రాయితీలతో ‘రియల్‌’కు ఊపిరి

పండగల రాయితీలు.. ప్రాజెక్ట్‌ ప్రారంభం సందర్భంలో తగ్గింపులు.. ఆర్థిక సంవత్సరం ముగింపులో నజరానాలు.. ఇలా స్థిరాస్తి కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ఇప్పటివరకు ఎన్నో ఆఫర్లను చూశాం. కరోనా రెండో ఉద్ధృతితో కొనుగోళ్లు కొంత మేర తగ్గడంతో మార్కెట్‌లో గృహ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పలు స్థిరాస్తి సంస్థలు సరికొత్త ఆఫర్లను అందిస్తున్నాయి.

Published : 29 May 2021 02:33 IST

ఈనాడు, హైదరాబాద్‌

పండగల రాయితీలు.. ప్రాజెక్ట్‌ ప్రారంభం సందర్భంలో తగ్గింపులు.. ఆర్థిక సంవత్సరం ముగింపులో నజరానాలు.. ఇలా స్థిరాస్తి కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ఇప్పటివరకు ఎన్నో ఆఫర్లను చూశాం. కరోనా రెండో ఉద్ధృతితో కొనుగోళ్లు కొంత మేర తగ్గడంతో మార్కెట్‌లో గృహ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పలు స్థిరాస్తి సంస్థలు సరికొత్త ఆఫర్లను అందిస్తున్నాయి.
కొవిడ్‌ మొదటి వేవ్‌ నుంచి కోలుకున్న తర్వాత గత ఏడాది ఆఖరులో హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. వీటిలో అపార్ట్‌మెంట్లు మొదలు విల్లాల వరకు ఉన్నాయి. అంతక్రితం మొదలెట్టిన పలు నిర్మాణాలు వేర్వేరు దశల్లో ఉన్నాయి. వీటిలో విక్రయాలకు సంబంధించి కొనుగోలుదారులకు చేరువయ్యేందుకు ప్రణాళికలు వేస్తున్న దశలో కొవిడ్‌ రెండో ఉద్ధృతి ఉప్పెనలా వచ్చి పడింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండునెలలు కొవిడ్‌తోనే గడిచిపోయాయి. ఏప్రిల్‌లో స్థిరాస్తి సంస్థల్లోని ఉద్యోగులు పెద్ద ఎత్తున మహమ్మారి బారిన పడ్డారు. మేలో లాక్‌డౌన్‌తోనే సరిపోయింది. సెంటిమెంట్‌పై వ్యాపారం చేసే స్థిరాస్తి రంగంలో.. ఆయా సంస్థలు సైతం రెండునెలలు మార్కెటింగ్‌, విక్రయాలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఉద్యోగుల సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చాయి. బడా సంస్థలు కొన్ని వర్చువల్‌ మార్గంలో కొనుగోలుదారులను చేరువయ్యే ప్రయత్నం చేశాయి. అత్యధిక సంస్థలు కొనుగోళ్లు లేక, వ్యాపారం నడవక చాలావరకు ఆర్థికంగా సతమతమయ్యాయి. ఎక్కువ రోజులు ఇలాగే కొనసాగితే నిర్మాణాలు పూర్తిచేయలేక సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుతుండటంతో  రియల్‌ ఎస్టేట్‌ వర్గాలు ఊపిరిపీల్చుకుంటున్నాయి. కొన్ని సంస్థలు విక్రయాలపై దృష్టిపెట్టి ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నాయి.

వడ్డీ భారం  మోసేలా..
కొవిడ్‌ లాక్‌డౌన్‌తో చాలామంది ఆదాయాలు పడిపోయాయి. కొందరు ఉద్యోగాలే కోల్పోయారు.  ఇవి చాలవన్నట్లు కొవిడ్‌ వైద్య ఖర్చులు అప్పులపాలయ్యేలా చేస్తున్నాయి. ఇలాంటి దశలో కొత్త ఇంటి ఆలోచనలను కొందరు కొంతకాలం వాయిదా వేసుకుంటున్నారు.  ఒకవేళ కొన్నా పాత ఇంటి అద్దె, కొత్త ఇంటి గృహరుణం వాయిదా చెల్లించేది ఎలా అనే  ఆలోచనతో వెనకడుగు వేస్తున్నట్లు స్థిరాస్తి సంస్థలు గుర్తించాయి. ఆర్థికంగా భారం కాకుండానే సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు అని పలు సంస్థలు కొవిడ్‌ ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
* విల్లా ధరలో 20 శాతం, ఫ్లాట్‌ ధరలో పదిశాతం చెల్లిస్తే చాలు అని ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ వినియోగదారులకు చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. నిర్మాణం పూర్తయ్యేవరకు ఈఎంఐ భారం తామే మోస్తామని అంటోంది.
* నిర్మాణంలో ఉన్న ఇళ్లను కొనుగోలు చేస్తే ఐదు శాతం జీఎస్‌టీ చెల్లించాలి.  ఈ భారాన్ని తామే మోస్తామని కొన్ని సంస్థలు అంటున్నాయి. మరికొన్ని సంస్థలు జీఎస్‌టీలో కొంత భారం తాము భరిస్తామని ముందుకొస్తున్నాయి.
* ప్రాజెక్టు ప్రారంభంలో విక్రయించిన ధరకే నిర్మాణం పూర్తైన ఫ్లాట్లను అమ్ముతున్నామని మరో సంస్థ ప్రకటించింది. జూన్‌ నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని ఈలోపే స్థిరాస్తిని సొంతం చేసుకోవాలని ఇంకో సంస్థ అంటోంది.
కొనుగోలుదారులను ఊరిస్తున్నవి..
* ప్రస్తుతం గృహరుణ వడ్డీరేట్లు అత్యంత తక్కువగా ఉన్నాయి. పలు బ్యాంకులు 6.75 శాతం వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి.
* మొదటిసారి గృహరుణంతో ఇల్లు కొనేవారికి ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రుణ ఆధారిత సబ్సిడీ పథకం అమల్లో ఉంది. ఈ ఏడాది కూడా ఈడబ్ల్యూఎస్‌, ఎల్‌ఐజీ వర్గాలకు ఈ పథకం కొనసాగుతుండటంతో రూ.6లక్షల లోపు కుటుంబ వార్షిక ఆదాయం ఉన్నవారు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరికి రూ.2.69 లక్షల వరకు గరిష్ఠంగా వడ్డీ రాయితీ లభిస్తుంది.
* ఇప్పుడు కొనకపోతే మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థిరాస్తి వర్గాలు చెబుతుండటం... కొవిడ్‌ మొదటి వేవ్‌ అనంతరం  స్థిరాస్తుల ధరలు ఒక్కసారిగా పెరగడం చాలామందిని ఆలోచనలో పడేశాయి. కొనుగోళ్లవైపు మొగ్గుచూపేలా చేస్తున్నాయి.
* పాత ఇళ్లు సైతం బడ్జెట్‌లో లభిస్తుండటంతో ఆచితూచి అడుగులేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు