skyscrapers: ‘డెక్‌’రేట్‌ చేస్తున్నారు

నగరంలో కొన్నేళ్ల క్రితం వరకు 20 నుంచి 30 అంతస్తుల ఆకాశహర్మ్యాల భవనాలు చాలా పరిమితంగా ఉండేవి. ఈ భవనాల పైఅంతస్తును చాలావరకు అగ్నిమాపక పైపులైన్లు, సొలార్‌ వాటర్‌ హీటర్లతో నింపేవారు.

Published : 06 Jul 2024 02:03 IST

ఆకాశహర్మ్యాల్లో పైఅంతస్తులే ఇప్పుడు ప్రధాన ఆకర్షణ

ఆకాశహర్మ్యాలతో హైదరాబాద్‌కు దేశీయంగా మాత్రమే కాదు అంతర్జాతీయంగానూ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వీటిని చూసి ఎక్కడో విదేశాల్లో ఉన్నట్లుగా ఉందే అని అబ్బురపడుతున్నారు. మనవాళ్లు విదేశాలకు వెళ్లి అక్కడి భవనాలను చూసి అచ్చు గచ్చిబౌలిలో ఉన్నట్లే ఉన్నాయని పోల్చుతున్నారు. అంతగా హైదరాబాద్‌ రియాలిటీ రూపురేఖల్ని ఆకాశహర్మ్యాలు మార్చేశాయి. భాగ్యనగరాన్ని శిఖర స్థాయిలో నిలబెట్టాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ భవనాల పైఅంతస్తులను(డెక్‌) అంతే ప్రత్యేకంగా నిర్మాణ సంస్థలు తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అబ్బురపర్చేలా డెక్‌లను అదరగొడుతున్నాయి. ప్రస్తుతం చాలావరకు నిర్మాణ దశలో ఉన్నాయి. 

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో కొన్నేళ్ల క్రితం వరకు 20 నుంచి 30 అంతస్తుల ఆకాశహర్మ్యాల భవనాలు చాలా పరిమితంగా ఉండేవి. ఈ భవనాల పైఅంతస్తును చాలావరకు అగ్నిమాపక పైపులైన్లు, సొలార్‌ వాటర్‌ హీటర్లతో నింపేవారు. ఆ భవనంలో నివాసం ఉంటున్న యజమానులు ఎవరైనా పైకి వెళితే అడుగు పెట్టలేనంత గజిబిజిగా ఉండేది. ఇప్పుడు నిర్మాణ సంస్థల ఆలోచనలు మారాయి. సాయంత్రం అయిందంటే సూర్యోదయాన్ని చూస్తూ పైఅంతస్తులోనే గడిపేలా తీర్చిదిద్దుతున్నాయి. ఉదయం నడకకు సైతం సూర్యుడితో పోటీపడుతూ నడిచేలా ట్రాక్‌ను నిర్మించబోతున్నాయి. ఈతకొలనుతో పాటూ పార్టీ లాన్, వినోద, క్రీడా సదుపాయాల వరకు తీర్చిదిద్దబోతున్నాయి. ఇందుకోసం అవసరమైతే ప్రత్యేకంగా మరో అంతస్తును నిర్మించబోతున్నాయి. మార్కెటింగ్‌లో, ఇళ్ల విక్రయాల్లో ఇప్పుడు ఇవి కూడా కీలకం కావడంతో డెక్‌లకు ఎక్కడ లేని ప్రాధాన్యం వచ్చింది.

నగరాన్ని చూసేలా 

నగరం నుంచి విదేశాలకు వెళ్లేవారు ఆయా నగరాల్లోని అత్యంత ఎత్తైన భవనాల పైఅంతస్తుకు వెళ్లి సిటీని చూసి అబ్బుర పడుతుంటారు. మన దగ్గర ఈ అవకాశం లేదు. చార్మినార్‌ వంటి చారిత్రక కట్టడాల పైఅంతస్తు నుంచి ఇదివరకు నగరాన్ని చూసే అవకాశం ఉన్నా.. భద్రతరీత్యా వాటిపై ఆంక్షలు ఉన్నాయి. ఎక్కువ ఎత్తుకు వెళ్లలేం. అమ్యూజ్‌మెంట్‌ పార్కుల్లో  ఎంతో ఎత్తులో ఉండే జెయింట్‌ వీల్‌ ఎక్కేందుకు అనుమతి ఇస్తున్నారు. అక్కడ నుంచి నగరాన్ని చూసే అవకాశం కల్పిస్తున్నారు. కాకపోతే ఇవి శివార్లలో ఉండటంతో చుట్టూ పొలాలు తప్ప నగరం కన్పించడం లేదు. ఆకాశహర్మ్యాల రాకతో ఆ లోటు తీరబోతోంది. వాణిజ్య భవనాల్లోని డెక్‌ల పైకి వెళ్లేందుకు పర్యాటకులను అనుమతించే దిశగా కొన్ని సంస్థలు ఆలోచనలు చేస్తున్నాయి. రెసిడెన్షియల్‌ భవనాల్లో పూర్తిగా అందులోని నివాసితులకే పైఅంతస్తుల్లో విహరించే అవకాశం ఉంటుంది. 

ఇదివరకు హెలిప్యాడ్స్‌ 

నగరంలో మొదట్లో కట్టిన ఆకాశహర్మ్యాల భవనాలపై హెలిప్యాడ్స్‌ కనిపించేవి. అగ్నిప్రమాదాల సమయంలో భవనంలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అత్యవసరంగా హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ కోసం దీన్ని ఏర్పాటు చేసేవారు. అగ్నిమాపక నిబంధనల్లో అప్పట్లో తప్పనిసరి కావడంతో వీటిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ నిబంధనను సడలించారని ఒక బిల్డర్‌ తెలిపారు. హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ సమయంలో వీచే గాలితో మంటలు అధికమవడం వంటి సమస్యలను గుర్తించడంతో ఈ నిబంధనలో మార్పు చేశారని తెలిపారు.

ఎక్కడెక్కడ వస్తున్నాయ్‌

నగరంలో గరిష్ఠంగా 250 మీటర్ల ఎత్తు వరకు ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నారు. కోకాపేటలో నగరంలోని అంత్యంత ఎత్తైన భవన సముదాయంలో ఒక టవర్‌ పూర్తై సరికొత్త రికార్డు నమోదు చేసింది. వీటితో సహా పలు భవనాల డెక్‌లను ఆకర్షణీయంగా డిజైన్‌ చేస్తున్నారు.

  • మియాపూర్, అబిడ్స్, సైదాబాద్, నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ, శంషాబాద్, ఉప్పల్, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ కోకాపేటలో నిర్మాణంలో ఉన్న ఆకాశహర్మ్యాల భవనాలు పూర్తయితే చాలావరకు అక్కడి నివాసితులు తమ ఖాళీ సమయాన్ని డెక్‌లలో గడిపేలా రూపొందిస్తున్నారు. 
  • విదేశాల్లో చూసి వచ్చిన వాళ్ల అనుభవాలు, బిల్డర్ల ఆలోచనలతో ఈ తరహా డెక్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరు వీటిని ఆదాయ వనరుగా మలుచుకుంటున్నారు. 
  • గుడిమల్కాపూర్‌లో, అప్పాకూడలిలో ట్విన్‌ టవర్లు వస్తున్నాయి. ఇక్కడ పైఅంతస్తులను ఒకదానితో ఒకటి కలుపుతున్నారు. ఇది చాలా సవాల్‌తో కూడుకున్నదని అందుకే ఇన్నాళ్లు ఏ సంస్థ ఒక టవర్‌ నుంచి రెండో టవర్‌ను కలపలేదని ఒక బిల్డర్‌ చెప్పారు. ఇప్పుడు సుసాధ్యం చేస్తున్నారు. షేక్‌పేటలో నిర్మించిన ఒక సంస్థ ఇప్పటికే ప్రతి టవర్‌కి, పక్కనున్న మరో టవర్‌కు అనుసంధానం చేసింది. కొత్తగా వస్తున్నవన్నీ దాదాపుగా ఇదే డిజైన్‌లో ఉంటున్నాయి.
  • రాయదుర్గంలో 45 అంతస్తుల్లో నిర్మాణంలో ఉన్న ఒక భవన సముదాయంలో డెక్‌ను విన్నూతంగా డిజైన్‌ చేశారు. మూడు టవర్లను కలిపి డెక్‌ను నిర్మిస్తున్నారు. కిలోమీటర్‌ నడక ట్రాక్‌ ఉంటుందంటే ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని