సొరుచుల సోనా...
ఇంటి మీద సొర తీగ పాకిందా పంట పండిందన్నమాటే! నవనవలాడే సొరకాయలను పప్పులో వేసుకోవచ్చుదప్పడంలా చేసుకోవచ్చుసాంబారు కాచుకోవచ్చు...పచ్చడి నూరుకోవచ్చుఅంతేనా... ఈ వెరైటీలు ట్రైచేయొచ్చు.
రొయ్యల కూర..
కావాల్సినవి: రొయ్యలు- పావుకేజీ, సొరకాయ ముక్కలు- కప్పు, ఉల్లిపాయ- ఒకటి, పచ్చిమిర్చి- రెండు, ఉప్పు- తగినంత, కరివేపాకు రెబ్బ- ఒకటి, పసుపు- పావు టీస్పూన్, అల్లంవెల్లుల్లి పేస్టు- టీస్పూన్, కారం- రెండు టీస్పూన్లు, ధనియాల పొడి- రెండు టీస్పూన్లు, గరంమసాలా- టీస్పూన్, ఎండుకొబ్బరి పొడి- టీస్పూన్, జీలకర్ర- కొద్దిగా, ఉప్పు- తగినంత, కొత్తిమీర తురుము- కొద్దిగా.
తయారీ: రొయ్యలకు కొద్దిగా పసుపు, ఉప్పు, కారం పట్టించి పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, రొయ్యలు, ఉప్పు వేసి వేయించాలి. ఇప్పుడు సొరకాయ ముక్కలు, ధనియాల పొడి, గరంమసాలా, ఎండుకొబ్బరి పొడి వేసుకుని బాగా కలిపి మూతపెట్టి తక్కువ మంట మీద పది నిమిషాలపాటు ఉడికించుకోవాలి. కూరలో నీళ్లు పోయనవసరం లేదు. సొరకాయ ముక్కల్లో ఉండే నీరే సరిపోతుంది. కూర దగ్గరకు వచ్చిన తర్వాత దించేసి చివరగా కొత్తిమీర తురుమును చల్లాలి.
పకోడి
కావాల్సినవి: సొరకాయ తురుము- కప్పు, సెనగపిండి- అరకప్పు, బియ్యప్పిండి- రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు- తగినంత, కారం- కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి- రెండు, అల్లం తురుము - టీస్పూన్, పసుపు- చిటికెడు, కొత్తిమీర తురుము- కొద్దిగా, నూనె- వేయించడానికి సరిపడా.
తయారీ: గిన్నెలో సొరకాయ తురుము, మిగిలిన పదార్థాలన్నింటినీ వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలపాలి. మిశ్రమం మరీ గట్టిగా, జారుగా ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడెక్కాక పకోడీలు వేసుకోవాలి.
పరాట
కావాల్సినవి: గోధుమపిండి- ఒకటిన్నర కప్పు, సొరకాయ తురుము- కప్పు, పాలకూర- కప్పు, బంగాళాదుంపలు- రెండు, కారం- టీస్పూన్, ధనియాల పొడి- టీస్పూన్, మిరియాల పొడి- పావు టీస్పూన్, వాము- టీస్పూన్, ఉప్పు- తగినంత, ఇంగువ- చిటికెడు.
తయారీ: బంగాళాదుంపలను ఉడికించి తొక్క తీసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. పాలకూరను కడిగి, సన్నగా తురిమి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి సొరకాయ తురుము, బంగాళాదుంపల ముద్ద, పాలకూర తీసుకోవాలి. దీంట్లోనే మిగతా అన్ని పదార్థాలను వేసుకుని ముద్దలా కలిపి పెట్టుకోవాలి. పిండిని కలపడానికి ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన పనిలేదు. సొరకాయ తురుములో ఉండే నీళ్లే సరిపోతాయి. ఇప్పుడీ మిశ్రమంతో ఉండలు చేసుకుని పరాటాల్లా ఒత్తుకోవాలి. తర్వాత పాన్ వేడిచేసి సరిపడినంత నూనె పోసి పరాటాలను రెండు వైపులా కాల్చుకోవాలి. పిండి ముద్దను కలిపిన వెంటనే పరాటాలు చేసుకోవాలి. లేకపోతే సొరకాయ తురుములోని నీళ్ల వల్ల మిశ్రమం పలుచగా మారుతుంది.
హల్వా
కావాల్సినవి: సొరకాయ- సగం ముక్క, పాలు- కప్పు, పంచదార- ముప్పావు కప్పు, నెయ్యి- టేబుల్ స్పూన్, జీడిపప్పు, బాదం, కిస్‌మిస్- రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి- చిటికెడు.
తయారీ: సొరకాయ ముక్క చెక్కు తీసి మధ్యలోకి కోసి విత్తనాలను తీసేయాలి. ఈ ముక్కలను సన్నగా తురిమి వీటి నుంచి నీటిని పిండేయాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి వేడిచేసి జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు అదే కడాయిలో సొరకాయ తురుము వేసి పదినిమిషాలపాటు పచ్చి వాసన పోయేంత వరకు దోరగా వేయించాలి. తర్వాత పంచదార వేసి కరిగేంత వరకు కలపాలి. ఆ తర్వాత వేడిపాలు లేదా కాచి చల్లార్చినవి పోసి తక్కువ మంట మీద దగ్గరకు వచ్చేంతవరకు కలపాలి. చివరగా చిటికెడు యాలకుల పొడి, జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌లను వేసి దించేయాలి. కొద్దిగా కోవా వేసుకుంటే హల్వా రుచికరంగా ఉంటుంది.
కోఫ్తాకర్రీ
కావాల్సినవి: సొరకాయ తురుము- కప్పు, ఉడికించిన బంగాళా దుంపలు- రెండు, సెనగపిండి- టేబుల్‌స్పూన్, కార్న్‌ఫ్లోర్- టీస్పూన్, తరిగిన ఉల్లిపాయ- ఒకటి, తరిగిన పచ్చిమిర్చి- రెండు, అల్లంవెల్లుల్లి పేస్టు- టీస్పూన్, కారం- కొద్దిగా, ఉప్పు- తగినంత, టమాటాపేస్టు- కప్పు, ధనియాల పొడి- టీస్పూన్, నూనె- వేయించడానికి సరిపడా, కొత్తిమీర- కొద్దిగా, జీలకర్రపొడి- టీస్పూన్.
తయారీ: ఉడికించిన బంగాళా దుంపలను మెత్తగా ముద్దలా చేసుకోవాలి. గిన్నెలో సొరకాయ తురుము, బంగాళాదుంపల ముద్ద, సెనగపిండి, కార్న్‌ఫ్లోర్, కొద్దిగా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసుకుని ముద్దలా కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని ఉండల్లా చేసుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి ఉండలను వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మరో కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడిచేయాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. దీంట్లో ఉప్పు, కారం, టమాటా పేస్టు, ధనియాల పొడి, జీలకర్రపొడి వేసి కాసేపు ఉడికించాలి. తర్వాత నీళ్లు పోసి ఈ మిశ్రమాన్ని అయిదు నిమిషాలపాటు తక్కువ మంట మీద ఉడికించాలి. దించాక సిద్ధంగా ఉన్న సొరకాయ ఉండలను కూరలో వేసుకోవాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించాలి.
సొరకాయ ప్రయోజనాలు
* పిండిపదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి మధుమేహులూ తీసుకోవచ్చు.
* సోడియం చాలా తక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలతో బాధపడేవాళ్లకు ఇది మంచి ఆహారం.
* రక్తప్రసరణ సవ్యంగా జరిగేలా చేస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సాయపడుతుంది.
* దీంట్లో ఎక్కువగా ఉండే విటమిన్-సి చర్మానికి నిగారింపును ఇస్తుంది.
* ఎసిడిటీ నివారణకు తోడ్పడుతుంది. సొరకాయ రసాన్ని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
* కప్పు సొరకాయ తురుములో సుమారు పదిహేడు కెలొరీలు మాత్రమే ఉంటాయి. కొవ్వులు దాదాపు 0.01 గ్రా., పీచు 2.9 గ్రా. ఉంటుంది. కాబట్టి అధిక బరువుతో బాధపడేవాళ్లు నిరభ్యంతరంగా దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.
* దీంట్లో ఉండే 90 శాతం నీరు అధిక దాహాన్ని, వేడిని తగ్గిస్తుంది. కాబట్టి వేసవిలో ఈ జ్యూస్‌ను తాగొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
పశ్చిమ అంటార్కిటికాలో 3 లక్షల టన్నుల మంచు మాయం
-
Education News
పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా?
-
Ts-top-news News
పసిపాప ఆకలి తీర్చేందుకు.. 10 కిలోమీటర్ల ప్రయాణం!
-
Crime News
vizag: విశాఖ రామజోగిపేటలో కూలిన మూడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
-
India News
కొంగ మీది బెంగతో.. యువరైతు కంటతడి
-
India News
వలస కూలీకి డ్రీమ్ 11తో రూ.కోటి జాక్‌పాట్