చికెన్‌ పచ్చడి పట్టేద్దాం..

చికెన్‌ ముక్కల్ని ఉప్పు, పసుపు వేసి కడిగి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె వేసి ముక్కల్ని కొంచెంకొంచెంగా వేసి మీడియం మంటమీద బాగా వేయించాలి. ..

Published : 27 Jun 2021 17:28 IST

చికెన్‌ పచ్చడి

కావలసినవి
బోన్‌లెస్‌ చికెన్‌: కిలో, కారం: కప్పు, ఉప్పు: ముప్పావు కప్పు, గసగసాలు: 3 టేబుల్‌స్పూన్లు, అల్లం: 50 గ్రా. వెల్లుల్లి: పావుకిలో, నిమ్మరసం: అరకప్పు, జీలకర్ర పొడి: టీస్పూను, మెంతిపొడి: టీస్పూను, జీలకర్ర: 2 టీస్పూన్లు, ఆవాలు: 2 టీస్పూన్లు, పసుపు: టీస్పూను, నూనె: సరిపడా, మసాలాకోసం: దనియాలు: 3 టేబుల్‌స్పూన్లు, లవంగాలు: ఆరు, దాల్చినచెక్క: రెండు అంగుళాలముక్క, యాలకులు: టీస్పూను, అనాసపువ్వు: ఒకటి(ఇవన్నీ బాణలిలో ఓ రెండు నిమిషాలు వేయించి చల్లారాక పొడి చేయాలి.), నూనె: అరకిలో

తయారుచేసే విధానం
* గసగసాలు వేయించాలి. మిక్సీలో వేసి మెత్తగా అయ్యాక అల్లంవెల్లుల్లి కూడా వేసి తిప్పాలి.
* చికెన్‌ ముక్కల్ని ఉప్పు, పసుపు వేసి కడిగి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె వేసి ముక్కల్ని కొంచెంకొంచెంగా వేసి మీడియం మంటమీద బాగా వేయించాలి. తరవాత బాణలిలో నాలుగైదు టేబుల్‌స్పూన్ల నూనె మాత్రమే ఉంచి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లిముద్ద, పసుపు, గరంమసాలా వేసి బాగా వేయించి చల్లారనివ్వాలి.
* ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో కారం, ఉప్పు, జీలకర్రపొడి, మెంతిపొడి వేసి కలపాలి. ఆరిన తరవాత వేయించిన పోపు, వేయించి పక్కన ఉంచిన చికెన్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. చివరగా నిమ్మరసం కూడా వేసి కలపాలి. మర్నాటికి ముక్క ఊరి బాగుంటుంది. పులుపు
సరిపోలేదనుకుంటే మరికాస్త నిమ్మరసం పిండుకుంటే సరి.

మటన్‌ పచ్చడి

కావలసినవి
మటన్‌ముక్కలు: పావుకిలో, ఉప్పు: తగినంత, మంచినీళ్లు: అరకప్పు, అల్లంతురుము: టేబుల్‌స్పూను, వెల్లుల్లి రెబ్బలు: 50 గ్రా., గసగసాలు: టేబుల్‌స్పూను, జీలకర్రపొడి: అరటీస్పూను, మెంతిపొడి: అరటీస్పూను, కారం: పావుకప్పు, నూనె: సుమారుగా కప్పు, మసాలాకోసం: దనియాలు: టేబుల్‌స్పూను, యాలకులు: రెండు, లవంగాలు: రెండు, అనాసపువ్వు: కొద్దిగా, దాల్చినచెక్క: అంగుళం ముక్క

తయారుచేసే విధానం
* మసాలాకోసం తీసుకున్నవన్నీ వేయించి పొడి చేసి ఉంచాలి.
* మటన్‌ముక్కల్ని కడిగి ఉప్పు, పసుపు జోడించి కుక్కర్‌లో వేసి నీళ్లు పోసి ఉడికించాలి.
* తరవాత బాణలిలో నూనె వేసి మటన్‌ ముక్కలు బాగా వేయించి తీయాలి. అందులోనే అల్లం వెల్లుల్లి, గసగసాల ముద్ద వేసి వేగనివ్వాలి. తరవాత మసాలాపొడి, పసుపు వేసి వేగాక వేయించి దించి చల్లారనివ్వాలి.
* ఓ గిన్నెలో ఉప్పు, కారం, మెంతిపొడి, జీలకర్రపొడి వేసి కలపాలి. తరవాత వేయించిన మటన్‌ ముక్కలు వేసి కలపాలి. ఇప్పుడు వేయించిన అల్లంవెల్లుల్లి- గసాలముద్ద, మసాలా మిశ్రమం వేసి కలపాలి. చివరగా నిమ్మరసం పిండితే సరి.

చేప పచ్చడి

కావలసినవి
చేపముక్కలు: అరకిలో, పసుపు: టీస్పూను, కారం: 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: అరకప్పు, ఆవాలు: అరటీస్పూను, మెంతులు: అరటీస్పూను, అల్లంవెల్లుల్లి: 2 టేబుల్‌స్పూన్లు, మిరియాలపొడి: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: ఐదు, కరివేపాకు రెబ్బలు: ఎనిమిది

తయారుచేసే విధానం
* చేపముక్కలకు టీస్పూను కారం, అరటీస్పూను మిరియాలపొడి, పావుటీస్పూను పసుపు, కొద్దిగా ఉప్పుపట్టించి సుమారు అరగంటసేపు నాననివ్వాలి.
* బాణలిలో నూనె వేసి చేపముక్కల్ని వేయించి తీయాలి. అడుగున కాస్త నూనె ఉంచి అందులో ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసి వేయించాలి. మిగిలిన కారం, మిరియాలపొడి, పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరవాత అందులో వేయించిన చేపముక్కలు వేసి కలపాలి.

రొయ్యల పచ్చడి

కావలసినవి
పొట్టు తీసిన రొయ్యలు: పావుకిలో, ఉప్పు: తగినంత, కారం: 2 టేబుల్‌స్పూన్లు, పసుపు: అరటీస్పూను, నూనె: సరిపడా, అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు: 2 రెబ్బలు, ఆవాలు: టీస్పూను, మెంతులు: టీస్పూను, గరంమసాలా: టీస్పూను

తయారుచేసే విధానం
* రొయ్యల్ని శుభ్రంగా కడిగి, కొద్దిగా ఉప్పు, టేబుల్‌స్పూను కారం, చిటికెడు పసుపు పట్టించి ఓ గంటసేపు నాననివ్వాలి.
* నాన్‌స్టిక్‌పాన్‌లో ఆవాలు, మెంతులు వేసి వేయించాలి. చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక రొయ్యలు వేసి అందులోని నీరంతా ఆవిరైపోయేవరకూ వేయించాలి. తరవాత వాటిని పక్కకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.
* మరో బాణలిలో కప్పు నూనె వేసి చిటపటమన్నాక అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. తరవాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేగాక మిగిలిన పసుపు, కారం, గరంమసాలా వేసి ఓ నిమిషం వేయించి చల్లారనివ్వాలి. తరవాత అందులో వేయించి తీసిన రొయ్యలు వేసి బాగా కలిపి నిమ్మరసం పిండి నిల్వ చేసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని