తడబడినా నిలకడే

స్థిరాస్తి రంగం ఈ ఏడాది నిలకడగా సాగింది. గృహ విక్రయాలపై నిర్మాణ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. భూములు, స్థలాల మార్కెట్‌ కాస్త మందకొడిగా సాగింది.

Updated : 31 Dec 2022 10:28 IST

2022లో స్థిరాస్తి రంగం
ఈనాడు, హైదరాబాద్‌

స్థిరాస్తి రంగం ఈ ఏడాది నిలకడగా సాగింది. గృహ విక్రయాలపై నిర్మాణ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. భూములు, స్థలాల మార్కెట్‌ కాస్త మందకొడిగా సాగింది. క్రయ విక్రయాలతో సంబంధం లేకుండా స్థిరాస్తి ధరలు మాత్రం అన్ని విభాగాల్లో పెరగడం కొనుగోలుదారులకు భారంగా మారింది. దీనికి తోడు గృహ రుణ వడ్డీరేట్లు ఏకంగా రెండున్నర శాతం పెరగడంతో కొన్ని వర్గాలకు సొంతిల్లు 2022లోనూ అందని కలగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో మార్కెట్‌ ఎలా ఉండబోతోంది?  బిల్డర్ల అంచనాలను ఈ ఏడాది అందుకుందా? తదితర విషయాలపై స్థిరాస్తి సంఘాల ప్రతినిధులతో ‘ఈనాడు’ మాట్లాడింది.


కొత్త సంవత్సరంలోనూ ఢోకా ఉండదు
- పి.రామకృష్ణారావు, అధ్యక్షుడు, క్రెడాయ్‌ హైదరాబాద్‌

2022లో స్థిరాస్తి మార్కెట్‌లో గృహ నిర్మాణం బాగుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. మార్కెట్‌ చాలా బాగా ఉన్న సంవత్సరాల్లోనూ అన్నినెలలు ఒకేలా ఉండవు. కొన్నినెలలు కొంచెం స్తబ్ధుగా ఉంటుంది. కొన్ని నెలలు ఊపు మీద ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. ఇందుకు ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. గృహ నిర్మాణ మార్కెట్‌ నిలకడగా సాగుతోంది.
* కార్యాలయాల నిర్మాణాల పరంగా దేశంలోనే హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉన్నట్లు ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీల నివేదికలు చెబుతున్నాయి. ఇన్‌ఫ్రా బాగుండటం, ఇతర నగరాలతో పోలిస్తే లీజింగ్‌ అద్దెలు తక్కువగా ఉండటం బాగా ఆకర్షిస్తోంది. కొవిడ్‌ అనంతరం హైదరాబాద్‌ వైపే చూస్తున్నారు.
* 2023లో కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ బాగుంటుందని మా అంచనా. గృహ నిర్మాణం ఎలాగూ బాగుంది. కమర్షియల్‌ పెరిగిన కొద్దీ రెసిడెన్షియల్‌ ఇంకా పెరుగుతుంది.
* రియల్‌ ఎస్టేట్‌లోనూ చాలా విభాగాలు ఉన్నా ఎక్కువగా గృహ నిర్మాణం, కమర్షియల్‌, ప్లాటింగ్‌ వరకే మాట్లాడతాం. లాజిస్టిక్స్‌ పరంగా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉన్నాయి.
* హైదరాబాద్‌ చుట్టు పక్కల నీటి వనరుల చెంత పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తే రిసార్ట్‌లు వచ్చేలా పాలసీల్లో మార్పులు చేసి ప్రోత్సహించాలి. జోనింగ్‌లో సడలింపులు ఇవ్వాలి. పెరి అర్బన్‌ జోన్‌లో తక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలకు అవకాశం ఉంటుంది. దీంతో అక్కడ కట్టుకోవాలని ఉన్నా.. అవకాశం లేక సిటీలోనే ఉంటున్నారు. నగరంలో ఒకచోటనే జనసాంద్రత పెరిగేలా కాకుండా చుట్టూ విస్తరించేలా విధానాల్లో మార్పులు అవసరం. ఉదాహరణకు పెరి అర్బన్‌ జోన్‌లో పరిమితంగా నిర్మాణాలకు మాత్రమే అవకాశం ఉంది. వీటిలో మార్పులు చేయాలి. ఫలితంగా సిటీ బయట నిర్మాణ రంగం విస్తరించేందుకు అవకాశం ఉంటుంది.
* వడ్డీరేట్ల పెరుగుదల ప్రభావం ఉన్నా తాత్కాలికమే. 2009 నుంచి 2013 వరకు వడ్డీరేట్లు ఎక్కువ ఉన్నా.. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు గ్లోబల్‌ మార్కెట్‌లోని పరిణామాలను బట్టి వడ్డీరేట్లు పెరిగాయి. అయితే ఇక్కడ గుర్తించాల్సినది ఒకటే. గృహ రుణాలు దీర్ఘకాలానికి తీసుకునేవి. 15 నుంచి 20 ఏళ్ల టర్మ్‌ ఉంటుంది. అంతకాలం ఇవే వడ్డీరేట్లు ఉండవు. ఒకటి రెండేళ్లలో తగ్గుతాయి. ప్రభుత్వాలు సైతం ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు తగ్గించక తప్పదు. కొత్తగా తీసుకునేవారికి మాత్రం పెరిగిన వడ్డీరేట్లతో ఎక్కువ మొత్తం రుణ లభ్యత తగ్గిపోవడం ఒక్కటి ప్రతికూలం.


వృద్ధి పథంలోనే - బి.సునీల్‌చంద్రారెడ్డి, అధ్యక్షుడు, నరెడ్కో తెలంగాణ

రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ ఆధారంగా నడిచే పరిశ్రమ. ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటే 2022లో మాదిరే కొత్త సంవత్సరంలోనూ వృద్ధి కొనసాగుతుంది. కొత్త ఉద్యోగాలు వస్తే.. కార్యాలయాలకు, ఇళ్లకు మరింత డిమాండ్‌ పెరుగుతుంది. ఐటీ రంగంలో 2026 నాటికి 10 లక్షల ఐటీ ఉద్యోగాలు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 2021-26 కోసం ఐసీటీ పాలసీని తీసుకొచ్చింది.  ఐటీ ఎగుమతులు రెండింతలు అయ్యేలా రూ.3 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా కొత్త సంస్థలు పెద్ద ఎత్తున నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయి.  
* ఐటీ/ఐటీ ఆధారిత రంగమే కాకుండా రక్షణ, ఫార్మా, డాటా సెంటర్లు, ఉత్పత్తి, పరిశోధన అభివృద్ధి రంగాల్లోనూ పెట్టుబడులు ఆకర్షించేందుకు రాయితీలు ఇస్తుండటంతో ఆ మేరకు వృద్ధి కనబడుతోంది. ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి కాబట్టి రియల్‌ ఎస్టేట్‌ సైతం బాగుంటుందని ఆశిస్తున్నాం.
* 2022లో గృహ విక్రయాలు బాగున్నాయి. నెలవారీగా చూస్తే నవంబరులో 28 శాతం వృద్ధి కనిపించింది. వడ్డీరేట్లు పెరిగినా ఈ స్థాయిలో వృద్ధి నమోదవడం డిమాండ్‌ను సూచిస్తోంది. కొత్త ఏడాదిలోనూ ఇది కొనసాగుతుంది.


భూముల ధరలు పెరగడంతో..
- జీవీ రావు, అధ్యక్షుడు, తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌

ఈ ఏడాది రియల్‌ ఎస్టేట్‌కు బాగుంది. అన్ని విభాగాల్లో  ఫ్లాట్లు, విల్లాలు, ప్లాట్లు విక్రయాలు బాగున్నాయి. రెండు, మూడు పడక గదులకు డిమాండ్‌ నిలకడగా కొనసాగింది. విలాసవంతమైన ఆవాసాలకు డిమాండ్‌ పెరగడం కొత్త ట్రెండ్‌. రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్ల విలువైన విల్లా ప్రాజెక్టుల లావాదేవీలు బాగా జరిగాయి. అత్యాశతో భూముల ధరలను అమాంతం పెంచడంతో భూమి లావాదేవీలు మాత్రం తగ్గాయి.
* కొత్త సంవత్సరంపై చాలా ఆశలే ఉన్నా ప్రపంచంపై మాంద్యం ప్రభావం ఎలా ఉంటుందనేది చూడాలి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు, కొవిడ్‌ ప్రభావం తక్కువగా ఉంటే రియల్‌ ఎస్టేట్‌తో పాటూ ఇతర వ్యాపారాలు 2023లో ఉపయోగపడతాయి.
* నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రణాళికబద్ధమైన సమగ్ర పట్టణ విధానానికి పురపాలక శాఖ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. లేకుంటే అస్తవ్యస్తమైన శివారు ప్రాంతాలు నగరం ఎదుగుదలకు ఆటంకంగా మారతాయి.  
* వచ్చే సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీని ప్రభావం స్థిరాస్తి మార్కెట్‌పై నామమాత్రంగా ఉంటుంది. ఐటీ, ఇతర రంగాలు మార్కెట్‌ చోదక శక్తిగా ఉన్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని