Home Decoration: ఇంటికి వెలుగులు

ఇంటికి ఏ రంగులు బాగుంటాయి అని చాలామంది అడగటం చూశాం. కొన్నేళ్లుగా వీటి గురించి అవగాహన పెరగడంతో ఇంటికి నప్పే రంగులను గృహ యాజమానులు వివేకంతో ఎంపిక చేసుకుంటున్నారు.

Published : 15 Jun 2024 01:46 IST

గృహాలంకరణలో లైటింగ్‌ డిజైన్లే కీలకం

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటికి ఏ రంగులు బాగుంటాయి అని చాలామంది అడగటం చూశాం. కొన్నేళ్లుగా వీటి గురించి అవగాహన పెరగడంతో ఇంటికి నప్పే రంగులను గృహ యాజమానులు వివేకంతో ఎంపిక చేసుకుంటున్నారు. నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. కలల గృహానికి ఏ రంగు దీపాలైతే బాగుంటాయి.. ఏ గదిలో వేటిని ఏర్పాటు చేసుకోవాలని అడుగుతున్నారు. అన్ని ఎల్‌ఈడీ దీపాలే కదా.. చెప్పడానికి ఏముందంటారా? ఇందులోనూ పలు రకాలున్నాయి. వాటి గురించి తెలుసుకుంటే అనువైన వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

గృహాలంకరణలో అత్యంత ముఖ్యమైన వాటిలో దీపాలు ఒకటి. ముచ్చటపడి కట్టుకునే ఇంట్లో, కొనుక్కొన్న విల్లాలో ఇంటీరియర్‌ పనులతోపాటే ఎలక్ట్రికల్‌ పనులూ చేయిస్తుంటారు. ఏ గదిలో ఎన్ని దీపాలు కావాలి.. ఏసీ పిన్‌ సాకెట్‌ ఎక్కడ ఉండాలి.. స్విచ్‌ల సాకెట్‌ ఎక్కడుండాలి.. వంటి విషయాలన్నీ ఎలక్ట్రీషియన్‌తో చర్చిస్తుంటారు. దీపాల దగ్గరకి వచ్చేసరికి ఎక్కువ కాలం మన్నికనిచ్చే ఎల్‌ఈడీ దీపాలు వాడమని చెప్పి వదిలేస్తుంటారు. దీంతో అన్ని గదుల్లో తెలుపు రంగు దీపాలతో నింపేస్తుంటారు. దీపాలన్నీ వేయగానే గదులన్నీ ధగధగా వెలిగిపోతుంటాయి. కానీ ఇవే వెలుగులు కొన్నిసార్లు చికాకు పెడుతుంటాయి. దీపాలన్నీ అర్పేసి చీకట్లో కూర్చుండిపోతుంటారు. ఎందుకంటే మూడ్‌కు తగ్గట్టుగా దీపాల ఎంపిక లేకపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. సరైన లైటింగ్‌తో ఇంట్లోని వాతావరణమే పూర్తిగా మారిపోతుందంటున్నారు. ఇరుకు గదులను సైతం విశాలంగా మార్చేస్తుందట.

గది వాతావరణాన్ని మార్చేలా అలంకరణ

ఇల్లంటే రెండు మూడు గదులు, నాలుగైదు గోడలు కాదు. ప్రతి గదికి ఒక ప్రత్యేకత ఉంటుంది. విభిన్న విధులను అవి తీరుస్తుంటాయి. ఇటీవల చాలామంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. హోమ్‌ ఆఫీస్‌ కోసం ప్రకాశవంతమైన టాస్క్‌ లైటింగ్‌ అవసరం. ఇలా ఇంట్లో గదులు, వాటి విభిన్న విధులనుబట్టి లైటింగ్‌ అలంకరణ ఉంటే గృహమే కదా స్వర్గసీమ అంటారు.

మరిన్ని విధాలుగా 

ఇటీవల కాలంలో అలంకరణలో వచ్చిన మార్పులతో మరిన్ని రకాల లైటింగ్‌లు దర్శనమిస్తున్నాయి. ట్రాక్‌ లైటింగ్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌లో బాగా ఉపయోగిస్తున్నారు. 

  • భోజన గది, కిచెన్‌ ఐలాండ్‌ ప్రదేశాల్లో పెండెంట్‌ లైట్స్‌తో అలంకరిస్తున్నారు. వీటితో గది వాతావరణమే పూర్తిగా మారిపోతుంది. 

ఎంపికలో జాగ్రత్తగా 

ఏ తరహా లైటింగ్‌ కావాలో నిర్ణయించుకున్నాక అందుకు తగ్గ దీపాలను ఎంపిక చేసుకోవాలి. ఇందులో సాఫ్ట్, వామ్, డే లైట్‌ రకాలున్నాయి. గదులనుబట్టి, అవసరాలనుబట్టి వీటిని ఏర్పాటు చేసుకోవాలి. ఇంటీరియర్‌ డిజైనర్‌ను సంప్రదించినా మీ ఇంటికి కావాల్సిన లైటింగ్‌ను డిజైన్‌ చేసి ఇస్తారు.

యాంబియంట్‌ లైటింగ్‌

లివింగ్‌లో యాంబియంట్‌ లైట్‌ బాగుంటుంది. గది అంతట సమానంగా ప్రసరించే లైటింగ్‌ ఇది. కిటికీల్లోంచి ప్రసరించే సహజ వెలుతురు కావొచ్చు, లేదంటే పైకప్పునకు అమర్చిన దీపాల వెలుగులు కావొచ్చు. 

  • ప్రతి గది మధ్యలో కాంతిని మరింత ప్రభావవంతంగా వ్యాప్తి చేయడానికి పైకప్పునకు దగ్గరగా వీటిని ఏర్పాటు చేస్తుంటారు. 

డెకరేటివ్‌ లైటింగ్‌

ద్వార బంధాలు, భోజన గది టేబుల్, లివింగ్‌ రూం, పడకగదిలోని మంచానికి ఇరువైపులా గోడలకు ఏర్పాటు చేసుకుంటుంటారు. తక్కువ కాంతిని వెదజల్లుతాయి. 

  • పండగల సమయంలో ఇళ్లను అలంకరించుకునేందుకు ఉపయోగిస్తుంటారు. 

యాక్సెంట్‌ లైటింగ్‌

ఇంట్లోని కళాకృతులు, మొక్కలు, ఫొటోఫ్రేమ్స్‌.. ఇలా నిర్దుష్టమైన వాటిపై ప్రత్యేకంగా దృష్టి పడేలా చేస్తుంది. గదికి మంచి డ్రామాని జోడించడంలో దోహదం చేస్తుంది. 

టాస్క్‌ లైటింగ్‌

ఇంట్లో చదువుకునే ప్రదేశంలో, పడకగదిలో రీడింగ్‌ ల్యాంప్, వంట గదుల్లో స్టవ్‌పై, కిచెన్‌ కప్‌బోర్డ్‌ లోపల.. ఇలా నిర్దిష్ట కార్యకలాపాల కోసం టాస్క్‌ లైటింగ్‌ను ఉపయోగిస్తుంటారు. తమకు కావాల్సిన విధంగా లైటింగ్‌ను మలుపుకోవచ్చు.

  • సాధారణంగా యాంబియంట్‌ లైటింగ్‌ కంటే ఇది ప్రకాశవంతంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని