Hyderabad metro: మెట్రో రైలుందిగా.. దూరమైనా కొనేద్దాం!

ఐటీ కారిడార్‌లో ఇళ్ల ధరలు ఖరీదయ్యాయి. రూ.కోటి నుంచి రూ.కోటిన్నర లోపు ఇళ్లు దొరకడం గగనమైంది.

Updated : 10 Dec 2022 09:10 IST

ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో కారిడార్‌ వెంట రియల్‌కు ఊతం

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ కారిడార్‌లో ఇళ్ల ధరలు ఖరీదయ్యాయి. రూ.కోటి నుంచి రూ.కోటిన్నర లోపు ఇళ్లు దొరకడం గగనమైంది. దూరంగా శివార్లలో కొనుగోలు చేద్దామంటే ఇన్నాళ్లు రవాణా సమస్యలతో వెనుకంజవేసేవారు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో పనుల శంకుస్థాపనతో దూరంగానైనా బడ్జెట్‌లో ఇళ్లు కొనే అవకాశం సుగమం కానుంది. స్థిరాస్తి పరంగా పశ్చిమ, తూర్పు, ఉత్తర ప్రాంతాలతో ఇకపై దక్షిణ ప్రాంతం సైతం పోటీపడనుంది.

ఐటీ కారిడార్‌లో మాదాపూర్‌, గచ్చిబౌలి, కాజాగూడ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేటలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు వస్తున్నాయి. 30 నుంచి 45 అంతస్తుల నిర్మాణాలు కడుతున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలో రూ.కోటి లోపల రెండు పడకల గది ఇల్లు అసాధ్యంగా మారింది. ఐటీ ఉన్నతోద్యోగులు, భార్యాభర్తలు ఐటీ ఉద్యోగం చేస్తున్నవారు, ఇతర ప్రాంతాల వాళ్లు ఎక్కువగా ఇక్కడ కొంటున్నారు. సిటీలో ఉన్న స్థిరాస్తులను విక్రయించి కొంటున్నవారూ ఉన్నారు. మిగతా వర్గాలకు ఇక్కడ ఇల్లు అందని ద్రాక్షగా మారింది. సమీప ప్రాంతాల్లోకి గృహ నిర్మాణం విస్తరించింది. దక్షిణం వైపు అప్పా కూడలి, కిస్మత్‌పూర్‌, రాజేంద్రనగర్‌ వరకు నివాసాలు వచ్చాయి. ఐటీ కారిడార్‌కు 10-12 కి.మీ. దూరం కావడంతో ఇళ్ల విక్రయాలు ఇక్కడ మెరుగ్గా ఉన్నాయి.

శంషాబాద్‌ నుంచి ఆదిభట్ల వరకు.. నగరంలో కొనలేనివారు శివార్ల వైపు చూస్తున్నారు. శంషాబాద్‌, తుక్కుగూడ, ఆదిభట్ల వరకు అపార్ట్‌మెంట్ల నిర్మాణం మొదలైంది. ఇక్కడ చదరపు అడుగు రూ.3200 నుంచి రూ.4 వేల ధరల శ్రేణిలో లభిస్తున్నాయి. రూ.40 లక్షల లోపు రెండు పడక గదుల ఫ్లాట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నగరానికి రావాలంటే వీరికి రవాణా పెద్ద సమస్యగా ఉంది. అందుకే ఎక్కువ మంది వారాంతంలో వెళ్లి వస్తున్నారు. ఇక్కడ మరింత మంది ఫ్లాట్లు, విల్లాలు కొనేందుకు మెట్రో రాక దోహదం చేస్తుంది. ఇప్పుడు నిర్మాణంలో ఉన్నవాటిని కొనుగోలు చేస్తే మెట్రోతోపాటు ఇల్లు అందుబాటులోకి వస్తుంది. తక్కువ ధరలోనూ లభిస్తుంది. మెట్రో విస్తరణతో శంషాబాద్‌, విమానాశ్రయం నుంచి అన్నివైపుల 10-15 కి.మీ. పరిధిలో రియల్‌ ఊపందుకునే అవకాశం ఉంది.

అవుటర్‌ నుంచి రీజినల్‌.. నగరం ఓఆర్‌ఆర్‌ నుంచి ప్రాంతీయ వలయ రహదారి వరకు విస్తరిస్తోంది. పెద్ద ఎత్తున ఫామ్‌ల్యాండ్లు, విల్లాలు వస్తున్నాయి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు ఏర్పాటవుతున్నాయి. నగరం నుంచి నిత్యం ఇక్కడిదాకా వచ్చి పనిచేస్తున్న ఉద్యోగులు ఉంటున్నారు. కళాశాల విద్యార్థులు సరేసరి. విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణతో ప్రాంతీయ వలయ రహదారి దగ్గరకానుంది. ఈ ప్రాంతాల అభివృద్ధితో నగరంపై భారం తగ్గనుంది. 

మెట్రో మొదటి దశ అనుభవాలు.. మియాపూర్‌, ఎల్బీనగర్‌, నాగోల్‌ ప్రాంతాలకు మెట్రో రావడంతో అక్కడ రూపురేఖలు మారిపోయాయి. ఆయా స్టేషన్ల నుంచి 20 కి.మీ. దూరం వరకు ఆవాసాలు విస్తరించాయి. పలువురు ఆయా ప్రాంతాలకు వెళ్లి సొంతింటి కలను నిజం చేసుకున్నారు.


వడ్డీ రేట్లు పెరుగుతున్నా..

ఈనాడు, హైదరాబాద్‌: గృహ రుణ వడ్డీ రేట్లు 9 శాతానికి పెరిగినా.. మరింత పెరుగుతాయనే అంచనాలున్నా.. సొంతింటి కల నెరవేర్చుకోవడంలో నగరవాసులు ఒకింత ధైర్యం చేస్తున్నారు. బడ్జెట్‌ ఇళ్లపై వడ్డీరేట్ల ప్రభావం ప్రతికూలంగా ఉన్నా.. మిగతా వర్గాలు ముందుకొస్తుండటంతో విక్రయాలు ఆశాజనకంగా ఉన్నాయి. గతేడాదితో పోల్చితే తగ్గాయని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా వెల్లడించింది.

ఆ ఇళ్లకే పట్టం.. నగరంలో గతంలో చిన్న ఇళ్లకు గిరాకీ ఉండేది. 500 చదరపు అడుగుల ఇళ్లు గతేడాది నవంబరులో 2 శాతం కొనుగోళ్లుంటే.. ఈ ఏడాది 3 శాతానికి పెరిగాయి. 500 నుంచి వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉన్న ఇళ్ల కొనుగోళ్లు గతంలో 15 శాతం ఉంటే.. ఈ ఏడాది 22 శాతం పెరిగాయి. వెయ్యి నుంచి 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఇళ్లు గతేడాది 74 శాతం ఉంటే.. ఈ ఏడాది 65 శాతానికి తగ్గాయి. 2-3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను సొంతం చేసుకునేవారు గతేడాది నవంబరులో 7 శాతం ఉంటే ఈ ఏడాది 9 శాతానికి పెరిగారు. 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు కొనేవారు గతేడాది మాదిరే 2 శాతం మందే ఉన్నారు.

మేడ్చల్‌ జిల్లాలో జోరు.. స్థిరాస్తి వ్యాపారంలో రంగారెడ్డి జిల్లా ఎప్పుడూ ప్రథమ స్థానంలో ఉండేది. ఇప్పుడు మేడ్చల్‌ జిల్లా ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇళ్ల రిజిస్ట్రేషన్లు మేడ్చల్‌లో 41 శాతం ఉంటే.. రంగారెడ్డిలో 39 శాతం ఉన్నాయి. హైదరాబాద్‌ వాటా 14 శాతంగా ఉంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని