పిల్లలు మెచ్చే చికెన్‌ స్నాక్స్‌!

జీడిపప్పుని వేయించి ఉంచాలి. నీళ్లలో ఉప్పు వేసి మరిగించాక నూడుల్స్‌ వేసి ఉడికించాలి. తరవాత నీళ్లు వంపేసి చల్లని నీళ్లతో కడిగి పక్కన ఉంచాలి. 

Published : 27 Jun 2021 14:57 IST

చైనీస్‌ చికెన్‌ నూడుల్స్‌

కావలసినవి 
బోన్‌లెస్‌ చికెన్‌: ముప్పావు కిలో, కార్న్‌ఫ్లోర్‌: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు, ఉప్పు: ముప్పావుటీస్పూను, నూనె: 4 టేబుల్‌స్పూన్లు, నూడుల్స్‌: పావుకిలో, వెల్లుల్లితురుము: టేబుల్‌స్పూను, ఎండుమిర్చి: మూడు, కాలీఫ్లవర్‌ రెమ్మలు: కప్పు, క్యాప్సికమ్‌ ముక్కలు:అరకప్పు, జీడిపప్పు: అరకప్పు, సాస్‌కోసం: వినెగర్‌: 2 టేబుల్‌స్పూన్లు, సోయాసాస్‌: టేబుల్‌స్పూను, చిల్లీసాస్‌: 3 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత 
తయారుచేసే విధానం 
జీడిపప్పుని వేయించి ఉంచాలి. నీళ్లలో ఉప్పు వేసి మరిగించాక నూడుల్స్‌ వేసి ఉడికించాలి. తరవాత నీళ్లు వంపేసి చల్లని నీళ్లతో కడిగి పక్కన ఉంచాలి. 
చికెన్‌ ముక్కల్ని కాసేపు ఆరనిచ్చాక వాటిమీద ఉప్పు, కార్న్‌ఫ్లోర్‌ చల్లాలి. బాణలిలో నూనె పోసి కాగాక కొంచెంకొంచెంగా చికెన్‌ ముక్కలు వేసి వేయించి తీయాలి. తరవాత మిగిలిన నూనె వంపేసి మూడు టేబుల్‌స్పూన్లు మాత్రం ఉంచాలి. ఇప్పుడు అందులో వెల్లుల్లి తురుము, ఎండుమిర్చి వేసి వేగాక కాలీఫ్లవర్‌ రెమ్మలు, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి వేయించాలి. తరవాత చికెన్‌ ముక్కలు వేసి, మూడు నాలుగు నిమిషాలు వేయించాక సాస్‌కోసం తీసుకున్నవన్నీ వేసి కలపాలి. ఇప్పుడు ఉడికించిన నూడుల్స్‌ కూడా వేసి బాగా కలపాలి. చివరగా వేయించిన జీడిపప్పు వేసి, ఇష్టమైతే కాస్త ఉల్లికాడల తురుము, నువ్వులు చల్లి దించాలి.


పెప్పర్‌ చికెన్‌

కావలసినవి 
చికెన్‌: అరకిలో, అల్లంవెల్లుల్లి: 3 టేబుల్‌స్పూన్లు, పసుపు: టీస్పూను, ఉప్పు: సరిపడా, ఉల్లిపాయ ముక్కలు: కప్పు, మిరియాలపొడి: ఒకటిన్నర టీస్పూన్లు, కారం: 4 టీస్పూన్లు, గరంమసాలా: టీస్పూను, కరివేపాకు: కట్ట, జీలకర్ర: అరటీస్పూను, యాలకులు:మూడు, దాల్చినచెక్క: అంగుళం ముక్క, లవంగాలు: నాలుగు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు 
తయారుచేసే విధానం 
చికెన్‌ ముక్కలకి కాస్త ఉప్పు, టేబుల్‌స్పూను అల్లంవెల్లుల్లి, పసుపు పట్టించి పక్కన ఉంచాలి. 
నాన్‌స్టిక్‌ పాన్‌లో జీలకర్ర, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. తరవాత మిగిలిన అల్లంవెల్లుల్లి వేసి వేగాక ఉల్లిముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. కారం, గరంమసాలా, కచ్చాపచ్చాగా దంచిన మిరియాలపొడి వేసి నూనె బయటకు వచ్చేవరకూ వేయించాలి. ఇప్పుడు చికెన్‌ ముక్కలు కూడా మరో నాలుగు నిమిషాలు వేయించి, మూతపెట్టి ముక్క పూర్తిగా ఉడికేవరకూ ఉంచి దించాలి.


చికెన్‌ పాప్‌కార్న్‌

కావలసినవి 
చికెన్‌ముక్కలు: పావుకిలో, కార్న్‌ఫ్లోర్‌: 2 టేబుల్‌స్పూన్లు, గుడ్డు: ఒకటి, బ్రెడ్‌ పొడి: కప్పు, ఉప్పు: తగినంత, అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను, మిరియాలపొడి: పావుటీస్పూను, కారం: 2 టీస్పూన్లు, గరంమసాలా: టీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా 
తయారుచేసే విధానం 
ఓ గిన్నెలో కారం, మిరియాలపొడి, అల్లంవెల్లుల్లి, మసాలా పొడి, ఉప్పు వేసి కలపాలి. 
చికెన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. వీటిమీద కారం మిశ్రమం చల్లి ముక్కలకి పట్టేలా బాగా కలపాలి. తరవాత కార్న్‌ఫ్లోర్‌ కూడా వేసి కలపాలి. ఇప్పుడు విడిగా ఓ గిన్నెలో గుడ్డు తెల్లసొన, మరో గిన్నెలో బ్రెడ్‌ పొడి వేయాలి. ఒక్కోముక్కనీ తెల్లసొనలో ముంచి బ్రెడ్‌పొడిలో దొర్లించి తీయాలి. ఇలాగే అన్నీ చేయాలి. ముక్కలు బాగా కరకరలాడాలంటే మరోసారి గుడ్డుసొనలో ముంచి బ్రెడ్‌ పొడి అద్దాలి. వీటిని ఓ పావుగంటసేపు పక్కన ఉంచాలి. 
బాణలిలో నూనె వేసి కాగాక కొంచెం కొంచెంగా చికెన్‌ ముక్కలు వేసి వేయించి తీయాలి.


చికెన్‌ 65

కావలసినవి 
బోన్‌లెస్‌ చికెన్‌: పావుకిలో, అల్లం తురుము: టీస్పూను, వెల్లుల్లితురుము: టీస్పూను, నిమ్మరసం: టేబుల్‌స్పూను, పెరుగు: టేబుల్‌స్పూను, గుడ్డు: ఒకటి, కరివేపాకు: 4 రెబ్బలు, పసుపు: చిటికెడు, మిరియాలపొడి: అరటీస్పూను, ఉప్పు: 
తగినంత, బియ్యప్పిండి: 2 టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: టీస్పూను, వెల్లుల్లి: టీస్పూను, పచ్చిమిర్చి: రెండు, కారం: టీస్పూను, పెరుగు: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: వేయించడానికి సరిపడా 
తయారుచేసే విధానం 
ఓ గిన్నెలో అల్లం, వెల్లుల్లి తురుము, నిమ్మరసం, పెరుగు, గుడ్డుసొన, పసుపు, మిరియాలపొడి, ఉప్పు, బియ్యప్పిండి అన్నీ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చికెన్‌ ముక్కలకు పట్టించి కనీసం ఓ గంటసేపు నాననివ్వాలి. 
బాణలిలో నూనె వేసి కాగాక, చికెన్‌ ముక్కల్ని వేయించి తీయాలి. తరవాత అందులోని నూనెని వంపేసి ఓ రెండు టేబుల్‌స్పూన్లు మాత్రం ఉంచి, జీలకర్ర, వెల్లుల్లి తురుము, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు కారం, పెరుగు కూడా వేసి కలిపి ఓ నిమిషం తరవాత వేయించిన చికెన్‌ ముక్కల్ని వేసి మీడియం మంట మీద ఓ రెండు నిమిషాలు ఉంచి తీయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు