలో నగదు చెల్లించి చలానా డబ్బులు కట్టేవీలుంది. బ్యాంకులో రూ. 2 లక్షల లోపు నగదును మాత్రమే అనుమతిస్తారు. పెద్ద మొత్తంలో ఉంటే అంతర్జాలం వేదికగా చెల్లించడం మేలు. ఆ తర్వాత అన్ని వివరాలతో కూడిన డాక్యుమెంట్‌ను తయారు చేసుకున్నాక.. దానికి లింకు డాక్యుమెంట్లను జతచేయాలి. ప్రభుత్వం మంజూరు చేసిన ఆధార్, పాస్‌పోర్టు వంటి క్రయ, విక్రయదారుల ఐడీతో పాటు పాన్‌కార్డులు సైతం అవసరం. అంతేగాకుండా రేఖాంశం, అక్షాంశాలతో కూడిన ఆస్తికి సంబంధించిన ఫోటో (చలానా కట్టిన తేదీది),  కనీసం ఇద్దరు సాక్షులకు తక్కువ కాకుండా పూర్తిస్థాయి డాక్యుమెంట్‌తో రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాలి. సరియైన ధ్రువపత్రాలు లేకపోతే రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించే అధికారం సబ్‌ రిజిస్ట్రార్‌కు ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ సమయంలో డాక్యుమెంట్‌కు జతచేసిన అన్ని ఒరిజినల్‌ ధ్రువపత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. స్లాట్‌ ప్రకారం రిజిస్ట్రేషన్‌ పక్రియ పూర్తయ్యాక రెండు మూడు అధికారిక పనిదినాల్లో డాక్యుమెంట్‌ను తీసుకోవచ్చు. 

జాగ్రత్తలివీ..

  • హెచ్‌ఎండీఏ (హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ) లేదా డీటీసీపీ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌)ల నుంచి అనుమతి పొందిన లేఅవుట్లలో మాత్రమే స్థలాలను కొనుగోలు చేయాలి. ఆయా అనుమతులను ధ్రువీకరించకున్నాకే ముందుకు సాగాలి. 
  • ‘గ్రామ కంఠం’ స్థలాలకు సర్వే నంబర్లు ఉండవు కాబట్టి అక్కడ స్థలాలను కొనుగోలు చేయాల్సి వస్తే రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి స్వయంగా నిర్ధారించాక మాత్రమే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. 
  • కొందరు నిషేధిత సర్వే నంబర్ల జాబితాలో లేఅవుట్‌లు చేసి విక్రయిస్తుంటారు. అలాంటి స్థలాలను కొనుగోలు చేస్తే న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుని ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొనుగోలు చేయాలనుకున్న స్థలం ఏ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధిలోకి వస్తుందో తెలుసుకుని సదరు కార్యాలయంలో నిషేధిత భూముల జాబితాను తీసుకోవచ్చు. 
  • కొన్ని సందర్భాల్లో ఒకే స్థలం ఇద్దరు లేదా ముగ్గురికి కూడా రిజిస్ట్రేషన్లు అయ్యాయనే అంశాలు తెరమీదకొస్తుంటాయి. ఒక్కోసారి కొనుగోలుకు ముందే దాన్ని మరెవరికో విక్రయించి ఉంటారు. క్రయదారుడు ఆ విషయాన్ని దాచిపెట్టి మనల్ని మోసం చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సదరు ఆస్తికి సంబంధించిన ఈసీ చూసి  ధ్రువీకరించుకోవాలి. అందులో సదరు ఆస్తి ఎవరెవరు ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు వంటి వివరాలు ఉంటాయి. రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో పరిశోధన ద్వారా ప్రాథమిక వివరాలు అందుబాటులో ఉంటాయి. లేదా ఆ ఆస్తి వివరాలు ఇస్తే మీ సేవా కేంద్రాల్లోనూ పూర్తిస్థాయి ధ్రువపత్రం పొందొచ్చు. 
  • వ్యక్తిగత ఇల్లు, అపార్ట్‌మెంట్, గేటెడ్‌ కమ్యూనిటీ సముదాయాల్లో ఫ్లాట్‌ కొనుగోలు చేయాలనుకుంటే ‘టీఎస్‌ బీపాస్‌’ నుంచి నిర్మాణ అనుమతులను కలిగి ఉండాలి. అవసరమైన వాటికి బీఆర్‌ఎస్‌ (బిల్డింగ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం), బీపీఎస్‌ (బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం) అనుమతులు పొంది ఉంటే మంచిది. 
  • రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలో సదరు ఆస్తికి సంబంధించి అంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రాలను (లింకు డాక్యుమెంట్‌) విక్రయదారుడి నుంచి పొందాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని