వెలుగుల పండక్కి... కొబ్బరి బర్ఫీ!

దీపావళి రోజున టపాసులు కాల్చడంతోపాటూ చేసుకునే వంటకాలు కూడా రకరకాల రుచుల్లో ఉంటేనే బాగుంటుంది కదూ... ఆలస్యమెందుకు, వీటిని చూసేయండోసారి.

Published : 26 Jun 2021 09:52 IST

దీపావళి రోజున టపాసులు కాల్చడంతోపాటూ చేసుకునే వంటకాలు కూడా రకరకాల రుచుల్లో ఉంటేనే బాగుంటుంది కదూ... ఆలస్యమెందుకు, వీటిని చూసేయండోసారి.

మసాలా సేవ్‌

కావలసినవి: సెనగపిండి: కప్పు, ఇంగువ: చిటికెడు, వంటసోడా: చిటికెడు, కారం: అరచెంచా, మిరియాలపొడి: పావుచెంచా, వేయించిన వాము పొడి: పావుచెంచా, జీలకర్రపొడి: అరచెంచా, సోంపుపొడి: పావుచెంచా, దాల్చినచెక్కపొడి: పావుచెంచా, లవంగాలపొడి:
పావుచెంచా, శొంఠిపొడి: అరచెంచా, నల్లఉప్పు: పావుచెంచా, ఉప్పు: పావుచెంచా, నిమ్మరసం: రెండు చెంచాలు, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీవిధానం: ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. తరువాత మూడు టేబుల్‌స్పూన్ల వేడినూనె వేసి అన్నింటినీ కలపాలి. ఇప్పుడు నీళ్లు చల్లుకుంటూ మురుకుల పిండిలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన మురుకుల గొట్టంలో వేసి కాగుతున్న నూనెలో వత్తుకుని, ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.


గుమ్మడి హల్వా

కావలసినవి: తీపి గుమ్మడికాయ తురుము: ఒకటిన్నరకప్పు, చక్కెర: ముప్పావుకప్పు, నెయ్యి: పావుకప్పు, ఫుల్‌క్రీమ్‌ పాలు: అరలీటరు, జీడిపప్పు పలుకులు: రెండు చెంచాలు, పిస్తా పలుకులు: రెండు చెంచాలు, యాలకులపొడి: అరచెంచా.
తయారీవిధానం: ముందుగా స్టౌమీద బాణలిపెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి గుమ్మడి తురుమును వేయించుకోవాలి. గుమ్మడి తురుము మెత్తగా అవుతున్నప్పుడు చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర కరిగాక పాలను పోసి మంట
తగ్గించాలి. మధ్య మధ్య కలుపుతూ ఉంటే.. హల్వా దగ్గరకు అవుతుంది. అప్పుడు నేతిలో వేయించిన జీడిపప్పు, పిస్తా పలుకులు, యాలకులపొడి వేసి దింపేయాలి.


బేసన్‌ కోకోనట్‌ బర్ఫీ

కావలసినవి: సెనగపిండి: కప్పు, కొబ్బరిపొడి: కప్పు, చక్కెర: కప్పు, నీళ్లు: అరకప్పు, నెయ్యి: అరకప్పు, జీడిపప్పు: అయిదు, బాదం: అయిదు, యాలకులపొడి: పావుచెంచా, పిస్తా పలుకులు: అలంకరణకోసం.
తయారీవిధానం: స్టౌమీద కడాయి పెట్టి నెయ్యి వేసి సెనగపిండిని బాగా వేయించుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదేవిధంగా కొబ్బరి తురుమును కూడా వేయించుకుని తీసుకోవాలి. ఆ బాణలిలోనే చక్కెర వేసి, నీళ్లు పోయాలి. చక్కెర కరిగి, తీగపాకంలా అవుతున్నప్పుడు యాలకులపొడి వేసి స్టౌ కట్టేయాలి. అందులో మొదట కొబ్బరితురుము, తరువాత సెనగపిండి, బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు వేసి బాగా కలిపి.. ఈ మిశ్రమాన్ని నెయ్యిరాసిన పళ్లెంలో పరవాలి. అయిదు నిమిషాల తరువాత ముక్కల్లా కోస్తే బర్ఫీ రెడీ.


సూర్యకళ

కావలసినవి: మైదా: కప్పు, కరిగించిన నెయ్యి: టేబుల్‌స్పూను, ఉప్పు: చిటికెడు, వంటసోడా: చిటికెడు. స్టఫింగ్‌కోసం: చక్కెరలేని కోవా: అరకప్పు, చక్కెరపొడి: పావుకప్పు, జీడిపప్పు: అయిదు, పిస్తా: పది, బాదం: అయిదు, యాలకులపొడి: అరచెంచా. పాకంకోసం: చక్కెర: కప్పు, నీళ్లు: అరకప్పు, యాలకులపొడి: పావుచెంచా.
తయారీవిధానం: ఓ గిన్నెలో మైదా, వంటసోడా, చిటికెడు ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. తరువాత నీళ్లు చల్లుకుంటూ చపాతీ పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిపెట్టి నూనె లేకుండా జీడిపప్పు, బాదం, పిస్తా పలుకుల్ని వేయించి.. తరువాత పొడి చేసుకోవాలి. తరువాత ఇందులో చక్కెరపొడి, యాలకులపొడి, కోవా వేసి కలుపుకోవాలి. అదేవిధంగా చక్కెర, నీళ్లు గిన్నెలో తీసుకుని స్టౌమీద పెట్టాలి. ఇది తీగపాకంలా అవుతున్నప్పుడు యాలకులపొడి వేసి దింపేయాలి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని తీసుకుని పూరీలా వత్తు కోవాలి. దానిమధ్యలో రెండు చెంచాలు కోవా మిశ్రమాన్ని ఉంచి.. పైన అదే సైజులో ఇంకో పూరీని ఉంచి అంచులు ఓ డిజైనులో వచ్చేలా మూసేయాలి. ఇలా చేసుకున్న వాటిని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకుని పాకంలో వేయాలి. పదినిమిషాలయ్యాక ఇవతలకు తీస్తే సరి.


క్యారెట్‌ వడ

కావలసినవి: సెనగపప్పు: ఒకటిన్నర కప్పు, కందిపప్పు: రెండు టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి: మూడు, సోంపు: చెంచా, క్యారెట్‌ తురుము: కప్పు, పుదీనా: కట్ట (సన్నగా తరగాలి), అల్లం తరుగు: చెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీవిధానం: సెనగపప్పు, కందిపప్పు, ఎండుమిర్చిని రెండు గంటల ముందుగా నానబెట్టుకోవాలి. తరువాత మరీ మెత్తగా కాకుండా గ్రైండ్‌ చేసి పెట్టుకోవాలి. ఇందులో కచ్చాపచ్చాగా దంచిన సోంపుతోపాటూ మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. దీన్ని చిన్నచిన్న వడల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.

Featured Image altimage 100X100No file chosen for 100X100 No file chosen for 365X255 No file chosen for 680X310 No file chosen for 175X250 Tags / Keywords Powered by MARGADARSI COMPUTERS-->


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని