షాద్‌నగర్‌ వైపు షాన్‌దార్‌గా..

చేరువలో అంతర్జాతీయ విమానాశ్రయం.. హైదరాబాద్‌ నుంచి క్రమంగా సిటీ విస్తరణ.. జాతీయ రహదారి, రైల్వే మార్గంతో రాజధాని  నగరానికి మెరుగైన రవాణా సదుపాయం.

Published : 25 May 2024 01:11 IST

న్యూస్‌టుడే, షాద్‌నగర్‌

చేరువలో అంతర్జాతీయ విమానాశ్రయం.. హైదరాబాద్‌ నుంచి క్రమంగా సిటీ విస్తరణ.. జాతీయ రహదారి, రైల్వే మార్గంతో రాజధాని  నగరానికి మెరుగైన రవాణా సదుపాయం.. భవిష్యత్తులో మెట్రో విస్తరణ ప్రతిపాదనలు.. ప్రాంతీయ వలయ రహదారితో మెరుగవనున్న అనుసంధానం, ఉపాధి అవకాశాలు.. మున్ముందు శాటిలైట్‌ టౌన్‌షిప్‌గా అభివృద్ధికి అన్ని అవకాశాలు ఉన్న పట్టణంగా షాద్‌నగర్‌ చుట్టుపక్కల ప్రాంతాలు రియల్‌ ఎస్టేట్‌కు ఆకర్షణీయంగా మారాయి. 

హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై రాజధానికి ముఖద్వారంగా ఉన్న షాద్‌నగర్‌ ప్రాంతం వ్యాపార, పారిశ్రామిక రంగాలలో వేగంగా అభివృద్ధి చెందింది. స్థిరాస్థి వ్యాపారం కూడా గత రెండు దశాబ్దాల కాలంలో బాగా విస్తరించింది. ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ స్థిరాస్థి వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భూములు, ఫామ్‌ల్యాండ్స్, స్థలాలు, విల్లాల వెంచర్లు వేశారు. భవిష్యత్తు అవసరాల కోసం కొనుగోలుదారులు వీటిలో పెట్టుబడి పెడుతున్నారు.  

ధరలు ఇలా

షాద్‌నగర్‌ పరిధిలో ప్లాట్లు తీసుకుంటే శివారు ప్రాంతాల్లో రూ.15 వేలకు గజంతో మొదలు పెట్టి రూ.40 వేల వరకు ఉన్నాయి. పట్టణంలో అయితే రూ.50వేల పైమాటే. పరిగి రోడ్డులో 200 గజాల స్థలంలో నిర్మించిన విల్లాని రూ.80లక్షల వరకు విక్రయిస్తున్నారు. విలాసవంతమైన విల్లాలు రూ.కోటి నుంచి రూ.కోటిన్నర వరకు ధర చెపుతున్నారు. అపార్ట్‌మెంట్లలో రూ.40-60లక్షల వరకు రెండు పడకల ఇళ్లను విక్రయిస్తున్నారు. 140 నుంచి 160 గజాలలో నిర్మాణమవుతున్న రెండు పడక గదుల ఇళ్లకు సంబంధించి రూ.60-70లక్షల ధర పలుకుతోంది. పురపాలిక పరిధిలో సాయిబాబా కాలనీ, ప్రశాంత్‌నగర్‌ కాలనీ, మల్లికార్జున కాలనీ, చటాన్‌పల్లి, సోలీపూర్, గ్రీన్‌హిల్స్‌కాలనీ వంటి చోట్ల ప్లాట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. షాద్‌నగర్‌ చుట్టూరా సుమారు 15 కాలనీలు విస్తరిస్తున్నాయి. ఆయా చోట్ల గజం రూ.13-20 వేల మధ్యన చొప్పున స్థలాల విక్రయాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి.

  • ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఫామ్‌ ల్యాండ్లు విక్రయిస్తున్నారు. చ.గ. రూ.4-8 వేల వరకు ధరల్లో అందుబాటులో ఉన్నాయి. జాతీయ రహదారికి ఎంతదూరంలో ప్రాజెక్ట్‌ ఉంది అనేదాన్ని బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఎకరాల్లోనూ విక్రయిస్తున్న ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. 
  • స్థిరాస్తి వ్యాపారులతో పాటూ భవిష్యత్తు దృష్ట్యా ఈ ప్రాంతం చుట్టుపక్కల వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. షాద్‌నగర్‌ నుంచి బాలానగర్, జడ్చర్ల వరకు భవిష్యత్తు పెట్టుబడి మార్గంగా చూస్తున్నారు. 

ప్రగతి ప్రస్థానం

2004 నుంచి స్థిరాస్థి వ్యాపారాలు పుంజుకున్నాయి. పట్టణానికి కేవలం 30కి.మీ దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కావడంతో షాద్‌నగర్‌ దశ తిరిగింది. షాద్‌నగర్‌-కొత్తూరు మధ్యన వందల సంఖ్యలో పరిశ్రమలు ఉండడం, 44వ నంబరు జాతీయరహదారి ఉండడం, వ్యాపారపరంగా అభివృద్ధి సాధించడంతో చాలామంది స్థిరాస్థి వ్యాపారులు ఇక్కడ వెంచర్లు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. షాద్‌నగర్, కొత్తూరు పురపాలికలతో పాటు, నందిగామ, ఫరూక్‌నగర్, కొందుర్గు, కేశంపేట మండలాల్లో కూడా ఈ వ్యాపారాలు జోరందుకుంటున్నాయి. కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఇళ్ల నిర్మాణాలు, విల్లాలు, వెంచర్లు, అపార్ట్‌మెంట్‌లు ఇక్కడ ఏర్పాటు అవుతున్నాయి. బైపాస్‌ మార్గం ఉన్న హైదరాబాదు రోడ్డుతో పాటు, మహబూబ్‌నగర్, పరిగి రహదారుల ప్రాంతాల వైపు ఈ వ్యాపారాలు జోరుగా విస్తరిస్తున్నాయి. పెద్దపెద్ద స్థిరాస్థి వ్యాపారాల సంస్థలు ఇక్కడ వందల ఎకరాల్లో వెంచర్లను ఏర్పాటు చేయడం, విల్లాలు నిర్మించడంతో ఈ ప్రాంతంపై ఆసక్తి పెరుగుతోంది. అపార్ట్‌మెంట్ల సంస్కృతి పెరిగింది. గేటెడ్‌ కమ్యూనిటీలు రాబోతున్నాయి.


అనుకూలత ఇలా

షాద్‌నగర్‌ నుంచి అటు రాజధాని హైదరాబాద్‌కు గంట వ్యవధిలో చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి బస్సు సదుపాయంతో పాటు, రైలు సదుపాయం కూడా ఉంది. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం అతి దగ్గరలో ఉంది. షాద్‌నగర్‌ పురపాలికనే తీసుకుంటే ఇక్కడ పెద్దపెద్ద షాపింగ్‌మాల్స్‌  ఉన్నాయి.  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు, ఇంజినీరింగ్, బీఈడీ, పార్మసీ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. విద్యాకేంద్రంగా ఉంది. దీనికి తోడు మెట్రో ఏర్పాటు కూడా షాద్‌నగర్‌ వరకు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. కొత్తూరు మండలంలో సింబయాసిస్‌ యూనివర్సిటీ సైతం ఉంది. వివిధ ప్రాంతాలకు ఉద్యోగాలకు వెళ్లేవారు ఇక్కడే నివాసం ఉంటూ రోజుకు వేల సంఖ్యలో బస్సులు, రైళ్లు, కార్లలో వెళుతుంటారు. 


రిజిస్ట్రేషన్ల తీరిదీ

షాద్‌నగర్‌ పరిధిలో ప్రస్తుతం రోజుకు 40 నుంచి 50 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని సబ్‌ రిజిస్ట్రార్‌ సాధక్‌అలీ వివరించారు. ఈ కార్యాలయం ఆదాయం ఆయా ఆస్తుల విలువను బట్టి ఉంటుందని, ప్రస్తుతం రోజుకు రూ.5-10 లక్షల వరకు వస్తోందని వివరించారు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని