వెన్న దొంగకు అటుకుల పొంగలి!

కృష్ణుడికి అటుకులూ, వెన్న అంటే ఇష్టమంటారు. అలాగని ఎప్పుడూ ఆ రెండింటినే నివేదిస్తే కొత్తేముంది... అందుకే ఈసారి వాటితోనే రకరకాల పదార్థాలు చేసి చిన్నికృష్ణుడికి అర్పిద్దాం.

Published : 26 Jun 2021 11:17 IST

కృష్ణుడికి అటుకులూ, వెన్న అంటే ఇష్టమంటారు. అలాగని ఎప్పుడూ ఆ రెండింటినే నివేదిస్తే కొత్తేముంది... అందుకే ఈసారి వాటితోనే రకరకాల పదార్థాలు చేసి చిన్నికృష్ణుడికి అర్పిద్దాం.


మధుర కోవా

కావలసినవి: నెయ్యి: మూడు చెంచాలు, పాలు: ఒకటింబావు కప్పు, పాలపొడి: రెండు కప్పులు, చక్కెరపొడి: అరకప్పు, జాజికాయ పొడి: అరచెంచా, యాలకులపొడి: చెంచా.
తయారీవిధానం: కడాయిని పొయ్యిమీద పెట్టి చెంచా నెయ్యి వేసి కప్పు పాలు పోయాలి. అవి వేడయ్యాక పాలపొడి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉంటే... చిక్కగా అవుతుంది. అప్పుడు మరో చెంచా నెయ్యి వేసి మంట తగించాలి. ఇది పొడిపొడిగా అయ్యాక రెండు టేబుల్‌స్పూన్ల పాలు పోసి కలపాలి. కాసేపటికి ఈ మిశ్రమం రంగు మారుతుంది. అప్పుడు దింపేయాలి. వేడి కొద్దిగా చల్లారాక పాలు తప్ప మిగిలిన పదార్థాలు వేసి బాగా కలపాలి. తరువాత పాలు చల్లుకుంటూ బిళ్లల్లా చేసుకోవాలి. కావాలనుకుంటే చక్కెరపొడిలోనూ అద్దుకోవచ్చు.


కొబ్బరి వెన్న ఉండలు

కావలసినవి: బియ్యప్పిండి: అరకప్పు, మినప్పిండి: చెంచా, వెన్న: రెండు చెంచాలు, వేయించిన కొబ్బరితురుము: రెండు టేబుల్‌స్పూన్లు, నువ్వులు: అరచెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీవిధానం: స్టౌమీద బాణలి పెట్టి బియ్యప్పిండిని రెండు నిమిషాలు వేయించుకుని దింపేయాలి. వేడి చల్లారాక జల్లించుకోవాలి. అదేవిధంగా మినప్పిండినీ జల్లించుకోవాలి. వీటిపైన నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసి అన్నింటినీ కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ గట్టి పిండిలా చేసుకోవాలి. దీన్ని పది నిమిషాలు నాననిచ్చి... చిన్నచిన్న ఉండల్లా చేసుకుని కాగుతోన్న నూనెలో ఐదారుచొప్పున వేసి... ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


కొబ్బరి అటుకులు

కావలసినవి: మందంగా ఉండే అటుకులు: రెండు కప్పులు, పచ్చి కొబ్బరి తురుము: అరకప్పు, నువ్వులు: టేబుల్‌స్పూను, మినప్పప్పు: చెంచా, సెనగపప్పు: చెంచా, ఆవాలు: చెంచా, ఎండుమిర్చి: మూడు, కరివేపాకు: మూడు రెబ్బలు, ఉప్పు: తగినంత, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీవిధానం: అటుకుల్ని ఓసారి కడిగి తరువాత నీళ్లు పిండేసి తీసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, సెనగపప్పు వేయాలి. అవి వేగాక కరివేపాకు, నువ్వులు, కొబ్బరి తురుము వేసి వేయించి తగినంత ఉప్పు, అటుకులు వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.


పెరుగు చెగోడీలు

కావలసినవి: బియ్యప్పిండి: అరకప్పు, పెరుగు: అరకప్పు, నీళ్లు: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, జీలకర్ర: చెంచా, పెసరపప్పు: రెండు చెంచాలు, కొత్తిమీర: కట్ట, కరివేపాకు తరుగు: చెంచా, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీవిధానం: ముందుగా పెరుగు, నీళ్లు ఓ గిన్నెలో వేసి బాగా కలిపి పల్చని మజ్జిగలా చేసుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి అందులో మజ్జిగ వేయాలి. తరువాత బియ్యప్పిండి, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేయాలి. మజ్జిగ వేడయ్యాక బియ్యప్పిండి వేస్తూ, ఉండలు కట్టకుండా కలిపి స్టౌని కట్టేయాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే మరోసారి కలిపి... తరువాత చేతికి నూనె రాసుకుని చెగోడీల్లా చేసుకుని కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని తీసుకోవాలి. 


అటుకుల పొంగలి

కావలసినవి: అటుకులు: కప్పు, బెల్లం తరుగు: అరకప్పు, యాలకులపొడి: పావుచెంచా, ఎండుకొబ్బరిపొడి: రెండు టేబుల్‌స్పూన్లు, జీడిపప్పు-బాదంపలుకులు: పావుకప్పు, నెయ్యి: రెండు చెంచాలు.
తయారీవిధానం: అటుకుల్ని కడిగి నీళ్లు పిండి ఓ గిన్నెలోకి తీసుకుని, రెండు చెంచాల నీళ్లు చల్లి పెట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక జీడిపప్పు, బాదం పలుకులు వేయించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదే కడాయిలో అరకప్పు నీళ్లు, బెల్లం తరుగు వేయాలి. బెల్లం కరిగి ఉండపాకంలా అవుతున్నప్పుడు అటుకులు, కొబ్బరిపొడి, యాలకులపొడి వేయించుకున్న జీడిపప్పు-బాదంపలుకులు వేసి బాగా కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని