చికెన్‌ టిక్కా మసాలా తిన్నారా?

చికెన్‌ముక్కలకి నిమ్మరసం, పసుపు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, మసాలాలు అన్నీ పట్టించి నాలుగు గంటలపాటు నాననివ్వాలి. 

Published : 27 Jun 2021 19:47 IST

లెమన్‌ చికెన్‌  

కావలసినవి 
బోన్‌లెస్‌ చికెన్‌: అరకిలో, అల్లంవెల్లుల్లి: నాలుగు టీస్పూన్లు, పసుపు: టీస్పూను, జీలకర్ర పొడి: 2టీస్పూన్లు, దనియాలపొడి: 2 టీస్పూన్లు, కారం: టీస్పూను, నిమ్మరసం: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు:త‌గినంత, పెరుగు: కప్పు, నూనె: 2 టేబుల్‌స్పూన్లు 
తయారుచేసే విధానం 
* చికెన్‌ ముక్కలకు పెరుగు, పసుపు, ఉప్పు పట్టించి అరగంట పక్కన ఉంచాలి. బాణలిలో నూనె వేసి ముక్కలు వేయించాలి.  తరవాత అలలంవెల్లుల్లి వేసి ఓ నిమిషం వేగనివ్వాలి.  
* ఇప్పుడు పసుపు, దనియాల పొడి, జీలకర్ర పొడి గరంమసాలా,  కారం వేసి నూనె బయటకు వచ్చే వరకూ వేయించి చివరగా నిమ్మరసం పిండితే సరి.

చికెన్‌ టిక్కా మసాలా

కావలసినవి 
చికెన్‌ ముక్కలు: అరకిలో, నిమ్మరసంఅరకప్పు, అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను, పసుపు: అరటీస్పూను, చికెన్‌ మసాలా పొడి: టేబుల్‌స్పూను, టిక్కా మసాలా: టేబుల్‌స్పూను, పెరుగు: కప్పు, గ్రేవీకోసం: ఉల్లి ముక్కలు: కప్పు, టొమాటో ముక్కలు: రెండున్నర కప్పులు, వెల్లుల్లి ముద్ద: టీస్పూను, అల్లం వెల్లుల్లి : టేబుల్‌‌స్పూను, పచ్చిమిర్చినాలుగు, జీడిపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, మిరియాలు:టీస్పూను, యాలకులు: రెండు, గరంమసాలా: టీస్పూను, నూనె: అరకప్పు, పాలు: అరకప్పు, వెన్న: టేబుల్‌స్పూను, ప‌చ్చిమిర్చి: రెండు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు 
తయారుచేసే విధానం 
చికెన్‌ముక్కలకి నిమ్మరసం, పసుపు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, మసాలాలు అన్నీ పట్టించి నాలుగు గంటలపాటు నాననివ్వాలి. 
పెరుగుని పలుచని బట్టలో వేసి వడేయాలి. నీళ్లన్నీ పోయాక దీన్ని చికెన్‌ముక్కల్లో వేసి కలిపి మరో రెండు గంటలు నాననివ్వాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఓవెన్‌లో గ్రిల్‌ చేయడంగానీ 
స్కూయర్‌కి గుచ్చి మంటమీద కాల్చడంగానీ చేయాలి. 
* జీడిపప్పులో పాలు పోసి ముద్దలా రుబ్బాలి. 
బాణలిలో నూనె వేసి, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత మిరియాలపొడి, యాలకులు వేసి వేయించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి వేసి వేగాక టొమాటో ముక్కలు వేసి వేయించాలి. తరవాత జీడిపప్పు ముద్ద వేసి కలుపుతూ ఉడికించాలి. గ్రేవీ దగ్గరగా ఉడికిన తరవాత చికెన్‌ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి సిమ్‌లో రెండు నిమిషాలు ఉడికిన తరవాత గరంమసాలా, కొత్తిమీర తురుము వేసి కలిపి దించాలి.

కొబ్బరి చట్నీ చికెన్‌ ఫ్రై

కావలసినవి 
చికెన్‌: అరకిలో, ఉల్లిపాయలు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, ఎండుమిర్చి: రెండు, జీలకర్ర: అరటీస్పూను,పసుపు: రటీస్పూను, కారం: 2 టీస్పూన్లు, నిమ్మరసం: టీస్పూను, మంచినీళ్లు: కప్పు, ఉప్పు: రుచికి సరిపడా, 
కొబ్బరిచట్నీకోసం: కొబ్బరి తురుము: కప్పు, 
ఉల్లికాడలు: ఐదు, ఎండుమిర్చి: పది, కరివేపాకు: 3 రెబ్బలు, అల్లం: చిన్నముక్క, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: 2 టేబుల్‌స్పూన్లు 
తయారుచేసే విధానం 
* బాణలిలో టేబుల్‌స్పూను నూనె వేసి ఎండుమిర్చి, ఉల్లికాడలు, కొబ్బరి తురుము వేసి వేయించాలి. వీటికి అల్లం, కరివేపాకు జోడించి చట్నీలా రుబ్బాలి. 
* అదే బాణలిలో మిగిలిన నూనె వేసి జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత పసుపు, కారం, చికెన్‌ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మంచినీళ్లు పోసి ఉడికించాలి. చికెన్‌ముక్కలు బాగా ఉడికిన తరవాత కొబ్బరి చట్నీ వేసి కలిపి మూతపెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించి దించాక నిమ్మరసం పిండాలి.

సింధీ చికెన్‌ కూర

కావలసినవి 
చికెన్‌: అరకిలో, ఉల్లిపాయలు: రెండు, టొమాటోలు: రెండు, పచ్చిమిర్చి: మూడు, అల్లంముద్ద: 2 టీస్పూన్లు, 
వెల్లుల్లి ముద్ద: అరటీస్పూను, కొత్తిమీర తురుము: అరకప్పు, పసుపు: అరటీస్పూను, దనియాలపొడి: కటిన్నర టీస్పూన్లు, గరంమసాలా: అర టీస్పూను, పెరుగు: 3 టేబుల్‌స్పూన్లు, నూనె: పావుకప్పు, మంచినీళ్లు: అరకప్పు, ఉప్పు: రుచికి సరిపడా 
తయారుచేసే విధానం 
* బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము వేసి వేయించాలి. 
* టొమాటో ముక్కలు, పసుపు, కారం, దనియాలపొడి, గరంమసాలా వేసి వేయించాలి. టొమాటో ముక్కలు పూర్తిగా వేగాక చికెన్‌ ముక్కలు వేసి పది నిమిషాలు వేయించాలి. తరవాత ఉప్పు, పెరుగు వేసి కలిపి పది నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి సుమారు 20 నిమిషాలు ఉడికించి దించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని