పండగ చేసుకుందాం క్రిస్‌‌మస్త్‌గా...

డిసెంబరు అంటే...  మిణుకుమిణుకు తారలు. శాంతాక్లాజ్‌ సందళ్లు.. మంచుముద్దల కౌగిళ్లు. క్రిస్‌మస్‌ వంటకాల ఘుమఘుమలు... ఈసారి సంప్రదాయ, ఆధునిక వంటకాల కలబోతతో పండగ చేసుకుని హ్యాపీహ్యాపీ క్రిస్‌మస్‌... మెర్రీమెర్రీ క్రిస్‌మస్‌ అనుకుందామా!

Updated : 08 Dec 2022 20:12 IST

డిసెంబరు అంటే...  మిణుకుమిణుకు తారలు. శాంతాక్లాజ్‌ సందళ్లు.. మంచుముద్దల కౌగిళ్లు. క్రిస్‌మస్‌ వంటకాల ఘుమఘుమలు... ఈసారి సంప్రదాయ, ఆధునిక వంటకాల కలబోతతో పండగ చేసుకుని హ్యాపీహ్యాపీ క్రిస్‌మస్‌... మెర్రీమెర్రీ క్రిస్‌మస్‌ అనుకుందామా!

జింగిల్‌ బెల్స్‌- షార్ట్‌బ్రెడ్‌ బైట్స్‌

కావాల్సినవి: మైదా- రెండున్నర కప్పులు, పంచదార- అరకప్పు, బటర్‌- రెండు చెంచాలు, షుగర్‌ బాల్స్‌ లేదా స్ప్రింకిల్స్‌- నాలుగు చెంచాలు

తయారీ: అవెన్‌ని 325 డిగ్రీల దగ్గర ముందుగానే వేడిచేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఫుడ్‌ ప్రాసెసర్‌లో ముందుగా మైదా, పంచదార వేసి రెండూ ఒకదానితో ఒకటి బాగా కలవనివ్వాలి. బటర్‌ కూడా వేస్తే పిండి దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ప్రాసెసర్‌లో నుంచి పిండి ముద్దను తీసేసి అందులో రంగురంగుల షుగర్‌ బాల్స్‌ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక వ్యాక్స్‌ పేపర్‌పై ఉంచి అంగుళం మందంతో పిండిని దీర్ఘచతురస్రాకారంలో పరుచుకోవాలి. ఇలా పరిచిన పిండిని ఫ్రిజ్‌లో ఓ ఇరవైనిమిషాల పాటు ఉంచి చిన్నచిన్న చతురస్రాకారపు బిస్కెట్లుగా కత్తిరించుకోవాలి. వీటిని అవెన్‌లో 20 నిమిషాల పాటు వేడిచేసుకుంటే షార్ట్‌బ్రెడ్స్‌ సిద్ధం.

క్రిస్‌మస్‌ ట్రీ

కావాల్సినవి: బటర్‌- రెండు చెంచాలు, పంచదార- ఒకట్నిరకప్పు, కార్న్‌సిరప్‌- అరకప్పు, బేకింగ్‌ సోడా- పావుచెంచా, ఉప్పు- చిటికెడు, ఫుడ్‌కలర్‌- పచ్చరంగుది తగినంత, వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్‌- పావుచెంచా, బేకింగ్‌సోడా- చెంచా, పాప్‌కార్న్‌- ఎనిమిది కప్పులు, షుగర్‌బాల్స్‌- రెండు చెంచాలు, స్టార్‌ ఆకారంలో కత్తిరించిన చీజ్‌- ఒకటి.

తయారీ: తక్కువ మంట మీద ఒక పాత్రలో బటర్‌ని కరిగించుకోవాలి. దీనిలో పంచదార, కార్న్‌సిరప్‌, ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా మంట పెంచుకుని పంచదార అంతా పూర్తిగా కరగనివ్వాలి. చివరిగా పచ్చరంగు కూడా వేయాలి. కానీ పూర్తిగా గరిటెతో కలిపేయకూడదు. ఒక్క ఐదు నిమిషాలపాటు తక్కువ మంట మీద ఉంచి దించేసి వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్‌, బేకింగ్‌ సోడా కలుపుకోవాలి. ఆ వెంటనే ఆ మిశ్రమాన్ని పాప్‌కార్న్‌పై వేసి రంగు కలిసేటట్టుగా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ షీట్‌పై వేసుకుని క్రిస్‌మస్‌ట్రీ మాదిరిగా అమర్చుకోవాలి. వేడిచల్లారక ముందే దీనిపై రంగురంగుల ఘుగర్‌బాల్స్‌ చల్లుకోవాలి. చిటారుకొమ్మపైన చీజ్‌ని స్టార్‌ మాదిరిగా కత్తిరించుకుని అలంకరించుకోవాలి.

ఎగ్‌నాగ్‌

గుడ్లు- ఆరు, పంచదార- కప్పు, ఉప్పు- అర చిటికెడు, హోల్‌మిల్క్‌- నాలుగు కప్పులు,  వెనిల్లా- చెంచా, తాజాగా తీసుకున్న నట్‌మెగ్‌పొడి- అరచెంచా, విప్పింగ్‌ క్రీం- కప్పు,

తయారీ: ఒక పాత్రలో గుడ్లు, పంచదార, ఉప్పు వేసి బాగా గిలక్కొట్టి పెట్టాలి. మొత్తం ఒకదానితో ఒకటి కలిసాక మీ దగ్గరున్న పాలల్లో సగం పాలను తీసుకుని నెమ్మదిగా వేసుకుంటూ మళ్లీ కలుపుకోవాలి. ఇప్పుడు పాత్రను తక్కువ మంట మీద పెట్టి, పై మిశ్రమాన్ని మరిగించకుండా దగ్గరకు వచ్చేంతవరకూ కదుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని దించి అందులో వెనిల్లా ఎక్స్‌ట్రాక్ట్‌, దంచిన నట్‌మెగ్‌ పొడి తక్కిన పాలు కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడుగంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. సర్వ్‌చేసే ముందు విప్ప్‌డ్‌ క్రీంని గిలక్కొట్టి వేసి పైన నట్‌మెగ్‌ చల్లుకుంటే సరిపోతుంది.

మలబార్‌ పిడి

కావాల్సినవి: వేడినీళ్లు- కప్పు, బియ్యప్పిండి- అరకప్పు, ఉప్పు- రుచికి తగినంత,

తయారీ: ఒక పాన్‌లో నీళ్లు అందులో తగినంత ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఇందులో బియ్యప్పిండి వేసి ఉండ కట్టకుండా కలుపుతూ దగ్గరకు వచ్చేంతవరకూ ఉండాలి. పొయ్యి కట్టేసి బియ్యప్పిండి చల్లారేంత ఉంచాలి. పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకుని బొటనవేలితో ఒత్తుతూ చిన్నచిన్న బిళ్లలుగా చేసుకోవాలి. ఈ పిడిని కొబ్బరి వేసి వండిన వేడివేడి చికెన్‌తో తింటే భలే రుచిగా ఉంటుంది.

కల్లప్పమ్‌

మలయాళీలు బియ్యప్పిండి, కొబ్బరికోరు, కల్లు(నీరా) పోసి చేసే  కల్లప్పమ్‌ వంటకాన్ని క్రిస్‌మస్‌ రోజు అల్పాహారంగా తప్పనిసరిగా చేసుకుని తింటారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని