అట్లతద్దోయ్‌.. ఆరట్లోయ్‌..!

ఓ గిన్నెలో గోధుమపిండి, సెనగపిండి, ఉప్పు, మంచినీళ్లు పోసి దోసెపిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. తరవాత పెనంమీద పిండిని దోసెలా వేసి నూనెవేస్తూ రెండువైపులా కాల్చితీయాలి.

Published : 26 Jun 2021 16:19 IST

సొరకాయ అట్టు

కావలసినవి
సొరకాయ(చిన్నది): ఒకటి, పెసలు: కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం: చిన్న ముక్క, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: తగినంత

తయారుచేసే విధానం
* పెసలు రెండుగంటలపాటు నానబెట్టాలి.
* సొరకాయ తొక్కుతీసి ముక్కలుగా కోయాలి. ఇప్పుడు మిక్సీలో నానబెట్టిన పెసలు, సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని నాన్‌స్టిక్‌ పాన్‌మీద కొంచెంకొంచెంగా అట్లులా పోసి, నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.


బీరకాయ తొక్కల అట్టు

కావలసినవి
బీరకాయ తొక్కలు: కప్పు, కొత్తిమీర: కట్ట, కరివేపాకు: 3 రెబ్బలు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లంతురుము: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, బియ్యం: కప్పు, మినప్పప్పు: అరకప్పు, క్యారెట్‌ తురుము: ఒకటి, ఉల్లిపాయ: ఒకటి, నూనె: తగినంత

తయారుచేసే విధానం
* బియ్యం, మినప్పప్పు ఓ గంటసేపు నాననివ్వాలి. తరవాత మిక్సీలో బీరకాయ తొక్కు, కొత్తిమీర తురుము, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లంతురుము, జీలకర్ర, ఉప్పు, నానబెట్టిన బియ్యం, మినప్పప్పు వేసి మెత్తగా రుబ్బాలి.
* తరవాత మిశ్రమాన్ని పెనంమీద దోసెలా వేసి, నూనె వేస్తూ రెండువైపులా కాల్చాలి.


గోధుమ అట్టు

కావలసినవి
గోధుమపిండి: కప్పు, బియ్యప్పిండి: పావుకప్పు, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: టేబుల్‌స్పూను

తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో గోధుమపిండి, సెనగపిండి, ఉప్పు, మంచినీళ్లు పోసి దోసెపిండిలా కలిపి కాసేపు నాననివ్వాలి. తరవాత పెనంమీద పిండిని దోసెలా వేసి నూనెవేస్తూ రెండువైపులా కాల్చితీయాలి.


కీరా అట్టు

కావలసినవి
మినప్పప్పు: పావు కప్పు, కీరా దోస: ఒకటి, బియ్యం: అరకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, కొత్తిమీర: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడా, జీలకర్ర: ముప్పావు టీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా

తయారుచేసే విధానం
* మినప్పప్పు, బియ్యం విడివిడిగా మూడు నాలుగు గంటలు నానబెట్టాలి. తరవాత కీరా సన్నగా తురమాలి. ఇప్పుడు దీనికి కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి, జీలకర్ర జోడించి అన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి తీయాలి. తరవాత మినప్పప్పు, బియ్యం విడివిడిగా రుబ్బి కలపాలి. అందులోనే కీరా మిశ్రమ ముద్దని కూడా కలిపి మళ్లీ రుబ్బాలి. దీన్ని ఓ గంటసేపు పక్కన ఉంచాలి. తరవాత పెనంమీద దోసె మాదిరిగా వేసి నూనె వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.


అటుకులతో...

కావలసినవి
ఇడ్లీబియ్యం: కప్పు, అటుకులు: అరకప్పు, మినప్పప్పు: అరకప్పు, పెరుగు: అరకప్పు, మంచినీళ్లు: కప్పు, బేకింగ్‌సోడా: పావు టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: తగినంత

తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో పెరుగు వేసి, మంచినీళ్లు పోసి బాగా గిలకొట్టాలి. మరో గిన్నెలో ఇడ్లీ బియ్యం, అటుకులు, మినప్పప్పు వేసి బాగా కడగాలి. తరవాత వీటిలో గిలకొట్టిన మజ్జిగ వేసి మూడు నాలుగు గంటలు నాననివ్వాలి. నానబెట్టిన మజ్జిగను పక్కన ఉంచి బియ్యం, అటుకులు, పప్పు మిక్సీలో వేసి రుబ్బాలి. అవి కాస్త మెత్తగా అయ్యాక అందులో పక్కన ఉంచిన మజ్జిగను పోసి బాగా మెత్తగా రుబ్బాలి. దోసె పిండిలా జారుగా అయ్యేవరకూ రుబ్బి, బేకింగ్‌ సోడా, ఉప్పు వేసి బాగా కలిపి నాలుగైదు గంటలు పులియనివ్వాలి. తరవాత పెనంమీద అట్లు పోసినట్లే రెండువైపులా నూనె వేస్తూ కాల్చి తీయాలి.


మజ్జిగ అట్టు

కావలసినవి
బియ్యప్పిండి: కప్పు, మైదా: అరకప్పు, పుల్లపెరుగు: ముప్పావుకప్పు, మంచినీళ్లు: 2 కప్పులు, పచ్చిమిర్చి: ఆరు, ఉల్లిపాయ: ఒకటి, జీలకర్ర: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేసే విధానం
* బియ్యప్పిండిలో మైదా, ఉప్పు కలిపి ఉంచాలి. ఇప్పుడు పుల్లపెరుగులో మంచినీళ్లు పోసి గిలకొట్టాలి. తరవాత పచ్చిమిర్చి, జీలకర్ర కచ్చాపచ్చాగా రుబ్బాలి. ఇప్పుడు దీన్ని మజ్జిగలో వేసి కలపాలి. తరవాత ఈ మజ్జిగను పిండిలో పోస్తూ నెమ్మదిగా ఉండలు కట్టకుండా కలిపి నాననివ్వాలి.
* పెనంమీద అరటీస్పూను నూనె వేసి తరవాత పిండిని అట్టులా వేసి, రెండువైపులా కాల్చి తీయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని