Second Home: నివాసానికి ఒకటి.. అద్దెకిచ్చేందుకు మరొకటి!

ఉండటానికి సొంతిల్లు ఉంది.. తర్వాత ఏంటి? స్థిరమైన అద్దె ఆదాయం కోసం మరో ఇల్లు కొనాలి.. ఇదే ఇప్పుడు కొందరి ఆలోచన. బెంగళూరు నగరంలో ఈ ధోరణి ఎక్కువగా ఉండేది.

Updated : 01 Apr 2023 07:00 IST

హైదరాబాద్‌ మార్కెట్లో రెండో ఇల్లు కొనేందుకు ఆసక్తి
ఈనాడు, హైదరాబాద్‌

ఉండటానికి సొంతిల్లు ఉంది.. తర్వాత ఏంటి? స్థిరమైన అద్దె ఆదాయం కోసం మరో ఇల్లు కొనాలి.. ఇదే ఇప్పుడు కొందరి ఆలోచన. బెంగళూరు నగరంలో ఈ ధోరణి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ ఇది బాగా విస్తరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వాణిజ్య భవనాల స్థాయిలో గృహ అద్దెలు వస్తుండటంతో రెండో ఇల్లు వైపు చాలామంది మొగ్గుచూపుతున్నారు. వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. నగరంలో వివిధ కారణాలతో కొద్దినెలలుగా రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ నెమ్మదించింది. గృహ రుణ వడ్డీరేట్లు పెరగడం, మార్కెట్లో నగదు లభ్యత లేకపోవడం, ప్రవాస భారతీయుల పెట్టుబడులు తగ్గడం, ఎన్నికల సంవత్సరం, మార్కెట్లో సరఫరా పెరగడం వంటి కారణాలతో స్తబ్దుగా ఉంది. ఇలాంటి దశలోనూ అద్దె ఆవాసాలకు డిమాండ్‌ కొనసాగుతూనే ఉందని ఈ రంగంలోని సంస్థలు చెబుతున్నాయి.

ఐటీ కారిడార్‌లోనే..

పెట్టుబడి దృష్ట్యా, అద్దెకు ఇచ్చేందుకు దేనికైనా మొదట ఐటీ కారిడార్‌ వైపే ఆసక్తి చూస్తున్నారు. సిటీలో ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారు సైతం తమ స్థిర నివాసాలను పిల్లల కోసం, ఆధునిక జీవనశైలి కోసం గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాలకు మారిపోతున్నారు. ఇక్కడ ఇళ్ల ధరలను బట్టే అద్దెలు వసూలు చేస్తున్నారు. మాదాపూర్‌లో రెండు పడక గదుల ఇంటి అద్దె సగటు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంది. కమ్యూనిటీ, అక్కడి సౌకర్యాలను బట్టి రూ.2లక్షల వరకు కూడా అద్దెలు ఉన్నాయని ఒక బిల్డర్‌ తెలిపారు. ఇతర ప్రాంతాల్లో సగటు రూ.15 వేల నుంచి రూ.20 వేల మధ్యన ఉన్నాయి.

పెట్టుబడిగా..

సొంతిల్లు ఉంటే పెట్టుబడి దృష్ట్యా ఇదివరకు స్థలాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. గేటెడ్‌ కమ్యూనిటీల్లో అపార్ట్‌మెంట్లు, విల్లాల సంస్కృతి మొదలయ్యాక.. వీటిలో అద్దెలు బాగా వస్తుండటంతో స్థలానికి ప్రత్యామ్నాయంగా రెండో ఇల్లునే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆదాయ పన్ను ప్రయోజనాలు సైతం ఉండటంతో పన్ను భారం తగ్గించుకునేందుకు కొనేవారు ఉన్నారు. నెలనెలా ఆదాయం కోసం కూడా వీటిలో పెట్టుబడులు పెడుతున్నారు.

మిగతా  నగరాల్లో..

దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో చూస్తే అద్దెల రాబడి తక్కువలో తక్కువ 2.35 శాతం నుంచి గరిష్ఠంగా 4.03 శాతం వరకు ఉంటోంది. ఇల్లు కొనేందుకు పెట్టుబడి పెట్టిన మొత్తం, వార్షికంగా వచ్చిన అద్దెను పరిగణనలోకి తీసుకుని రాబడి లెక్కిస్తున్నారు. దీనికి అదనంగా ఇంటి విలువ పెరగడం కలిసొచ్చే అంశం.

వ్యక్తిగత ఇళ్లల్లో ఎప్పటి నుంచో..

అద్దె రాబడి కోసం వ్యక్తిగత ఇళ్లల్లో ప్రత్యేకంగా పోర్షన్లు నిర్మించడం సిటీలో ఎప్పటినుంచో ఉన్నదే. ఇందుకోసం జీ+2, 3, 4 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఒక అంతస్తులో పూర్తిగా యజమానులు ఉంటూ.. మిగతా అంతస్తుల్లో ఒక పడక, రెండు పడక గదులను అద్దెకిస్తూ ఆదాయం పొందుతున్నారు. అద్దెల మీద వచ్చే సొమ్ముతోనే జీవనం సాగిస్తున్న వారు సిటీలో ఎందరో ఉన్నారు. అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్లను అద్దె రాబడి కోసం ఇటీవల ఎక్కువ మంది కొంటున్నారు.


అద్దె రాబడి 3.2 శాతంగా ఉంది..

హైదరాబాద్‌లో ప్రస్తుతం అద్దె రాబడి 3.2 శాతంగా ఉంది. అద్దెల్లో ఏటా పెరుగుదల తప్ప తగ్గడం ఉండదు. కొవిడ్‌ వంటి ప్రత్యేక పరిస్థితులు ఇందుకు మినహాయింపు. కొవిడ్‌ తర్వాత కూడా హైదరాబాద్‌లో అద్దెలు 30 శాతం పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌ స్తబ్దుగా ఉన్నా.. మున్ముందు రియల్‌ఎస్టేట్‌ బూమ్‌ను చూడబోతున్నాం. అందుకు హైదరాబాద్‌లో అన్ని అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటి దృష్ట్యా అద్దె ఇళ్లకు డిమాండ్‌ భారీగా ఉంటోంది. హైదరాబాద్‌లో ఉంటున్న చాలామంది నివాసితులు ఇప్పుడు అద్దెకు ఇచ్చేందుకు రెండో ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. ఇది ఇంటి యజమానులకే కాదు, అద్దెదారులకూ ప్రయోజనం చేకూరుస్తుంది. అద్దె ఇళ్ల లభ్యత పెరుగుతుంది.

అమరేంద్ర సాహా, సీఈవో, నెస్ట్‌అవే


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని