కేక్‌తో ఆహ్వానిద్దాం?

ఓ గిన్నెలో మైదా, ఉప్పు, చక్కెర తీసుకుని అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న, నూనె, చాక్లెట్‌పొడి, నీళ్లు తీసుకుని ...

Published : 26 Jun 2021 15:17 IST

చాక్లెట్‌ కేక్‌

కావలసినవి: మైదా: కప్పు, ఉప్పు: పావుచెంచా, చక్కెర: అరకప్పు, చాక్లెట్‌పొడి, వెన్న, నూనె,పెరుగు, నీళ్లు: పావుకప్పు చొప్పున, వెనిగర్‌, వెనిల్లా ఎసెన్స్‌: చెంచా చొప్పున,వంటసోడా: అరచెంచా. ఐసింగ్‌ కోసం: చాక్లెట్‌పొడి, వెన్న, పాలు: పావుకప్పు చొప్పున,బ్రౌన్‌షుగర్‌: అరకప్పు, వెనిల్లా ఎసెన్స్‌: చెంచా.
తయారుచేసే విధానం: కేక్‌పాన్‌కి కొద్దిగా వెన్న రాసుకుని పెట్టుకోవాలి.

* ఓ గిన్నెలో మైదా, ఉప్పు, చక్కెర తీసుకుని అన్నింటినీ కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో వెన్న, నూనె, చాక్లెట్‌పొడి, నీళ్లు తీసుకుని అన్నింటినీ కలిపి స్టవ్‌మీద సిమ్‌లో పెట్టాలి. ఇది చిక్కగా అయ్యాక దింపేసి మైదాలో వేయాలి. ఇంకో గిన్నెలో పెరుగు, పావుకప్పు నీళ్లు, వెనిగర్‌, వెనిల్లా ఎసెన్స్‌, వంటసోడా కలిపి మైదా మిశ్రమంలో వేసి... అన్నింటినీ బాగా కలిపి కేక్‌పాన్‌లోకి తీసుకోవాలి. 350 డిగ్రీల ఉష్ణోగ్రతలో ముందుగా వేడిచేసుకున్న ఒవెన్‌లో ఈ కేకు పాత్రను ఉంచి ముప్పైఅయిదు నుంచి నలభైనిమిషాల వరకూ బేక్‌ చేసుకుని తీసుకోవాలి. ఒవెన్‌ లేకపోతే... ఆరులీటర్ల కుక్కర్‌లో కప్పు ఉప్పు వేసి సన్నని మంటపై పెట్టాలి. కుక్కర్‌ వేడయ్యాక ఈ కేకు పాత్రను అందులో ఉంచి మూత పెట్టాలి. విజిల్‌ మాత్రం పెట్టకూడదు. నలభైఅయిదు నిమిషాలకు కేక్‌ తయారవుతుంది.
* ఇప్పుడు ఐసింగ్‌ తయారు చేసుకోవాలి. ఓ పాన్‌లో వెన్న, వెనిల్లా ఎసెన్స్‌, బ్రౌన్‌షుగర్‌, పాలు, చాక్లెట్‌పొడి తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యాక దింపేసి కేకుపై సమానంగా పరిస్తే చాలు.


తవా పులావ్‌

కావలసినవి: బాస్మతీ బియ్యంతో వండిన అన్నం: రెండు కప్పులు, వెన్న: రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం వెల్లుల్లి ముద్ద: చెంచా, టొమాటోలు: రెండు, క్యాప్సికం ముక్కలు: పావుకప్పు, బంగాళాదుంప: ఒకటి (ఉడికించి ముక్కల్లా తరగాలి), క్యారెట్‌ ముక్కలు: అరకప్పు, పచ్చిబఠాణీ: పావుకప్పు (ఈ రెండింటినీ ఉడికించుకోవాలి), పసుపు: పావుచెంచా, ఎండుమిర్చి ముద్ద: అరచెంచా, పావ్‌బాజీ మసాలా: రెండు చెంచాలు, జీలకర్ర: అరచెంచా, ఉప్పు: తగినంత, నిమ్మరసం: టేబుల్‌స్పూను, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు.
తయారుచేసే విధానం

* పొయ్యిమీద బాణలి పెట్టి వెన్న వేయాలి. అది కరిగాక జీలకర్ర వేయించాలి. నిమిషం అయ్యాక అల్లంవెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. టొమాటో ముక్కలు వేగాక పసుపు, ఎండుమిర్చి ముద్ద, పావ్‌బాజీ మసాలా, క్యాప్సికం, బంగాళాదుంప, క్యారెట్‌ ముక్కలు, పచ్చిబఠాణీ వేసి పావుకప్పు నీళ్లు పోయాలి. ఐదారు నిమిషాలయ్యాక అన్నం, ఉప్పు వేసి కలపాలి.
* రెండుమూడు నిమిషాల తరువాత నిమ్మరసం, కొత్తిమీర తరుగు కలిపి దింపేయాలి.


కొబ్బరి బిస్కెట్లు

కావలసినవి
కొబ్బరి తురుము: రెండు టేబుల్‌స్పూన్లు, గుడ్లు: నాలుగు, బియ్యప్పిండి: మూడు కప్పులు, చిక్కనిపాలు: మూడు కప్పులు, చక్కెర: రెండున్నర కప్పులు, ఉప్పు కలపని వెన్న: మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: పావుచెంచా, కొబ్బరిపాలు: చెంచా.
తయారుచేసే విధానం

* ముందుగా ఒవెన్‌ని 350 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసి పెట్టుకోవాలి.
* కేకు తయారు చేసే పాన్‌కి కొద్దిగా వెన్న రాసుకోవాలి. కొబ్బరి తురుమును దోరగా వేయించుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో గుడ్ల సొన వేసి బాగా కలపాలి.
* తరువాత మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని కలిపి కేక్‌ పాన్‌లోకి తీసుకోవాలి. ఇరవై అయిదు నిమిషాలు బేక్‌ చేసి తీసి, అరగంటయ్యాక ముక్కల్లా కోయాలి. కావాలనుకుంటే దీనిపై కొబ్బరితురుము అలంకరించుకోవచ్చు.


బీట్‌రూట్‌ టిక్కీ

కావలసినవి
సగ్గుబియ్యం: రెండుకప్పులు, ఉడికించిన బంగాళాదుంపలు: రెండు, బీట్‌రూట్‌: ఒకటి పెద్దది, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి తరుగు: రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, కారం: చెంచా, ఆమ్‌చూర్‌పొడి: చెంచా, నిమ్మరసం: చెంచా, వేయించిన పల్లీల పొడి: అరకప్పు, జీలకర్ర: చెంచా, నెయ్యి: పెద్ద చెంచా, నూనె: అరకప్పు.  
తయారుచేసే విధానం

* సగ్గుబియ్యాన్ని కడిగి నాలుగు గంటలసేపు నానబెట్టాలి. బీట్‌రూట్‌ చెక్కు తీసి ముక్కల్లా కోసి పావుగంటసేపు ఉడికించి, నీళ్లు వంపేసి తరువాత మెత్తగా చేసుకోవాలి. బాణలిని పొయ్యిమీద పెట్టి నెయ్యి వేసి జీలకర్ర వేయించి, బీట్‌రూట్‌ ముద్ద వేయాలి. అయిదు నిమిషాలయ్యాక ఆ ముద్దను ఓ గిన్నెలోకి తీసుకుని... నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని టిక్కీల్లా చేసుకోవాలి. పొయ్యిమీద పెనం పెట్టి రెండుమూడు టిక్కీలు ఉంచి, నూనె వేసుకుంటూ రెండువైపులా ఎర్రగా కాల్చుకుని తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవీ చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని