బాదం కుల్ఫీ... భలే రుచి!

ఓ వైపు ఎండలు... మరోవైపు ఇంటిల్లిపాదీ ఇంట్లో ఉండే పరిస్థితులు. ఎండ చురుక్కుమనే ఈ సమయంలో చల్లని ఐస్‌క్రీమో, కుల్ఫీనో తినాలని మనసు కోరుకోవడం మామూలే. మీ ఓటు ఈసారి కుల్ఫీకే అయితే... ఇంట్లోనే రకరకాల రుచుల్లో వాటిని చేసేందుకు ట్రై చేయండి.

Updated : 09 Dec 2022 15:12 IST

ఓ వైపు ఎండలు... మరోవైపు ఇంటిల్లిపాదీ ఇంట్లో ఉండే పరిస్థితులు. ఎండ చురుక్కుమనే ఈ సమయంలో చల్లని ఐస్‌క్రీమో, కుల్ఫీనో తినాలని మనసు కోరుకోవడం మామూలే. మీ ఓటు ఈసారి కుల్ఫీకే అయితే... ఇంట్లోనే రకరకాల రుచుల్లో వాటిని చేసేందుకు ట్రై చేయండి.


బాదం కుల్ఫీ

కావలసినవి: బాదం పాలు: ఒకటిన్నర కప్పు, ఫుల్‌క్రీం పాలు: కప్పు, చక్కెర: అరకప్పు, బియ్యప్పిండి: చెంచా (రెండుమూడు చెంచాల నీటిలో కలుపుకోవాలి), బాదం: ముప్పావుకప్పు, యాలకులపొడి: అరచెంచా, దాల్చినచెక్కపొడి: చిటికెడు, గులాబీనీరు: చెంచా, పిస్తాపలుకులు: రెండు చెంచాలు.
తయారీవిధానం: ఒకటిన్నర కప్పు నీటిని స్టౌమీద పెట్టాలి. అవి మరుగుతున్నప్పుడు ముప్పావువంతు బాదం గింజల్ని వేసి రెండు నిమిషాలయ్యాక స్టౌ కట్టేయాలి. తరువాత వాటి పొట్టు తీసేసి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. స్టౌమీద పాన్‌పెట్టి... బాదంపాలు, ఫుల్‌క్రీం పాలను పోయాలి. అవి చిక్కగా అవుతున్నప్పుడు   బాదం మిశ్రమాన్ని వేయాలి. అయిదు నిమిషాలయ్యాక మిగిలిన బాదం, పిస్తా పలుకులు, చక్కెర, యాలకులపొడి, దాల్చినచెక్కపొడి, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. ఇది చిక్కగా అవుతున్నప్పుడు దింపేసి, ఓసారి గిలకొట్టి కుల్ఫీమౌల్డ్స్‌లో వేసి డీప్‌ఫ్రీజర్‌లో పెట్టాలి. ఆరేడు గంటల తరువాత ఇవతలకు తీసి కుళాయి నీటికింద ఉంచితే.. కుల్ఫీ రెడీ.


చాక్లెట్‌తో...

కావలసినవి: ఫుల్‌క్రీం పాలు: కప్పు, వెన్నలేని పాలు: పావుకప్పు, మొక్కజొన్నపిండి: చెంచా, చాక్లెట్‌పొడి: రెండు చెంచాలు, చక్కెర: టేబుల్‌స్పూను, డార్క్‌చాక్లెట్‌చిప్స్‌: ఒకటిన్నర టేబుల్‌స్పూను, చక్కెర కలపని కోవా: రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం: ముందుగా స్టౌమీద పాన్‌ పెట్టి... ఫుల్‌క్రీం పాలు పోయాలి. అవి మరిగాక స్టౌని సిమ్‌లో పెట్టాలి. ఓ కప్పులో వెన్నలేని పాలు, చక్కెర, చాక్లెట్‌పొడి, మొక్కజొన్న పిండి తీసుకుని అన్నింటినీ కలిపి మరుగుతున్న పాలల్లో పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. రెండు నిమిషాలయ్యాక కోవా, చాక్లెట్‌ చిప్స్‌ వేసి కలపాలి. ఇది క్రీమ్‌లా తయారవుతున్నప్పుడు దింపేసి, చల్లారనిచ్చి కుల్ఫీ మౌల్డ్స్‌లో వేసి డీప్‌ఫ్రీజర్‌లో పెట్టాలి. ఆరేడు గంటల తరువాత ఇవతలకు తీసి... కుళాయి నీటి కింద ఉంచితే కుల్ఫీ వచ్చేస్తుంది.


మామిడితో...

కావలసినవి: ఫుల్‌క్రీంపాలు: రెండు కప్పులు, కండెన్స్‌డ్‌ మిల్క్‌: ఒకటి ముప్పావు కప్పు, మామిడిపండు గుజ్జు: రెండుకప్పులు, పిస్తా: రెండుటేబుల్‌స్పూన్లు, బాదం: టేబుల్‌స్పూను, చక్కెర: రెండు చెంచాలు, మొక్కజొన్నపిండి: టేబుల్‌స్పూను (రెండు చెంచాల పాలల్లో కలిపి పెట్టుకోవాలి).
తయారీ విధానం: ముందుగా సగం పిస్తాను పలుకుల్లా కోసి, మిగిలినవాటిని బాదంతో కలిపి నీళ్లల్లో నానబెట్టుకోవాలి. అరగంటయ్యాక బాదం, పిస్తా, రెండు టేబుల్‌స్పూన్ల పాలు, చక్కెర మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. స్టౌమీద పాన్‌పెట్టి పాలు పోయాలి. అవి మరిగాక కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి స్టౌని సిమ్‌లో పెట్టి మధ్యమధ్య కలపాలి. రెండునిమిషాలయ్యాక బాదం మిశ్రమాన్ని వేయాలి. ఇది చిక్కగా అవుతున్నప్పుడు మొక్కజొన్న మిశ్రమాన్నీ వేసి ఓసారి కలిపి.. వెంటనే మామిడిపండు గుజ్జు వేయాలి. చిక్కగా అవుతున్నప్పుడు పిస్తా పలుకులు వేసి స్టౌ కట్టేయాలి. ఈ మిశ్రమం చల్లారాక కుల్ఫీ మౌల్డ్స్‌లో వేసి డీప్‌ఫ్రీజర్‌లో పెట్టాలి. ఆరేడు గంటలయ్యాక తీసి కుళాయి నీటి కింద ఉంచితే... కుల్ఫీ వచ్చేస్తుంది.


మలైతో...

కావలసినవి: ఫుల్‌క్రీం పాలు: అరలీటరు, పాలపొడి: అరకప్పు, చక్కెర: అరకప్పు, యాలకులపొడి: అరచెంచా, బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు: అన్నీ కలిపి రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం: అడుగు మందంగా ఉన్న గిన్నెను స్టౌమీద పెట్టి పాలు పోయాలి. అవి మరిగాక పాలపొడి వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలపాలి. అయిదు నిమిషాలయ్యాక చక్కెర కూడా వేయాలి. చక్కెర కరిగి పాలు సగం అయ్యాక యాలకులపొడీ, డ్రైఫ్రూట్స్‌ పలుకులూ వేయాలి. పాలు చిక్కబడి క్రీంలా తయారవుతున్నప్పుడు దింపేయాలి. ఈ మిశ్రమం చల్లారాక కుల్ఫీమౌల్డ్స్‌లో వేసి డీప్‌ఫ్రీజర్‌లో ఆరేడు గంటలు ఉంచి తరువాత ఇవతలకు తీసి ధారలా వచ్చే కుళాయి నీటి అడుగున ఉంచితే.. కుల్ఫీ రెడీ.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని