ఇఫ్తార్‌ వేళ... కాబూలీ పులావ్‌!

పవిత్ర రంజాన్‌ మాసంలో రోజంతా ఉపవాసం ఉండి... సాయంత్రం ఇఫ్తార్‌ విందును తీసుకోవడం మామూలే. ఈ సమయంలో తినే వంటకాల నుంచి పోషకాలు అందాలని కోరుకోవడం సహజం కాబట్టి... మెనూలో ఇలాంటివి చేర్చుకుంటే సరి.

Published : 26 Jun 2021 12:31 IST

పవిత్ర రంజాన్‌ మాసంలో రోజంతా ఉపవాసం ఉండి... సాయంత్రం ఇఫ్తార్‌ విందును తీసుకోవడం మామూలే. ఈ సమయంలో తినే వంటకాల నుంచి పోషకాలు అందాలని కోరుకోవడం సహజం కాబట్టి... మెనూలో ఇలాంటివి చేర్చుకుంటే సరి.


కాబూలీ పులావ్‌!

కావలసినవి: మటన్‌: అరకేజీ, నీళ్లు: ఐదు కప్పులు, ఉల్లిపాయలు: రెండు, వెల్లుల్లి రెబ్బలు: అరకప్పు, గరంమసాలా: ఒకటిన్నర చెంచా, క్యారెట్లు: రెండు, చక్కెర: రెండు చెంచాలు, యాలకులపొడి: చెంచా, డ్రైఫ్రూట్స్‌ పలుకులు : అరకప్పు, నూనె: అరకప్పు, జీలకర్ర: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్రపొడి: చెంచా, దనియాలపొడి: చెంచా, పెరుగు: అరకప్పు, బాస్మతీబియ్యం: మూడు కప్పులు(ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి), ఉప్పు: తగినంత, నెయ్యి: పావుకప్పు.

తయారీవిధానం: ఓ గిన్నెలో నీళ్లు, మటన్‌ ముక్కలు, కొద్దిగా ఉప్పు, చిన్న ఉల్లిపాయముక్క, రెండు వెల్లుల్లి రెబ్బలు, అరచెంచా గరంమసాలా తీసుకుని స్టౌమీద పెట్టాలి. మటన్‌ ఉడికాక స్టౌ కట్టేసి... ఆ నీటిని విడిగా తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్‌ని స్టౌమీద పెట్టి నూనె, నెయ్యి వేయాలి. అవి వేడయ్యాక ఉల్లిపాయముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేయించి, వెల్లుల్లి తరుగు, మటన్‌ ముక్కలు, తగినంత ఉప్పు, జీలకర్రపొడి, క్యారెట్‌ ముక్కలు, డ్రైఫ్రూట్స్‌ పలుకులు, చక్కెర, మిగిలిన గరంమసాలా, యాలకుల పొడి, దనియాలపొడి పెరుగు వేసి బాగా వేయించాలి. ఇది కూరలా అవుతున్నప్పుడు ఉడికించిన మటన్‌ నీళ్లు, బాస్మతీబియ్యం వేసి స్టౌని మీడియంలో పెడితే... కాసేపటికి బిర్యానీ రెడీ.


ఖర్జూర హల్వా

కావలసినవి: గింజల్లేని ఖర్జూరాలు: మూడు కప్పులు, కోవా: రెండు కప్పులు, నెయ్యి: చెంచా, పిస్తాపలుకులు: పావుకప్పు.

తయారీవిధానం: ఖర్జూరాలను ముక్కల్లాకోసి మిక్సీలో వేసుకుని ముద్దలా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టౌమీద పాన్‌పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక ఖర్జూర ముద్ద, కోవా వేసి కలపుతూ ఉడికించాలి. కాసేపటికి ఇది ముద్దలా అవుతుంది. ఇప్పుడు పిస్తాపలుకులు వేసి స్టౌ కట్టేయాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేటులోకి తీసుకుని కాసేపయ్యాక ముక్కల్లా కోస్తే సరి.


చికెన్‌ కోఫ్తా కర్రీ

కావలసినవి:చికెన్‌ కోఫ్తాలకోసం:చికెన్‌ కీమా: మూడు కప్పులు, కారం, జీలకర్రపొడి, దనియాలపొడి, సోంపు: చెంచా చొప్పున,   ఉప్పు: తగినంత, కొత్తిమీర, పుదీనా: రెండూ కలిపి అరకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా. గ్రేవీకోసం: లవంగాలు: మూడు, యాలకులు: మూడు, దాల్చినచెక్క: రెండు ముక్కలు, ఉల్లిపాయలు: రెండు, టొమాటోలు: మూడు, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, దనియాలపొడి: చెంచా, గరంమసాలా:  చెంచా, టొమాటోసాస్‌: మూడు టేబుల్‌స్పూన్లు, క్రీమ్‌: పావుకప్పు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, ఉప్పు: తగినంత.

తయారీవిధానం: కోఫ్తాలకోసం పెట్టుకున్న పదార్థాల్లో నూనె తప్ప మిగిలినవన్నీ మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. బాణలిని స్టౌమీద పెట్టి మూడు టేబుల్‌స్పూన్ల నూనె వేసి లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేయాలి, రెండు నిమిషాల య్యాక ఉల్లిపాయ ముక్కలు వేయించి, అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలు వేయాలి. అవీ వేగాక దించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మళ్లీ బాణలిలో వేసి స్టౌమీద పెట్టి చికెన్‌ కోఫ్తాలు తప్ప మిగిలిన పదార్థాలు వేసుకోవాలి. ఇది చిక్కగా అవుతున్నప్పుడు చికెన్‌ కోఫ్తాలు వేసి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.


మటన్‌ కట్‌లెట్‌

కావలసినవి: మటన్‌ కీమా: అరకేజీ, కారం: చెంచా, పసుపు: పావుచెంచా, గరంమసాలా: అరచెంచా, మిరియాలపొడి: అరచెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద: అరచెంచా, పచ్చిమిర్చి: రెండు, ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు, బ్రెడ్‌పొడి: కప్పు, గుడ్డు: ఒకటి, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర: రెండూ కలిపి పావుకప్పు, ఉడికించిన బంగాళాదుంప: ఒకటి, నూనె: వేయించేందుకు సరిపడా, నీళ్లు: కప్పు, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: స్టౌమీద బాణలి పెట్టి రెండు చెంచాల నూనె వేసి ఉల్లిపాయముక్కలు వేయించాలి. అవి వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించి నూనె, గుడ్డు, బ్రెడ్‌పొడి తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసి వేయించుకుని, పది నిమిషాలయ్యాక దింపాలి. వేడి చల్లారాక ఈ ముద్దను కట్‌లెట్లలా చేసుకోవాలి. ఒక కట్‌లెట్‌ను తీసుకుని మొదట గుడ్డుసొనలో, తరువాత బ్రెడ్‌పొడిలో ముంచి కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా అన్నీ చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని