భిండీ మసాలా... వహ్వా!

సాయంత్రంపూట బిర్యానీ లేదా చపాతీల్లాంటివి చేసుకుంటే... వాటితోపాటూ ఏదో ఒక మసాలా కూర ఉంటేనే బాగుంటుంది. అలాగని ఏదో ఒకటి చేసుకోలేం కాబట్టి వాటికి కాంబినేషన్‌గా నప్పేవాటినే ఎంచుకుందామా...

Updated : 30 Apr 2022 15:55 IST

సాయంత్రంపూట బిర్యానీ లేదా చపాతీల్లాంటివి చేసుకుంటే... వాటితోపాటూ ఏదో ఒక మసాలా కూర ఉంటేనే బాగుంటుంది. అలాగని ఏదో ఒకటి చేసుకోలేం కాబట్టి వాటికి కాంబినేషన్‌గా నప్పేవాటినే ఎంచుకుందామా...


షాహీ భిండీ మసాలా

కావలసినవి: ఉల్లిపాయ: ఒకటి, టొమాటోలు: రెండు, వెల్లుల్లి రెబ్బలు: మూడు, అల్లం: చిన్నముక్క, నానబెట్టిన జీడిపప్పు, బాదం: రెండూ కలిపి పదిహేను, బెండకాయ పెద్ద ముక్కలు: ఒకటిన్నరకప్పు, నూనె: పావుకప్పు, దాల్చినచెక్క: చిన్నముక్క, లవంగాలు: రెండు, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, దనియాలపొడి: చెంచా, జీలకర్ర పొడి: పావు చెంచా, ఉప్పు: తగినంత, పెరుగు: పావుకప్పు, గరంమసాలా: పావుచెంచా, కసూరీమేథీ: చెంచా.

తయారీవిధానం: ముందుగా ఉల్లిపాయ-టొమాటో ముక్కలు, వెల్లుల్లిరెబ్బలు, దాల్చినచెక్క, లవంగాలు, అల్లం, జీడిపప్పు, బాదం మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. స్టౌమీద పాన్‌పెట్టి మూడు చెంచాల నూనె వేసి బెండకాయ ముక్కల్ని వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి, చేసిపెట్టుకున్న మసాలా వేసి బాగా వేయించాలి.  అయిదు నిమిషాలయ్యాక పసుపు, కారం, దనియాలపొడి, జీలకర్రపొడి, తగినంత ఉప్పు, కప్పు నీళ్లు పోసి స్టౌని సిమ్‌లో పెట్టాలి. ఈ కూర చిక్క బడుతున్నప్పుడు వేయించిన బెండకాయ ముక్కలు, పెరుగు, గరంమసాలా, కసూరీమేథీ వేసి బాగా కలిపి దింపేయాలి. 


మీల్‌మేకర్‌ కర్రీ

కావలసినవి: వెల్లుల్లిరెబ్బలు: మూడు, అల్లం: చిన్న ముక్క, టొమాటోలు: రెండు, జీడిపప్పు: ఎనిమిది, మీల్‌మీకర్‌: రెండుకప్పులు,  నూనె: పావుకప్పు, జీలకర్ర: చెంచా, పసుపు: పావుచెంచా, దాల్చినచెక్క: చిన్నముక్క, ఉల్లిపాయ: ఒకటి, ఉప్పు: తగినంత, కారం: చెంచా, దనియాలపొడి: చెంచా, పెరుగు:  పావుకప్పు, గరంమసాలా: పావుచెంచా.

తయారీవిధానం: మీల్‌మేకర్‌ మునిగేలా నీళ్లుపోసి పొయ్యిమీద పెట్టాలి. అయిదు నిమిషాలయ్యాక దింపేసి... ఆ నీటిని గట్టిగా పిండేసి వాటిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. స్టౌమీద పాన్‌పెట్టి చెంచా నూనె వేసి ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు వేయించాలి. అయిదు నిమిషాలయ్యాక స్టౌ కట్టేసి చల్లారనిచ్చి అన్నింటినీ మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. మళ్లీ స్టౌమీద బాణలి పెట్టి మిగిలిన నూనె వేసి, జీలకర్ర, దాల్చినచెక్క వేయించి, మీల్‌మేకర్‌ తప్ప మసాలాతోపాటూ మిగిలిన పదార్థాలు ఒక్కొక్కటిగా వేసుకుని కప్పు నీళ్లు పోయాలి. ఇది కూరలా అయ్యాక మీల్‌మేకర్‌ వేసి పది నిమిషాల తరువాత దింపేయాలి. 


పంజాబీ ధమ్‌ ఆలూ

కావలసినవి: ఉడికించిన బేబీ ఆలూ: పదిహేను, ఉల్లిపాయ: ఒకటి, పెరుగు: ముప్పావుకప్పు, బిర్యానీ ఆకు: ఒకటి, కారం: చెంచా, పసుపు: పావుచెంచా, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, దనియాలు: టేబుల్‌స్పూను, జీలకర్ర: అరచెంచా, యాలకులు: రెండు, దాల్చినచెక్క: చిన్న ముక్క, లవంగాలు: నాలుగు, జీడిపప్పు: పది, కసూరీమేథీ: అరటేబుల్‌స్పూను, చక్కెర: చెంచా, నూనె: అరకప్పు, కొత్తిమీర: కట్ట, ఉప్పు: తగినంత.

తయారీ విధానం: ముందుగా దనియాలు, జీలకర్ర, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, జీడిపప్పుని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. ఆలూ చెక్కుతీసి ఫోర్కుతో అక్కడక్కడా గాట్లు పెట్టుకోవాలి. స్టౌమీద పాన్‌ పెట్టి రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేసి వాటిని దోరగా వేయించి తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక అల్లంవెల్లుల్లిముద్ద, ముందుగా చేసుకున్న మసాలా, పెరుగు, పసుపు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక వేయించుకున్న ఆలూ, కసూరీమేథీ, చక్కెర, ముప్పావుకప్పు నీళ్లు పోయాలి. కూర చిక్కగా అయ్యాక కొత్తిమీర వేసి దింపేయాలి.


చెట్టినాడ్‌ చికెన్‌ కర్రీ

కావలసినవి: చికెన్‌: అరకేజీ,  బిర్యానీ ఆకు: ఒకటి, పసుపు: పావుచెంచా, కారం: పావుచెంచా, పెరుగు: టేబుల్‌స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద: చెంచా, ఉప్పు: తగినంత. మసాలాకోసం: గసగసాలు: టేబుల్‌స్పూను, కొబ్బరి తురుము: పావుకప్పు, దనియాలు: టేబుల్‌స్పూను, సోంపు: చెంచా, జీలకర్ర: ముప్పావుచెంచా, మిరియాలు: అరచెంచా,  ఎండుమిర్చి: అయిదు, యాలకులు: మూడు, లవంగాలు: నాలుగు, దాల్చినచెక్క: చిన్నముక్క, నూనె: అరకప్పు, ఉల్లిపాయ: ఒకటి, కరివేపాకు: రెండు రెబ్బలు, టొమాటోలు: రెండు.

తయారీ విధానం: చికెన్‌పైన పసుపు, కారం, పెరుగు, ఉప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి బాగా కలిపి గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇంతలో స్టౌమీద పాన్‌పెట్టి దనియాలు, ఎండుమిర్చి, యాలకులు, జీలకర్ర, సోంపు, మిరియాలు, దాల్చినచెక్క, లవంగాలు వేయించి స్టౌ కట్టేసి గసగసాలు వేయాలి. ఈ మసాలాతోపాటూ కొబ్బరితురుమును కూడా మిక్సీలో తీసుకుని నీళ్లు పోస్తూ ముద్దలా చేసుకుని తీసుకోవాలి. అదే మిక్సీలో టొమాటోలనూ ముద్దలా చేసుకోవాలి. స్టౌమీద పాన్‌పెట్టి నూనె వేసి బిర్యానీఆకు, ఉల్లిపాయముక్కలు వేయించి, చికెన్‌ని ఉంచాలి. అది వేగిందనుకున్నాక టొమాటో ముద్ద, మసాలా, కరివేపాకు, తగినంత ఉప్పు, కప్పు నీళ్లు పోయాలి. చికెన్‌ ఉడికి, కూర దగ్గరకు అవుతున్నప్పుడు దింపేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని