vegetarian: చైనీస్‌ వంటలు.. తింటే వదలరిక..

చైనీస్‌ వంటలు.. అనగానే కంగారుపడిపోతూ ‘మాకొద్దు బాబోయ్‌.. మేం పక్కా శాకాహారులం’ అనేస్తారా? నిజానికి వాళ్ల వంటల్లోనూ కమ్మటి శాకాహార రుచులెన్నో ఉన్నాయి.

Published : 07 Jul 2024 00:41 IST

చైనీస్‌ వంటలు.. అనగానే కంగారుపడిపోతూ ‘మాకొద్దు బాబోయ్‌.. మేం పక్కా శాకాహారులం’ అనేస్తారా? నిజానికి వాళ్ల వంటల్లోనూ కమ్మటి శాకాహార రుచులెన్నో ఉన్నాయి. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలకు బదులుగా మచ్చుకు కొన్ని తిని చూస్తేచాలు.. మళ్లీమళ్లీ ఇవే కావాలంటారు. వీటినెలా చేయాలో తెలుసుకుందామా.


చిల్లీ పొటాటో

కావలసినవి: బంగాళదుంపలు - అర కిలో, నూనె - వేయించేందుకు సరిపడా ఫస్ట్‌ కోటింగ్‌: చిల్లీ పౌడర్‌ - 2 చెంచాలు, రెడ్‌ చిల్లీ, వెల్లుల్లి పేస్టు - చెంచా చొప్పున, మైదా, మొక్కజొన్న పిండి - 3 టేబుల్‌స్పూన్ల చొప్పున, ఉప్పు - తగినంత సెకెండ్‌ కోటింగ్‌: మైదా, మొక్కజొన్న పిండి - ముప్పావు కప్పు చొప్పున, మిరియాల పొడి - పావు చెంచా, నీళ్లు - పావు కప్పు సాస్‌ కోసం: నూనె - 2 టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి తరుగు - టేబుల్‌స్పూన్, వెనిగర్, రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్, మొక్కజొన్న పిండి - చెంచా చొప్పున, తెల్ల నువ్వులు - 3 టేబుల్‌స్పూన్లు,  తేనె - 3 టేబుల్‌స్పూన్లు, సోయా సాస్‌ - 2 చెంచాలు, టొమాటో కెచప్‌ - 2 టేబుల్‌స్పూన్లు, రెడ్‌ చిల్లీ పేస్టు - 2 చెంచాలు, నీళ్లు - పావు కప్పు, ఉల్లి కాడల తరుగు - 2 టేబుల్‌స్పూన్లు, మిరియాల పొడి - అర చెంచా.

తయారీ: బంగాళదుంపల చెక్కు తీసి, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌లా సన్నగా, నిలువుగా ముక్కలు కోసి, నీళ్లలో వేసి, తీయాలి. ఒక పాత్రలో మైదా, మొక్కజొన్న పిండి, ఉప్పు, చిల్లీ పౌడర్, రెడ్‌ చిల్లీ, వెల్లుల్లి పేస్టు వేసి కలిపి.. బంగాళదుంప ముక్కలకు ఒక కోటింగ్‌ పట్టించాలి. కడాయిలో నూనె కాగనిచ్చి.. ఈ ముక్కలను విడతలవారీగా రెండుసార్లు వేయించాలి. ఒకేసారి పూర్తిగా వేగకూడదు. ఇవి చల్లారేలోగా.. మొదటి కోటింగ్‌ కోసం కలిపిన పాత్రలో నీళ్లు, మైదా, మొక్కజొన్న పిండి, మిరియాల పొడి వేసి కలపాలి. సగం వేగిన ముక్కలకు ఈ మిశ్రమంతో రెండో కోటింగ్‌ ఇచ్చి, మరోసారి నూనెలో వేయించాలి. తర్వాత పాన్‌లో 2 టేబుల్‌స్పూన్ల నూనె వేడిచేసి.. వెల్లుల్లి తరుగును కాస్త వేయించి అందులో రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్, తెల్ల నువ్వులు వేయాలి. ఇప్పుడు వెనిగర్, సోయా సాస్‌ టొమాటో కెచప్, తేనె, రెడ్‌ చిల్లీ పేస్టు జతచేయాలి. మొక్కజొన్న పిండిని పావు కప్పు నీళ్లతో కలిపి.. దీన్ని పాన్‌లో పోసి కలియబెట్టాలి. చిక్కగా అయ్యాక.. బంగాళదుంప ఫింగర్స్, ఉల్లి కాడల తరుగు, మిరియాల పొడి వేసి కలియ తిప్పి అర నిమిషం తర్వాత దించేయాలి. పైన ఇంకొన్ని తెల్ల నువ్వులు, ఉల్లికాడల తరుగు చల్లితే చాలు నోరూరించే చిల్లీ పొటాటో సిద్ధం.


బేబీకార్న్‌ మంచూరియన్‌ గ్రేవీ

కావలసినవి: బేబీకార్న్‌-250 గ్రా., మొక్కజొన్న పిండి- 2 టేబుల్‌ స్పూన్లు, మిరియాల పొడి-పావు టీస్పూన్, ఉప్పు-తగినంత, నూనె- వేయించడానికి సరిపడా.

గ్రేవీ కోసం: నువ్వుల నూనె- 2 టేబుల్‌స్పూన్లు, అల్లం, వెల్లుల్లి తురుము- 2 టీస్పూన్లు, ఉల్లికాడ తరుగు- పావు కప్పు, టొమాటో కెచప్‌- 2 టేబుల్‌స్పూన్లు, సోయా సాస్‌- టేబుల్‌స్పూన్, నీళ్లు, ఉప్పు - తగినంత, మిరియాల పొడి, పంచదార - పావు టీస్పూన్‌ చొప్పున, వెనిగర్‌- అర టీస్పూన్, కొంచెం నీటిలో రెండు టేబుల్‌స్పూన్ల మొక్కజొన్న పిండిని కలిపి పక్కన ఉంచాలి.

బేబీకార్న్‌ వేయించడానికి: బేబీకార్న్‌ను రెండు మూడు ముక్కలుగా కోసుకోవాలి. చిన్నగా ఉంటే అలాగే ఉంచేయాలి. వెడల్పాటి గిన్నెలో బేబీకార్న్‌ వేసి మిరియాల పొడి, ఉప్పు, కొంచెం మొక్కజొన్న పిండి మిశ్రమం వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె వేడిచేసి మధ్యస్థంగా ఉండే మంట మీద బేబీకార్న్‌ వేయించాలి. ఒకపక్క వేగిన తర్వాత రెండో వైపు తిపి.. బంగారువర్ణంలోకి మారేంత వరకూ వేయించి తీసేయాలి.

తయారీ: మరో కడాయిలో కొద్దిగా నూనె పోసి వేడిచేసి కొంచెం అల్లం, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాలి. తర్వాత ఉల్లికాడ, క్యాప్సికం తరుగు వేయాలి. ముందుగా ఎక్కువ మంట మీద, తర్వాత మంట తగ్గించి కాసేపు వేయించాలి. తర్వాత రెండు కప్పుల నీళ్లు బాగా కలిపి మధ్యస్థంగా ఉండే మంట మీద కాసేపు ఉడికించి తర్వాత మంట తగ్గించాలి. ఇప్పుడు మిగిలిన మొక్కజొన్న పిండి మిశ్రమం వేసి ఉండలు లేకుండా కలపాలి. కొంచెం ఉప్పు, మిరియాల పొడి, పంచదార జతచేయాలి. చివరగా రుచి చూసి దింపేయడమే.


స్టఫ్‌డ్‌ చైనీస్‌ ఎగ్‌ప్లాంట్‌

కావలసినవి: పొడుగ్గా, పెద్దగా ఉండే వంకాయలు - 8, టోఫూ - పావుకిలో, పుట్టగొడుగులు టొమాటోలు మొదలైనవి - పావు కిలో, ఉప్పు - తగినంత, ఉల్లి, అల్లం, వెల్లుల్లితో తయారైన సాస్‌ - టేబుల్‌స్పూన్, నువ్వుల నూనె - 4 టేబుల్‌స్పూన్లు, మొక్కజొన్న పిండి - ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు, సోయాసాస్‌ - 2 టేబుల్‌స్పూన్లు, బ్రౌన్‌ షుగర్, వెల్లుల్లి తరుగు - 2 చెంచాలు, చిల్లీ సాస్, అల్లం తరుగు - చెంచా చొప్పున, మిరియాలు - పావు చెంచా, క్యారెట్‌ తురుము - చారెడు, ఉల్లిపాయ, ఎర్ర క్యాప్సికం - ఒక్కొకటి, ఉల్లికాడలు - 4, పచ్చిమిర్చి ముక్కలు - గార్నిష్‌ చేసేందుకు.

తయారీ: ఉల్లిపాయ, క్యాప్సికంలను సన్నగా తరగాలి. టోఫూను గరిటెతో నొక్కి.. అందులో ఉన్న నీళ్లను తీసేసి పక్కనుంచాలి. వంకాయలకు ఫోర్క్‌తో గాట్లు పెట్టి కాస్త ఉప్పు రాసి.. రెండు నిమిషాలు అవెన్‌లో వేడి చేయాలి. తర్వాత బయటకు తీసి తిరగేసి ఇంకో రెండు నిమిషాలు వేడి చేయాలి. లేదంటే నీళ్లలో ఐదారు నిమిషాలపాటు ఉడికించవచ్చు. మిక్సింగ్‌ బౌల్‌లో సాస్‌లన్నింటినీ వేసి కలపాలి. పాన్‌లో నూనె కాగనిచ్చి..ఉల్లి, అల్లం, వెల్లుల్లి, క్యాప్సికం, పుట్టగొడుగులు టొమాటో ముక్కలను రెండు నిమిషాలు వేయించాలి. అందులో టోఫూ, క్యారెట్‌ తురుము, మిరియాలు వేసి నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలి. సాస్‌ మిశ్రమాన్ని జోడించి, ఇంకో రెండు నిమిషాలుంచి దించేయాలి. వంకాయలను అంచులు తెగిపోకుండా సగానికి చీల్చి.. ఈ మిశ్రమాన్ని తగినంత కూరి.. కొద్దిగా ఉల్లి కాడలు, పచ్చిమిర్చి ముక్కలను పైన చల్లితే సరిపోతుంది.


షెజ్వాన్‌ పనీర్‌

కావలసినవి: పనీర్‌ ముక్కలు- 250 గ్రాములు, నువ్వులనూనె- టేబుల్‌స్పూన్, అల్లం, వెల్లుల్లి తురుము- 2 టీస్పూన్లు, క్యాప్సికం ముక్కలు - ముప్పావు కప్పు, పచ్చిమిర్చి చీలికలు- 2, షెజ్వాన్‌ సాస్‌- 2 టేబుల్‌ స్పూన్లు, సోయాసాస్‌- అరటీస్పూన్, మిరియాల పొడి,  పంచదార- అరటీస్పూన్, నీళ్లు-కప్పు, ఉప్పు-తగినంత, మొక్కజొన్నపిండి - 3 టీస్పూన్లు, ఉల్లికాడ తరుగు- 2 టేబుల్‌స్పూన్లు.

తయారీ: మొక్కజొన్న పిండిని సరిపడా నీళ్లలో కలిపి పక్కనుంచాలి. కడాయిలో నువ్వుల నూనె పోసి వేడిచేసి, అల్లం వెల్లుల్ని పేస్టు వేసి మధ్యస్థంగా ఉండే మంట మీద వేయించాలి. ఇప్పుడు ఉల్లికాడ, క్యాప్సికం తరుగు, పచ్చిమిర్చి జతచేసి వేయించాలి. చివరగా షెజ్వాన్, సోయా సాస్, మిరియాల పొడి వేసి బాగా కలిపి దించేయాలి

గ్రేవీ కోసం: కప్పు నీళ్లలో పంచదార, నువ్వుల నూనె, ఉప్పు వేసి మరిగించాలి. ఇప్పుడు మంట తగ్గించి.. నీళ్లు కలిపిన మొక్కజొన్న పిండిని వేసి ఉండలు లేకుండా కలిపి నాలుగైదు నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు పనీర్‌ ముక్కలు వేసి స్టౌఆఫ్‌ చేయాలి. ఉల్లికాడ తరుగు వేసి దించేయాలి. ఇది ఫ్రైడ్‌ రైస్, వెజ్‌ నూడుల్స్‌లోకి చాలా బాగుంటుంది.


బెల్‌

కావలసినవి: నూడుల్స్‌- 2 కప్పులు, మొక్కజొన్న పిండి- 2 స్పూన్లు, నీళు ్ల- మూడు కప్పులు, నూనె: వేయించడానికి సరిపడా. క్యాబేజీ తురుము - అరకప్పు, క్యారెట్‌ తురుము - ముప్పావు కప్పు, ఉల్లికాడల తరుగు- పావు కప్పు, రెడ్‌ చిల్లీసాస్‌ - టేబుల్‌ స్పూన్, టొమాటో కెచప్‌- 2 టేబుల్‌ స్పూన్లు, సోయా సాస్‌- అర టేబుల్‌ స్పూన్, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - పావు టీస్పూన్, టొమాటోలు- పావుకప్పు, వేయించిన పల్లీలు- 2 టేబుల్‌ స్పూన్లు, చాట్‌ మసాలా- పావు టీస్పూన్, ఉప్పు-పావు టీస్పూన్, నిమ్మరసం- పావు టీస్పూన్, కొత్తిమీర తరుగు- కొద్దిగా.

తయారీ: నీటిలో కొద్ది ఉప్పు, రెండు చుక్కల నూనె వేసి మరిగించాలి. ఇప్పుడు మంట తగ్గించి నూడుల్స్‌ వేసి మెత్తగా కాకుండా ఉడికించాలి. తర్వాత చన్నీళ్లు పోస్తే పొడిగా అయితాయి. వీటిని పెద్ద ప్లేటులో వేసి చల్లారనివ్వాలి. తర్వాత వీటి మీద మొక్కజొన్న పిండి చల్లి బాగా కలపాలి. కడాయిలో నూనె వేడిచేసి నూడుల్స్‌ బంగారు రంగులోకి వచ్చేవరకూ వేయించాలి. వీటిని స్టీల్‌ ఫిల్టర్‌లో వేసి నూనె వడకట్టి టిష్యూ పేపర్‌ మీద వేస్తే నూనె లేకుండా కరకరలాడతాయి. చల్లారిని తర్వాత గాలి తగలకుండా డబ్బాలో పెట్టాలి.

కూరగాయలను సన్నగా తరిగి ఉంచాలి. కడాయిలో నూనె పోసి వేడిచేసి తురిమిన ఉల్లితరుగు వేసి కాస్త  వేయించాలి. తర్వాత క్యాబేజీ, క్యారెట్లు జతచేసి బాగా కలిపి.. మధ్యస్థంగా ఉండే మంట మీద ఐదు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు మంట తగ్గించి రెడ్‌చిల్లీ సాస్, టొమాటో కెచప్, సోయా సాస్‌ వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి మంట తగ్గించాలి.

నూడుల్స్‌ను విరిచి, వెడల్పాటి పాత్రలో వేసి.. వాటికి వేయించిన కూరగాయ ముక్కలను కలపాలి. తర్వాత చిన్నగా కోసిన టొమాటో ముక్కలు, వేయించిన పల్లీలు జతచేయాలి. ఇప్పుడు చాట్‌ మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి, పైన కొత్తమీర తురుము చల్లాలి. ఇన్‌స్టెంట్‌ నూడుల్స్‌తోనూ దీన్ని ప్రయత్నించొచ్చు. ఉడికించిన నూడుల్స్‌ను బాగా చల్లారిన తర్వాతే వేయించాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని